26, సెప్టెంబర్ 2020, శనివారం

మోహముద్గరము

 


        పద్యానవాదము

గోపాలుని మధుసూదన రావు 


కామ క్రోధాది మోహముల్ కరమువీడ 

అమరు , " నాతడె నేనను " యాత్మబుద్ధి 

ఆత్మజ్ఞానంబు నారీతి నరయడేని 

నరకమందున మూఢుడై నలిగిపోవు 26


విష్ణునామంబులను , గీత వినుచు పాడు 

ధ్యానమొనరించు శ్రీపతిన్ తన్మయమున 

సతత ముంచుము మదిని సత్సంగమందు 

దానమొనరించు ధనమును దీనులకును 27



మదిని భోగంబులందున మగ్నపరచ 

తదుపరొచ్చును రోగముల్ తనువునిండ 

అంత మరణంబె శరణంబు నంత్యమందు 

యైన వదలడు పాపము లవనియందు 28


ధనము వ్యర్థంబు లనుచుచు తలచు మెపుడు 

లేశమైనను సౌఖ్యంబు లేదు జగతి 

సంతు జూతురు యెపుడు నీ సంపదలను 

విహిత రీతిలొ సర్వుల విడువుమీవు 29



నిత్యమును ప్రాణయామంబు నెరపుచుంట 

యాత్మ యాత్మేతరంబుల ననయచింత 

జప సమాధుల మగ్నమై సతతముంట 

ననుసరించగ సమకూరు నాత్మ సిద్ధి 30



అనఘ ! గురుదేవు చరణంబులాశ్రయించి 

నియమమున యింద్రియంబుల నిగ్రహించి 

తలచిమది జన్మ మృత్యువుల్ దాటి నంత 

కాంచెదవు నీవు హృదయస్థ కమలనాభు 31


               *** శుభము ***

కామెంట్‌లు లేవు: