జయంతితే సుకృతినో రస సిద్దాః కవీశ్వరాః
నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయం
శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రమణ్యంగారు లబ్ధప్రతిష్టులైన గాయకులు. వారు దాదాపుగా 40 వేలకు పైగా పాటలు పాడటము,అవికూడా జనరంజకము కావడము, కొన్ని కోట్లమంది ప్రజల హృదయములలో పాట ద్వారా సుస్థిరమైన స్థానము సంపాదించు కోవడము అంత తేలిక అయిన విషయము కాదు. బహుశా వారి నాన్నగారు చేసిన గొప్పతపస్సు వారిని అంత యశో విరాజితులను చేసిందని నేను వ్యక్తిగతముగా నమ్ముతూ ఉంటాను. బాలసుబ్రమణ్యంగారి నాన్నగారు శ్రీ పండితారాధ్యుల సాంబమూర్తిగారు నెల్లూరులో హరికధలు చెపుతూ ఉండే వారు. 19 సం || పాటు ఉంఛవృత్తి చేసి నెల్లూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాలు చేస్తూ ఉండేవారు. మొదటి భిక్ష బాలసుబ్రమణ్యంగారి అమ్మగారు పెడుతూ ఉండేవారు. అపర త్యాగరాజులాగే 'మనసా ఎటులోర్తునో' కీర్తన పాడుతూ వీధి వీధి తిరిగి భిక్ష స్వీకరించి రామపాద పూజలో తరించే వారు. నెల్లూరు పట్టణానికి ఎందరో సంగీత విద్వాంసులను పిలిపించి సంగీత కార్యక్రమములు నిర్వహిస్తూ ఉండేవారు. ఆయన యొక్క అపారమైన భక్తి వారు చేసిన త్యాగరాజ ఆరాధనోత్సవాల ఫలితముగా బహుశా బాల సుబ్రహ్మణ్యం గారు ఆయనకు కుమారుడిగా జన్మించారు. ఆయన జీవితము నిజానికి పూలుపరచిన పడక కాదు. చిన్నతనములో ఆయన పడ్డ కష్టములు అన్నీఇన్నీ కావు. ఎన్ని ఊళ్లు మారారో వాళ్ళ అమ్మగారి చేతికిఉన్న విసన కర్ర కాడ దెబ్బలు ఎన్నిమాట్లు తిన్నారో! దీపావళి పండగ వస్తే ఒక సిల్కు లాల్చి కోనుక్కోవడము 10 రూ. పెట్టి దీపావళి సామాను కొనుక్కోవడము ఎంతో కష్టము. అటువంటి బాలసుబ్రమణ్యంగారిని వాళ్ళ అమ్మగారు ఒళ్ళో పడుకో పెట్టుకుని – మణీ! నాన్న కష్ట పడుతున్నారు పరాయి ఇంట్లో ఉంటున్నాము. చదువుకోమంటే ఏదో ఒక పనిపెట్టుకుని మాటి మాటికి నాన్నగారిని డబ్బులు అడిగితే కష్ట పడతారు అని వాళ్ళ అమ్మగారు నచ్చ చెపుతూ ఉండేవారు. చిన్నతనములో బాలసుబ్రమణ్యంగారిని వాళ్ళ నాన్నగారి స్నేహితుల దగ్గరకు వెళ్ళి డబ్బు అప్పుగా తీసుకుని రమ్మంటే ఎంతో బిడియ పడుతూ వెళ్ళి తీసుకుని వచ్చేవారని ఆయన వ్రాసుకున్నారు. అన్ని కష్టములు పడి సంగీతము మీద అభిరుచి భగవంతుని యొక్క అనుగ్రహముగా ఏర్పడిన తరవాత వెనక్కి తిరిగి చూడలేదు. ఒకసారి చలనచిత్రములలో నేపథ్య గానము పాడటము ప్రారంభము చేసిన తరవాత ఆయన ఎవరి కంఠము అయినా సరే అంత అద్భుతముగా అనుకరించే వారు. ఆ నటుడే పాడితే ఎలా ఉంటుందో బాలసుబ్రమణ్యంగారు పాడితే అలా ఉండేది. ఎందరికో నటులకు వారి కంఠమును డబ్బింగ్ కోసమని అద్భుతముగా వెచ్చించారు. ఆయా నటులు అంత లబ్ధప్రతిష్టులు కాగలిగారు అంటే దానిలో బాలసుబ్రమణ్యంగారు చేసిన సేవ, వారు చూపించిన సౌహార్ద్రము ఎంతో ఉన్నది. ఆయన గొప్ప నటులు, గొప్ప సంగీత విద్వాంసులు. ఎన్నో పాటలు పాడారు. ఆయన గురుముఖతః సంగీతము నేర్చుకోకపోయినా భగవంతుడు ఆయనకు అంత గొప్ప సంగీతవిద్య ఇచ్చారు. ఎన్ని పాటలు పాడారో, ఎంత భావయుక్తముగా పాడారో. ఉచ్ఛారణ గురించి ఎంత జాగ్రతలు తీసుకునేవారో. ఏ పదమైనా శాస్త్రీయముగా ఉచ్ఛరించి అర్థము చెడిపోకూడదని జాగ్రత తీసుకునేవారు. అన్నిటినీ మించి విశాల హృదయము కలిగిన స్నేహశీలి. శాంతా బయోటెక్ వ్యవస్థాపకులైన శ్రీ వరప్రసాద్ గారికి అత్యంత ఆత్మీయులు. వారిని అనేక సందర్భములలో కలుసుకోవడము జరిగింది. పెద్దల పట్ల వారి గౌరవము చాలా చాలా గొప్పగా ఉండేది. అంత స్థాయి కలిగిన వ్యక్తి , ఆకాశమంత ఎత్తు ఎదిగిన వ్యక్తి ఇంత వినయముతో ప్రవర్తించడము సాధ్యమవుతుందా? అనిపించేది. పెద్దలు కనపడితే అంత వినయముతో ప్రవర్తించేవారు. ఎంతో సమయ పరిపాలన చేసేవారు. అందరినీ ఆదుకునేవారు. గొప్ప భక్తి కలిగిన వ్యక్తి. వారికి గోసేవ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది. అన్నిటినీ మించి వారిలో ఉన్న చాలా చాలా గొప్ప విషయము ఎక్కడ మంచి ఉన్నా గ్రహించేవారు. ఏ కార్యక్రమమైనా దానిని అడ్డు పెట్టి సమాజానికి మంచిని అందించే ప్రయత్నము చేసేవారు. లబ్ధప్రతిష్టులైన గాయకులు, గాయనీ మణులు తయారు కావాలన్న ఉద్దేశ్యముతో etv లో ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమములో వేదికకు ఎందరో గాయకులను పరిచయము చేసారు. స్వరాభిషేకము అన్న పేరుతో ఎప్పుడూ నిత్య నూతనమైన పాటలను పాడుతూ, వెనక ఉన్న నేపథ్యమును, కవి ఏ సందర్భములో పాట వ్రాసారు? నటీ నటులు ఎలా నటించారు ? ఆ దర్శక ప్రతిభ ఏమిటి? పాట వ్రాసిన కవి ఎంత భావ స్ఫూరకముగా ఆ గీతము రచించారు? అన్న విషయములు చెపుతుంటే ఎంతో అద్భుతముగా అనిపించేది. వ్యక్తిగతముగా ఆయన కారణజన్ముడు అనిపిస్తుంది. 74 సం || ల వయసులో అన్ని వేల పాటలు గురువు దగ్గర సంగీత అభ్యాసము లేకుండా పాడగలగడము, అంతమంది నటుల కంఠమునకు సరిపోయేట్టుగా పాడగలగడము , విరుపు దగ్గర నుంచి మాట వరకు అంత గొప్పగా ఉండగలగడము అంతగా వదగ గలగడము ఆయనకు ఆయనకే చెల్లింది. అంత గొప్పవారు బాలసుబ్రమణ్యంగారు.
ఆయన ఇవ్వాళ శరీరము విడిచి పెట్టి ఉండవచ్చుగాక! కానీ ఆయన ఎప్పటికీ అలాగే శాశ్వతముగా ఉండిపోతారు. ఎందుచేత అనగా సాగరసంగమము చలన చిత్రములో చిట్టచివర విశ్వనాథ్ గారు ఒక శ్లోకము చెప్పిస్తారు. యశ శరీరము కలిగిన మహానుభావులకు జరా మరణములు ఉండవు. శరీరము ఉన్నంత కాలమే మిగిలిన వారి యొక్క వాణి వినపడుతుంది. ఇటువంటి లబ్ధప్రతిష్టులైన వారి శరీరము కాలగతిలో వెళ్ళిపోయినా వారి కంఠము వినపడుతూనే ఉంటుంది. ఎన్ని లలిత గీతములు పాడారో. ఎన్ని భక్తి గీతములు పాడారో, ఎన్ని సందేశాత్మకమైన గీతములు పాడారో. ఆయా సభలలో, ఆయా సందర్భములలో, మనసుకి ఉత్సాహము కలగవలసిన సందర్భములలో జనులు నిరంతరముగా పాటలు వింటూనే ఉంటారు. అటువంటి కీర్తి శరీరము కలిగిన బాలసుబ్రమణ్యంగారికి జరా మరణములు ఉంటాయని నేను నమ్మటము లేదు. భర్తృ హరి తన నీతిశతకములో చెప్పినట్టు
నాస్తి తేషాం యశః కాయే |
జరామరణజం భయమ్ ||
విశ్వనాథ్ గారు ఆయనతో ఎందుకు ఆ శ్లోకము పాడించారో అది ఆయన విషయములోనే నిజమైంది. వారు పరమేశ్వరుడి అనుగ్రహము చేత పునరావృత్తి లేని స్థితిని పొందాలని ఈశ్వరుడు తన విభూతిని ఆయన పట్ల అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా నమస్కరించి ప్రార్థన చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క బాధను, హృదయపూర్వకమైన సంతాపమును తెలియ చేసుకుంటున్నాను.
- బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి