*(98)*
*లక్ష్మీశ నీ దివ్య లక్షణ గుణముల వినజాల కెప్పుడు వెర్రినయితి*
*నా వెర్రి గుణములు నయముగా ఖండించి నన్ను రక్షింపుమో నళిననేత్రా*
*నిన్ను నే నమ్మితి నితరదైవములనే నమ్మలే దెప్పుడు నాగశయన*
*కాపాడినను నీవె కష్ట పెట్టిన నీవె నీపాద కమలముల్ నిరత మేను*
*నమ్మియున్నాను నీ పాదనళిన భక్తి వేగ దయజేసి రక్షించు వేదవేద్య*
*భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర*
శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామీ!
నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు.
పాపములను పారద్రోలు వాడవు.
దుష్టులను శిక్షించువాడవు.
తండ్రీ! లక్ష్మీపతీ! నీ కళ్యాణగుణములను ఎన్నడూ వినక వెర్రివాడను అయ్యాను.
నా వికారాలను ఖండించి, పద్మనేత్రా! నన్ను రక్షించు.
నిన్ను తప్ప చిల్లర దేవుళ్ళను నేను నమ్మలేదు ఎప్పుడు.
పన్నగశయనా! నీ చరణ కమలాలనే సదా నమ్మి ఉన్నాను.
కనికరించినా, కష్టపెట్టినా నీదే భారం.
నీ చరణకమల భక్తిని పూర్ణంగా ప్రసాదించి, నన్ను రక్షించు.
*జై నారసింహా*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి