దశిక రాము**
#శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము-14
శ్లోకం 08
**ఈశానః ప్రాణదః ప్రాణో**
**జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః|**
**హిరణ్యగర్భో భూగర్భో**
**మాధవో మధుసూదనః||**
65. ఈశానః --- సమస్తమునూ శాసించు వాడు; సకలావస్థలలోనూ సకలమునూ పాలించువాడు.
66. ప్రాణదః --- ప్రాణములను ప్రసాదించువాడు (ప్రాణాన్ దదాతి) ;ప్రాణములను హరించువాడు (ప్రాణాన్ ద్యాతి) ; ప్రాణములను ప్రకాశింపజేయువాడు (ప్రాణాన్ దీపయతి).
67. ప్రాణః --- ప్రాణ స్వరూపుడు; జీవనము; చైతన్యము.
68. జ్యేష్ఠః --- పూర్వులకంటె, వారి పూర్వులకంటె, పెద్దవాడు; తరుగని ఐశ్వర్య సంపదచే పెద్దవాడు, మిక్కిలి కొనియాడదగినవాడు.
69. శ్రేష్ఠః --- ప్రశంసింపదగిన వారిలోకెల్ల ఉత్తముడు.
70. ప్రజాపతిః --- సకల ప్రజలకు ప్రభువు, తండ్రి; నిత్యసూరులకు (పరమపదము పొందినవారికి) ప్రభువు.
71. హిరణ్యగర్భః --- రమణీయమగు స్థానమున నివసించువాడు, పరంధాముడు; సంపూర్ణానందమగువానిని ప్రసాదించువాడు; చతుర్ముఖ బ్రహ్మకు ఆత్మయై యున్నవాడు.
72. భూగర్భః --- భూమిని (కడుపులో పెట్టుకొని) కాపాడువాడు; విశ్వమునకు పుట్టినిల్లు అయినవాడు.
73. మాధవః --- మా ధవః -శ్రీమహాలక్ష్మి (మా) కి భర్త ; మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడువాడు; సకల విద్యా జ్ఞానములకు ప్రభువు; పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు; మధు (యాదవ) వంశమున పుట్టినవాడు; తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు) ; మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు.
74. మధుసూధనః --- మధు, కైటభులను రాక్షసులను సంహరించినవాడు; బంధకారణములైన కర్మఫలములను నాశనము చేయువాడు.
శ్లో. ఈశాన ప్రాణదః ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః
హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధు సూదనః !! 8 !!
---------------------------------( నామాలు 64 ... 73 )
16. పాలనంబు సేయు ప్రాణ దాత యతడు
ప్రాణమతడె మరియు ప్రధముడతడె
పరమ పురుషుడైన పరమేశుడే వాడు
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : ఈశానః ... పాలకుడు, ప్రాణదః ... ప్రాణము పోయువాడు, ప్రాణః ... ప్రాణములు, జ్యేష్ఠ ... పెద్దవాడు, శ్రేష్ఠ ... గొప్పవాడు, ప్రజాపతిః ... ప్రజలందరికీ అధిపతి.
భావము : సకల లోకాలకు పరిపాలకుడు, జవము, జీవమూ తానై అందరికీ తానే అందించే వాడు, దేవతలందరిలోకీ అగ్రజుడు, పరమ పురుషుడు, సర్వలోకాలకూ అధిపతి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
17. పసిడి నందు బుట్టె బ్రహ్మ గాగ నతడు
పుడమి దాచి గాచె కడుపు నందు
మాధవుడును యతడె మధుసూదనుడాయె
వందనాలు హరికి వంద వేలు !!
(అర్థాలు : హిరణ్య గర్భో ... స్వర్ణమయమైన గర్భము నందు జన్మించిన వాడు, భూగర్బో ... భూమిని గర్భము నందు దాచుకున్నవాడు, మా ధవుడు ... లక్ష్మీపతి, మధుసూదనః ... మధు అనే రాక్షసుని చంపిన వాడు.
భావము : స్వర్ణమయమైన గర్భము నందు జనించిన చతుర్ముఖుడు అనగా బ్రహ్మ, తల్లి మాదిరి భూమిని గర్భము నందు దాచి కాచిన వాడు( కడుపులో పెట్టుకుని దాచడం), మా అనగా లక్ష్మి ధవ అనగా భర్త ... కనుక మాధవుడనగా శ్రీదేవి భర్త అయిన శ్రీహరియే, మధుకైభులలో ఒకరైన మధును చంపిన వాడు శ్రీహరి.అట్టి శ్రీహరికే శత సహస్ర వందనాలు.)
**ఓం నమో నారాయణాయ**. 🙏🙏
**ధర్మో రక్షతి రక్షితః**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి