**దశిక రాము**
**ఆది శంకరాచార్య విరచిత**
**ఆత్మ బోధ**
(చివరి అధ్యాయం)
68 దిగ్దేశ కాలాద్యనపేక్ష్య సర్వగం
శీతాది హృన్నిత్య సుఖం నిరంజనం
యస్స్యాత్మ తీర్థం భజతే వినిష్క్రయః
స సర్వవిత్ సర్వగతో 2 మృతో భ##వేత్ || 68
„s¬sztsQäQû¸R…VM = సమస్త కర్మల్ని విడిచిపెట్టి, దిక్ + దేశ + కాల + ఆది = ప్రాచ్యులు పాశ్చాత్యులు అనేటటువంటి దిక్కు దేశం కాలం అనే మొదలైన వాటిని, అనపేక్ష్య = విడిచిపెట్టి, సర్వగం = సర్వమూ వ్యాపించింది, శీత + ఆది హృత్ = చల్లగా ఉంది వేడిగా ఉంది అనేటటువంటి ద్వంద్వాలను తొలగించింది, నిత్యసుఖం = నిరంతరం సుఖాల్ని ఇచ్చింది, నిరంజనం = దేన్ని అంటనిది అయిన, స్వ + ఆత్మ తీర్థం = తన ఆత్మ అనే తీర్థస్థానంలో, యః = ఎవడు, భజతే = ధ్యానిస్తాడో, సః = వాడు, సర్వవిత్ సర్వం తెలిసినవాడు, సర్వగతః = సర్వవ్యాపి, అమృతః = అమరుడు, భ##వేత్ = అవుతున్నాడు.
తా|| సమస్త కర్మల్ని విడిచిపెట్టి, ప్రాచ్యులు, పాశ్చాత్యులు అనే దిక్కు దేశం కాలం అనే వాటిని విడిచిపెట్టి, సర్వమూ వ్యాపించింది, శీతోష్ణాది ద్వంద్వాలను తొలగించింది, నిరంతరం సుఖాన్ని ఇచ్చింది, దేన్ని అంటనిది అయిన తన ఆత్మ అనే తీర్థస్థానంలో ఎవడు ధ్యానిస్తాడో వాడు సర్వం తెలిసిన వాడు, సర్వవ్యాపి, అమరుడు అవుతున్నాడు.
వివరణ :- సత్ స్వరూపమైన ఆత్మకు ఏవీ అంటవు. దానికి దేశం కాలం వ్వవహారం అనే పరిమితులు ఉండవు. అది ఎల్లవేళల ఎప్పుడూ వ్యాపించి ఉంటుంది. దానికి ద్వైత భావం లేనేలేదు. కాన అటువంటి ఆత్మతో ఎవడు జీవిస్తుంటాడో, అటువంటి వాడు సర్వకోరికల్ని విడిచిపెట్టి, సర్వకర్మల్ని విడిచిపెట్టి, రాగద్వేషాలు లేనివాడై, తన ఆత్మానందంలో జీవిస్తాడు. అట్లా ఉన్న మహనీయుడు తనే సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, బ్రహ్మము అయి జీవిస్తాడు. అటువంటివాడు అమృత తత్త్వాన్ని పొందుతాడు. ఆత్మనే ధ్యానిస్తూ ఆత్మతోనే జీవిస్తున్నవాడు ఆత్మ వేత్త అవుతాడు. ఆతడు ధన్యుడవుతాడు. ఎందుకంటే ఆతడే సర్వేశ్వరుడవుతాడు, ఆతడే సర్వం తెలిసినవాడవుతాడు, ఆతడే సర్వాంతర్యామి అవుతాడు, ఆతడే అన్నిటికీ కారణభూతుడవుతాడు. కావున అటువంటివాడు ఆనంద స్వరూపుడై జీవిస్తాడు.
సర్వత్రా కలుషితమై కనిపిస్తున్న ఈ సంఘానికి ఆత్మజ్ఞానమనే సాధనమార్గం ఈనాడు అందరికీ మృతసంజీవినిలా ఉపయోగపడుతుందని, అది అందరూ అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలుందని తెలియజేస్తున్నాను. దానికి అనుకూలంగా ఈ గ్రంథంలో భక్తి అక్కరలేదని ప్రబోధిస్తున్నానని భ్రమప్రమాదులకు ఎవ్వరూ లోనుకావద్దని హృదయ పూర్వకంగా అర్థిస్తున్నాను. భక్తి మార్గమనే సముద్రంలో జీవితమనే ఓడ ఎక్కి పయనిస్తున్నవాడు, మత మనే సముద్రంలో జీవితమనే ఓడ ఎక్కి పయనిస్తున్నవాడు, తన జీవితమనే ఓడలోంచి సముద్రంలోకి దూకాలని ఏనాడూ అనుకోడు. చుట్టూ ఉన్న వాతావరణం, సంఘం అంతా కూడా ప్రతిమానవుడికి సముద్రంలా కనిపిస్తుంటుంది. అటువంటి మానవుడికి భక్తి మార్గాన్ని వదలాలన్నా, తాను ఏ మతంలో జన్మించి జీవిస్తున్నాడో ఆ మతాన్ని వదలాలన్నా తన చుట్టూ ఆవరించి ఉన్న సముద్రమనే సంఘంలో ఏ ఆధారం లేకుండా మునిగిపోతానని భ్రమతో, నిశ్చేష్టతతో నిలిచిపోతుంటాడు. భక్తి, మతం అనేవి మానవునికి అనేక కోరికల్ని తీర్చి, శక్తిని ప్రసాదిస్తున్నాయి అని కూడా భ్రమపడుతూ జీవిస్తుంటారు. అట్లాటి మానవులకు సంత్ పురుషులు మీ దేహమే నావగా నిలిచి, గురుజ్ఞానమే తెడ్డుగా ఉపయోగపడి, గురుకృపే సముద్రపు అలలనుంచి రక్షించే దైవం అయి, గురువనే జ్ఞానమే రక్షణ కవచంగా ఏర్పడి మిమ్ముల్ని ఒడ్డుకు చేరుస్తాయి అని హామీ ఇస్తున్నారు, నిరూపించి చూపిస్తున్నారు.
కాన విజ్ఞులైనవారు వివేకంతో విజ్ఞాన దృష్టితో విషయాన్ని అర్థం చేసుకొని మనస్సును శుభ్రపరచాలి. అంతే కాని పైపై మైపూతల వల్ల, లోపల పేరుకుపోయిన దుష్టసంకల్పాలన్నీ తొలగిపోవు. దానికోసమే ఆత్మజ్ఞానం, ఆత్మమార్గం, ధ్యానపద్ధతి మానవులకు అవసరమై ఈనాడు కనిపిస్తున్నాయి.
మానవుని జీవన విధానంలో చేకూరే వాటిని ఆలోచించటానికి, ఆతని వయస్సును గురించి, ఆతని చేష్టలను గురించి అనుశ్రుతంగా మా ఇంటిలో మా పెద్దలు చెప్పుతూ ఉన్న ఒక కథను వివరిస్తాను. సృష్టికర్త అయిన బ్రహ్మ మానవుణ్ణి, గాడిదను, కుక్కను, కోతిని సృష్టించి అందరికీ కూడా నలభై సంవత్సరాల జీవన ప్రమాణాన్ని ఇచ్చానని చెప్పాడట. గాడిద తన జీవితమంతా బరువులు మోయటానికే సరిపోవటంతో ఈ బరువుల బాధను భరించలేక బ్రహ్మ దగ్గరకు వెళ్ళి నాకు ఈ గాడిద బరువుల బాధ వద్దు. నా వయః ప్రమాణాన్ని సగం తగ్గించండి అని వేడుకొందట. దాని బాధను విన్న బ్రహ్మ దాని వయః ప్రమాణాన్ని ఇరవై సంవత్సరాలు చేశానన్నాడట. కుక్కను అందరూ ఛీ, ఛీ అని కసరుకొంటుంటే ఆ బాధను సహించలేకపోయిన కుక్క బ్రహ్మ దగ్గరకు వెళ్ళి అందరు ఛీ, ఛీ అని కసురుకొంటూ దూరంగా పొమ్మని తోలుతున్నారు, ఈ బ్రతుకు భారం ఇంత వద్దు, నా వయస్సు సగం తగ్గించండి స్వామీ అని వేడుకొందట. దానితో బ్రహ్మ దాని బాధను అర్థం చేసుకొని దాని వయః ప్రమాణాన్ని ఇరవై సంవత్సరాలు చేశాడట. తర్వాత కోతి కూడా అదే విధంగా బ్రహ్మను చేరి నన్ను కోతి వేషాలని వెకిలి చేష్టలని తూష్ణీ భావంతో చూస్తూ నిందిస్తున్నారు కాన నాకు కూడా వయస్సు సగం తగ్గించండి అని వేడుకొందట. బ్రహ్మ అట్లాగేనని దానికి చెప్పి పంపాడట. ఆ మూడింటి తర్వాత మానవుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి నా వయస్సు పెంచాలండి, నేను చేయవలసిన పనులు చాలా మిగిలి పోయాయి కాన నాకు ఇంకా అరవై సంవత్సరాలు ఎక్కువ ఇవ్వాలి అని కోరుకొన్నాడట. బ్రహ్మ అట్లాగే ఇస్తానని చెప్పి గాడిద, కుక్క, కోతి తగ్గించుకొన్న వాటి మొత్తం అరవై ఏళ్ళు కలిపి మానవుణ్ణి నూరేళ్ళు బ్రతకమని చెప్పి పంపాడట. మానవుడు సంతోషం పట్టలేకపోయాడట. ఎంత ఎక్కువకాలం నేను బ్రతక గలుగుతున్నాను అంటూ సంబరపడిపోయాడట. మానవుడు నలభై ఏళ్ళు దాటాక పిల్లల పెళ్ళిళ్ళని, పిల్లల ఆస్తులు పెంచాలని, పిల్లల పిల్లలను అభివృద్ధి చేయాలని, ఇట్లా రకరకాల బరువు బాధ్యతలు గాడిదలాగా పెంచుకొంటూ, 60 ఏళ్ళ తర్వాత నా పిల్లలు, నా మనమలు, నా మనమరాళ్ళు అంటూ ప్రేమా, ఆప్యాయతలతో వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఛీ, ఛీ అని చీదరించుకొంటూ, దూరంగా ఉండమని కసరుకొంటూ కుక్కను తోలినట్లు అందరూ తోలుతూ వచ్చారట. అట్లా మానవుడు చీదరింపులు, చీత్కారాలతో 80 ఏళ్ళ వరకు కుక్క బ్రతుకు బ్రతికాడట. ఇక 80 ఏళ్ళ తర్వాత అందరూ కోతి పనులు చేస్తున్నాడంటూ అవతలకి తోలుతుంటే, నిందిస్తుంటే ఆ బాధలన్నీ భరిస్తూ మానవుడు నూరేళ్ళ వరకు గడిపాడట. ఆ విధంగా మానవుడు మానవుడుగా జీవించకుండా 40 ఏళ్ళు దాటిన తర్వాత గాడిద, కుక్క, కోతి వయస్సులు స్వీకరించి జీవించినందుకు వాటిలాగానే ప్రవర్తిస్తూ, వాటిలాగానే బాధల్ని అనుభవిస్తూ, కాలాన్ని వెళ్ళదీసి, జీవితం మీద విరక్తి కలిగి తనువును చాలించాడట. అందువల్ల ప్రతి మానవుడు తన జీవితం ఎట్లా ఉండాలి అనేది ముందుగానే బాగా ఆలోచించుకోవలసిన అవసరం ఉందని తెలుసుకొని, సుఖశాంతులనేవి దేనివల్ల లభిస్తాయో బాగా ఆలోచించుకొని జీవించటం నేర్చుకోవాలి. అప్పుడు ప్రతి మానవుడికి అతను జీవించటానికి కావలసిన జీవిత పథకం సక్రమమైన మార్గంలో నడవటానికి వీలు ఏర్పడుతుంది. ఆ విధంగా ఆలోచించినప్పుడు తెలివిగల మానవుడు ఆధ్యాత్మికంగా సద్గురువైన వానిని ఆశ్రయించి, ఆత్మజ్ఞానాన్ని తీసుకొని, ఆయన సత్సంగాల ద్వారా ఆనందాన్ని పొందుతూ సుఖంగా జీవించినప్పుడు జీవితం చరితార్థమవుతుంది ఈ విధంగా ఆలోచించిననాడు మానవుడు తామరాకు మీద నీటి బొట్టులా జీవిస్తూ కాలం గడపాలని తెలుసుకొంటాడు. అట్లా జీవించగలిగిన వాడు తాను తరించటమేగాక తన చుట్టూ ఉన్న వారిని సహితం ఉద్ధరించటానికి మార్గం ఏర్పరిచినవాడవుతాడు. కావున ఆత్మమార్గం అందరికీ సుఖశాంతుల్ని ఆనందాన్ని ప్రసాదిస్తుందని తెలుసుకొని సాధనచేసి తరించటానికి ప్రయత్నించండి.
*సర్వేజనా సుఖినోభవంతు*
సమాప్తం
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి