*(01)* మహావీరుడూ, వాయుపుత్రుడూ అయిన హనుమంతుడు ఆ భవన సముదాయం మధ్యలో ఆకాశంలో ఎగురగల భవన వాహనమైన గొప్ప పుష్పక విమానాన్ని చూశాడు. ఆ పుష్పకం వజ్రాలూ, మాణిక్యాలు పొదుగబడి ఉండడంతో చిత్రవర్ణంతో ఒప్పారు తున్నది. దాని గవాక్షాలు పుటంపట్టిన బంగారంతో నిర్మితమై, నగిషీలతో అలరారుతున్నాయి.
*(02)* స్వయంగా విశ్వకర్మయే ఆ పుష్పకాన్ని రూపొందించి, దాని నిర్మాణ కౌశలాన్ని ప్రశంసించాడు. కనుక ఆ పుష్పకానికి చేసిన అలంకరణ సాటిలేనిదై విరాజిల్లుతూన్నది. అది ఆకాశాన వాయుమార్గంలో నిలబడినదై, సూర్యమార్గానికి చిహ్నంలా ప్రకాశిస్తూన్నది.
*(03)* ఆ విమానంలో విశేష ప్రయత్నంతో నిర్మితంకానిదీ, అమూల్య రత్నాలు పొదుగబడనిదీ ఏదీ లేదు. అందలి విశేషాలు దేవలోకంలో సైతం ఖచ్చితంగా ఉన్నాయని చెప్పలేము. దానిలో గొప్ప నిర్మాణాత్మక విశేషం లేనిది ఏదీ లేదు.
*(04)* ఆ విమానాన్ని రావణుడు తన పరాక్రమంతోనూ, గొప్ప తపశ్శక్తితోనూ సముపార్జించుకున్నాడు. సంకల్ప మాత్రాన అది కోరుకున్న ప్రదేశానికి పోగలదు. ఆయా భాగాలందు అనేక ఆకారాల విశేషాలతో నిర్మితమైనదీ, అక్కడక్కడ తుల్యమైన విశేషాల దర్శనం గలదీ అయిన విమానాన్ని హనుమంతుడు చూశాడు
*(05)* ప్రభువు మనస్సును ఎరిగి ఆ విమానం వాయువేగంతో సత్వరంగా పయనిస్తూ ఇతరులెవరూ ఆపడానికి వీలులేనిదై ఉన్నది. మహాత్ములు, పుణ్యాత్ములు, తేజసంపన్నులు, కీర్తిశాలురు, మహదానంద భరితులు అయిన ఇంద్రాదులు నివసించే స్వర్గాన్ని ఆ విమానం పోలి ఉన్నది
*జై శ్రీహనుమాన్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి