26, సెప్టెంబర్ 2020, శనివారం

: *జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్

*




సందేహం;- ప్రసిద్ధ విదుర నీతిలో విద్యను గురించి, విద్యార్థులను గురించి ఏమైనా చెప్పబడిందా?




సమాధానం;- మహాభారతంలో లాగే, విదురనీతిలో గూడ చెప్పని విషయం లేదు.




*సత్యేన రక్ష్యతే ధర్మః విద్యా యోగేన రక్ష్యతే*


*మృజయా రక్ష్యతే రూపం కులం వృత్తేన రక్ష్యతే*




ధర్మం సత్యం చేత రక్షింపబడుతుంది. విద్య అభ్యాసం చేత రక్షింపబడుతుంది. విద్య మనసుకు వివేక వికాసాలను కలిగిస్తుంది. అరగదీస్తున్న గంధపు చెక్క చక్కని సువాసనల్ని వెదజల్లినట్లు అభ్యాసంతో కూడిన విద్య కీర్తి ప్రఖ్యాతులను దశదిశలకు విస్తరింపజేస్తుంది. ఒంటికి నలుగుపెట్టుకొనడం చేత రక్త ప్రసరణ బాగా జరిగి, శరీరం ఆరోగ్యాన్ని కాంతిని పొందుతుంది. అలాగే వంశం మంచి ప్రవర్తన చేత రక్షింపబడుతుంది అంటాడు విదురుడు.




*ఆలస్యం మదమోహౌచ చాపలం గోష్ఠిరేవచ*


*స్తబ్ధతాచాభి మానిత్వం తధా అత్యాగి త్వమేవచ*


*ఏతైవై సప్తదోషాన్యుః సదా విద్యార్థి నాం మతాః*




ఆలస్యం, అహంకారం, చంచలత్వం, అదన (అనవసర) ప్రసంగం స్తబ్ధత్వం అభిమానం (గర్వం), లోభం అనే ఏడు దోషాలు విద్యా సంపాదనకు ఆటంకాలని విదురుని ఉపదేశం.




*అశుశ్రూషా, త్వరా, శ్లాఘా విద్యాయాః శత్రవంత్రయః* 




గురు సేవా రాహిత్యం, తొందరపాటుతనం, ఆత్మస్తుతి అనే ఈ మూడు విద్యకు శత్రువులని విదుర ఉపదేశామృతం.  




*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: