.....
గుహుడు కనపడగానే రాముడి అంతరంగంలో ఆనందం పొంగి పొర్లింది.తన ఆత్మసమానుడైన సఖుడు తన ఎదురుగా ఉన్నాడు.అంతే !తన దృఢమైన బాహువులలో బంధించాడు.
ప్రాణ సఖుడిని కౌగలించుకొని క్షేమ సమాచారం కనుక్కొన్నాడు.
.
గుహుడి కంట నీరు ఆగటంలేదు, రామా! నీకు అయోధ్య ఎట్లో ఈ నగరమూ అంతే ,నీకోసం నన్నేం చేయమంటావో చెప్పు,నీ వంటి ప్రియాతిప్రియమైన అతిధి మరెవ్వరికైనా దొరుకుతాడా! అని పలికాడు.
.
మా రాముడొస్తున్నాడని భక్ష్య,భోజ్య,లేహ్య,చోష్య,పానీయాదులతో కూడిన అమృతప్రాయమైన తినుబండారాలు తెచ్చాడు గుహుడు.
అవి రాజులు ఆరగించేవి!.వాటిని తన ప్రియమిత్రుడికి అర్పించగా వాటిని సున్నితంగా తిరస్కరించాడు రాముడు.
.
తానిప్పుడు తాపసవృత్తి అవలంబించిన విషయం గుర్తుచేసి తను ఆహారంగా స్వీకరించేది కందమూలఫలాలు కావున పంచభక్ష్యపరమాన్నాలు తాను స్వీకరించలేను అని ,తన అశ్వాలు తన తండ్రిగారివికావున వాటికి శ్రేష్టమైన మేత తెప్పించమన్నాడు.అప్పుడు గుహుడు ఆ గుర్రాలకు ఆహార,పానీయాదులు అందచేశాడు.
.
రాముడు నారచీరను ఉత్తరీయంగా ధరించి సాయం సంధ్యను అర్చించి, లక్ష్మణుడు తెచ్చిన నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరించాడు.
.
చీకట్లు నలుదెసలను కప్పివేశాయి ,రాత్రి వేళ అది ! రాముడు భార్యాసమేతుడై కటిక నేలమీద పడుకున్నాడు . అది చూసిన గుహుడి దుఃఖమాగలేదు.
.
లక్ష్మణుడికి చక్కని పక్క ఏర్పాటు చేసి నీవుకూడా విశ్రమించవయ్యా అన్నాడుగుహుడు.మేమందరమూ శ్రమజీవులము నీవు రాకుమారుడవు రాముడి కోసం మేమంతా ఈ రాత్రి మేల్కొనే ఉంటాము నీవు హాయిగా నిదురపో!
.
రాముని రక్షణబాధ్యత నాది నేను నమ్ముకొన్న సత్యముపై వట్టేసి చెపుతున్నాను నాకు రామునికన్నా ప్రియమైనది ఈ ప్రపంచంలో లేదు. నీవు చింతలేకుండా నిదురపో అని అన్నాడు.
.
అప్పుడు లక్ష్మణుడు గాద్గదికమైన గొంతుతో !
ఎవరు ధనుస్సు ఎక్కుపెట్టి నిలుచుంటే సమస్త దేవగణాలు గజగజ వణికి పోతాయో!
ఎవరి ధనుష్ఠంకారము దానవుల గుండెల్లో గుబులు పుట్టిస్తుందో !
అట్టి జగదేకవీరుడు రాముడు నేడు నేలపై పవళిస్తే నాకు నిద్రెలా పడుతుంది?
నా తండ్రి ఎన్నో నోములు వ్రతాలు యజ్ఞాలు చేస్తే ఆయన కు లభించినవాడు ఈ రాముడు.
అట్టి పుణ్యాలప్రోవు రాముడు నేడు నేలపై నిదురిస్తూ ఉంటే నేనెలా విశ్రమించగలను.
ఈ రాముడు కనపడక ఆ తండ్రికూడా ఎక్కువ కాలం జీవించడు ,కొద్దికాలంలోనే ఈ భూమి భర్త లేనిదవుతుంది.
.
గుహుడు,లక్ష్మణుడు ధనుర్ధారులై వారిని సంరక్షిస్తూ ,ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ,సుమంత్రుడితో సంభాషిస్తూ ఉండగానే రాత్రి గడిచిపోయింది.
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి