26, సెప్టెంబర్ 2020, శనివారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

పొల్లుపోని మాట..


శ్రీ స్వామివారితో మా తల్లిదండ్రుల పరిచయాని కంటే ముందుగానే శ్రీ చెక్కా కేశవులు గారికి సాన్నిహిత్యం ఉండేది..మాలకొండలో శ్రీ స్వామివారు తపోసాధన చేసే రోజుల్లో..శ్రీ స్వామివారికోసం ఒక మంచం, దోమతెర ఇత్యాదులు తీసుకొచ్చి ఇచ్చారు..శ్రీ కేశవులు గారు అత్యంత భక్తిగా శ్రీ స్వామివారిని కొలిచేవారు..తరువాత కాలంలో మా తల్లిదండ్రులు శ్రీ స్వామివారిని నమ్మి కొలవడం..అదే క్రమం లో చెక్కా కేశవులు గారు కూడా మా అమ్మా నాన్న గార్లతో పరిచయం పెంచుకొనడం జరిగిపోయాయి..శ్రీ స్వామివారు ఆశ్రమం నిర్మించుకోవడానికి శ్రీ కేశవులు గారు విజయవాడ వద్ద స్థలం ఇస్తామన్నారు.. కానీ శ్రీ స్వామివారు సున్నితంగా తిరస్కరించారు..మొగలిచెర్ల లోని ఫకీరు మాన్యాన్ని తన ఆశ్రమ వాసానికి అనువైనది అని నిర్ధారించుకొని..అక్కడ ఆశ్రమం నిర్మాణం చేశారు..ఆశ్రమ నిర్మాణానికి శ్రీ బొగ్గవరపు మీరాశెట్టి దంపతులు ఆర్ధిక సహకారం అందించారు..


శ్రీ స్వామివారు మొగలిచెర్ల లో ఆశ్రమం లో స్థిరపడ్డ తరువాత..శ్రీ కేశవులు గారు తరచూ మొగలిచెర్ల వచ్చేవారు..మా ఇంట్లోనే బస చేసేవారు..అలానే శ్రీ మీరాశెట్టి దంపతులు కూడా వచ్చి వెళ్లేవారు.. నావరకూ నాకు, అటు కేశవులు గారివద్ద కానీ...ఇటు మీరాశెట్టి గారి వద్ద కానీ బాగా చనువు ఉండేది..వాళ్ళూ నన్ను ఆదరించేవారు..ఎప్పుడైనా మొగలిచెర్ల లోని మా ఇంటివద్ద నుండి శ్రీ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళడానికి మా తల్లిదండ్రులకు వీలు కుదరని పక్షంలో..కేశవులు గారితో కలిసి నేను ఆశ్రమానికి వెళ్ళేవాడిని..కేశవులు గారికోసం నాన్నగారు గూడుబండి (ఎడ్ల బండి) సిద్ధం చేయించేవారు..మీరాశెట్టి గారు వాళ్ళ ఊరు నుండి వచ్చే దారిలోనే శ్రీ స్వామివారి ఆశ్రమం ఉండేది కనుక..వారు వస్తూ వస్తూ నే శ్రీ స్వామివారి ఆశ్రమం వద్ద కలిసి వచ్చేవారు..మీరాశెట్టి దంపతులు ఎన్నడూ ఎడ్లబండి ఎక్కేవారు కాదు..ఆ దంపతులిద్దరూ కాలినడకనే (సుమారు పదకొండు కిలోమీటర్లు రానూ..మళ్లీ అంతే దూరం పోనూ..) వచ్చి వెళ్లేవారు..


ఒకసారి శ్రీ కేశవులు గారు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి మొగలిచెర్ల వస్తూ ఉండగా..కందుకూరు లో వారికొక మనిషి పరిచయం అయ్యాడు..మాటల సందర్భం లో అతనికి వివాహం జరిగి ఏడు సంవత్సరాలైందనీ..సంతానం కలుగ లేదనీ..తాను తన భార్యా దిగులు చెందుతున్నామనీ చెప్పాడు..(1975 నాటి ముచ్చట ఇది)..అతని పేరు హరి చౌదరి.. శ్రీ కేశవులు గారు తాను మొగలిచెర్ల లో తపస్సు చేసుకుంటున్న శ్రీ దత్తాత్రేయ స్వామివారిని కలవడానికి వెళుతున్నాననీ..తనతో పాటు వచ్చి, ఆ స్వామివారి దగ్గర ఆశీర్వాదం పొందితే..ఫలితం ఉంటుందనీ చెప్పారు..అతనూ సరే నన్నాడు..ఇద్దరూ కలిసి, మొగలిచెర్ల బస్ ఎక్కి వచ్చేసారు..మా ఇంటికి వచ్చిన తరువాత..శ్రీ కేశవులు గారికోసం నాన్నగారు బండి కట్టించారు..కేశవులు గారు నన్నూ తనతో రమ్మన్నారు..నేనూ ఉత్సాహంగా బయలుదేరాను..కేశవులు గారు, వారితోపాటు హరి చౌదరి, వీళ్లద్దరితో పాటు నేనూ ముగ్గురం శ్రీ స్వామివారి ఆశ్రమానికి సాయంత్రం ఐదు గంటలకు చేరాము..శ్రీ స్వామివారు ధ్యానం లో వున్నారు..గది తలుపులు వేసి ఉన్నాయి..గంట గడిచింది..రెండు గంటలు పూర్తి అయ్యాయి..శ్రీ స్వామివారు బైటకు రాలేదు..చీకటి పడింది..ఆశ్రమం లో ఉన్న వంట గదిలోంచి లాంతరు తీసుకొచ్చి వెలిగించాను..మరో గంట గడిచింది..శ్రీ స్వామివారు రాలేదు..ఇక ఈరోజుకు శ్రీ స్వామివారిని కలిసే అవకాశం లేదని ముగ్గురమూ వెనక్కు వచ్చేసాము..


ఆరోజు రాత్రికే హరి చౌదరి తనకు శ్రీ స్వామివారి వద్ద ఆశీర్వాదం పొందే ప్రాప్తం లేదని..పైగా తెల్లవారి అత్యవసర పనులున్నాయనీ..రాత్రికే ఆఖరి బస్ కు కందుకూరు వెళ్ళిపోయాడు..తెల్లవారింది..మళ్లీ శ్రీ కేశవులు గారు ఆశ్రమానికి వెళ్ళొస్తానన్నారు..బండి సిద్ధం కాగానే..కేశవులు గారు, నేనూ ఇద్దరమూ ఆశ్రమానికి వచ్చాము..చిత్రంగా శ్రీ స్వామివారు ఆశ్రమ బైట నిలబడి వున్నారు..శ్రీ కేశవులు గారిని చూడగానే..

"కేశవులు గారూ..నన్ను ప్రశ్నలు చెప్పేవాడిగా మారుద్దామనుకుంటున్నారా?..తలరాతను నేను మార్చగలనా?..." అన్నారు..


కొంచెం సేపు కేశవులు గారు మౌనంగా వుండి.."స్వామీ..అతను చాలా బాధపడుతుంటే..చూడలేక మీ వద్దకు తీసుకొచ్చాను..మీరు ఆశీర్వదిస్తే..అతనికి సంతానం కలుగుతుందని నేనే నచ్చ చెప్పాను..తీరా ఇక్కడికొస్తే..మీరు ధ్యానం లో వున్నారు.." అన్నారు..


స్వామివారు పెద్దగా నవ్వి.."నేను చేసేదేముంది..అతనికి సంతానయోగం ఉంది..మరో ఏడాది కి పిల్లలు పుడతారు..ఆ మాటే చెప్పండి మీరు..పిల్లలు పుట్టిన తరువాత ఈ ఆశ్రమానికి వచ్చి ఆశీర్వాదం పొందమని చెప్పండి.." అన్నారు..ఆ తరువాత కేశవులు గారితో దాదాపు గంటసేపు ఇతర విషయాలు మాట్లాడారు..కేశవులు గారు కూడా ఎంతో సంతోషం తో, తృప్తితో..శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకున్నారు..నేనూ శ్రీ స్వామివారి పాదాలకు నమస్కారం చేసాను..

"చదువుకోసం ఎప్పుడు కనిగిరి కి పోతున్నావు?.." అని నన్ను అడిగారు.."వచ్చే ఆదివారం దాకా సెలవులున్నాయి..ఆదివారం మధ్యాహ్నం వెళతాను.." అన్నాను.."వెళ్లేముందు రోజు మీ అమ్మానాన్న తో పాటు ఇక్కడకు రా!" అన్నారు..సరే అన్నాను..


శ్రీ కేశవులు గారు ఆరోజు తిరిగి విజయవాడ వెళ్లిపోయారు ..పోతూ పోతూ కందుకూరు లో హరిచౌదరి కి శ్రీ స్వామివారు చెప్పిన మాట చెప్పి వెళ్లారు..ఆ ప్రక్క సంవత్సరం అనగా 1976, మే 6వతేదీ శ్రీ స్వామివారు సిద్ధిపొందారు..తరువాత ఆగస్ట్ నెలలో హరి చౌదరి కి మొదటి సంతానంగా అమ్మాయి పుట్టింది..మరో మూడు నెలలకు హరి చౌదరి దంపతులు బిడ్డనెత్తుకొని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..శ్రీ స్వామివారి సమాధి వద్ద బిడ్డను పడుకోబెట్టి..కన్నీళ్లు పెట్టుకున్నాడు..


శ్రీ స్వామివారు చెప్పిన మాట పొల్లుపోలేదు.."సంతానం కలిగిన తరువాత ఆశ్రమానికి వచ్చి ఆశీర్వాదం పొందమని " చెప్పారే కానీ..తాను నేరుగా కలుస్తానని చెప్పలేదు..హరి చౌదరి తన కూతురికి "దత్త లక్ష్మి" అని పేరు పెట్టుకున్నాడు..


శ్రీ కేశవులు గారు మొగలిచెర్ల వచ్చినప్పుడు..ప్రతిసారీ ఈ సంఘటన గుర్తు చేసుకునే వారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: