26, సెప్టెంబర్ 2020, శనివారం

: *ఓం నమో భగవతే వాసుదేవాయ

*




కలహాలు పెట్టి కడుపు నింపుకొనేవాడుగా నారదుడిని చిత్రించి, వినోదించడం మనకు అలవాటు అయింది. కాని నారద మహర్షి వేటికి మధ్య, ఎవరెవరికి మధ్య తగవులు పెడతాడు? తెలుసుకోవాలి.




ధర్మంతో అధర్మము, సత్యంతో అసత్యము తలపడేట్లు జేసి, అటు లీలా విభూతికీ (ఈ లోకం) నిత్య విభూతికీ (పరమ పదం) అధిపతి అయిన పరమాత్మ లీలలకు పూర్వ రంగం ఏర్పరచడం, ఉపకరణాలను సమకూర్చడం, ఆ లీలల్లో సహాయపడటం నారద మహర్షి వంటి మహనీయులు జగత్కల్యాణం కోసం చేస్తుంటారు. ఇందులో వారి స్వార్థం ఏమీ ఉండదు. అన్ని యుగాల్లో, అన్ని లోకాల్లో, అన్ని సమాజాల్లో, అన్ని కార్యాల్లో నారద మహర్షి నిరాటంకంగా ప్రవేశించి పనులు చక్కబెడుతూంటారు.




నారదుణ్ణి దేవతలే కాదు రాక్షసులు కూడా గౌరవిస్తారు. హిరణ్య కశిపుని భార్య నారద మహర్షి ఆశ్రమంలో తలదాచుకోవడం క్షేమమని భావిస్తుంది. వాల్మీకి, వ్యాసుడు, శుకుడు, ప్రహ్లాదుడు, ధృవుడు మున్నగు మహా పురుషుల్ని, మహా భక్తుల్ని నారదుడే తయారుచేశాడు.




త్రిలోక సంచారిగా వీణా తంత్రుల్లో నారాయణ నామాన్ని పలికిస్తూ, పరమాత్మ గుణానుభవంలో తన్మయత్మం పొంది ఎందరినో భగవద్భక్తులుగా చేస్తూండే నారద మహర్షి *భక్తి సూత్రాలు* గూడా రచించి వినుతికెక్కాడు.




*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: