29, ఆగస్టు 2023, మంగళవారం

🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -32🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -32🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*“ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !*

*వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !!*


తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. 


శ్రీ మహావిష్ణువు తిరుమలలో మొదటిసారి వెలసింది మొదలు ఇప్పటివరకు మొత్తం మూడుసార్లు ఆలయ నిర్మాణం జరిగింది. విశ్వకర్మ, తొండమాన్ చక్రవర్తి- ఇద్దరు కట్టించిన రెండు ఆలయాలు ఇప్పటికీ సప్తగిరుల్లో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నాయి.


 మూడోసారి భరద్వాజ మహర్షి కట్టించిన ఆలయమే నేటి తిరుమల క్షేత్రంగా భాసిల్లుతోంది. అప్పటినుంచి తిరుమలేశుడు దేవదేవుడిగా పూజలందుకుంటున్నాడు.


ద్వాపరయుగం చివర్లో, కలియుగం ఆరంభాన స్వామివారికి తొండమాన్ చక్రవర్తి ఒక ఆలయం కట్టించారు. రెండు గోపురాలు, మూడు ప్రకారాలతో వేంకటేశ్వరస్వామికి ఆలయం నిర్మించినట్టు అష్టాదశ పురాణాల్లో ఉంది.


అయితే, తొండమాన్ చక్రవర్తి కట్టించిన గుడి కూడా కొన్ని నైసర్గిక వైపరీత్యాల వల్ల కాలగర్భంలో కలిసిపోయింది. 


దాంతో స్వామివారి దివ్యమంగళ అర్చావతార స్వరూపం కూడా భూగతమైపోయింది. 


రెండో ఆలయం కూడా శిథిలం కావటంతో చాలాకాలం తర్వాత మళ్లీ శ్రీనివాసుడి కోసం ఆలయ నిర్మాణం జరిగింది. 


1900 సంవత్సరాల క్రితం భరద్వాజ మహర్షి ఆధ్వర్యంలో దేవాలయం నిర్మించారు. తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ఆలయ అర్చకులు శ్రీ గోపీనాథ దీక్షితులు, మరో గ్రామానికి చెందిన యాదవునికి స్వామివారు ఒకేసారి కలలో కనిపించారు. 


తన అర్చావతార స్వరూపం స్వామివారి పుష్కరిణికి దక్షిణం దిశగా ఒక చింతచెట్టు కింద భూగతమై ఉన్నట్టు చెప్పారు. దానిని వెలికితీసి అదే చోట మళ్లీ ప్రతిష్టించమని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం వాళ్లిద్దరూ దివ్యమంగళ స్వరూపం కోసం వెతుకుతూ వెళ్లి ఒక చోట కలుసుకుంటారు. 


ఇద్దరూ కలిసి చెట్టు కింద స్వామివారి రూపాన్ని కనుగొంటారు. తర్వాత కపిలగోవు పాలను కుండల్లో తీసుకొచ్చి పుట్ట మీద పోస్తారు. దాంతో పుట్టమన్ను కరిగిపోయి, అర్చావతారంలో ఉన్న స్వామివారు దర్శనమిస్తారు. సరిగ్గా అదే చోట భరద్వాజ మహర్షి ఆధ్వర్యంలో వైఖానస ఆగమోత్తంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేశారు


భరద్వాజ మహర్షి నిర్మించిన ఆలయాన్ని అనేక మంది రాజులు, రారాజులు అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఆలయం చుట్టుపక్కల అనేక నూతన నిర్మాణాలు చేపట్టారు. తరతరాలుగా భరద్వాజ గోత్రానికి చెందిన గోపీనాథ దీక్షితుల వంశం వాళ్లే స్వామి వారికి సేవలు అందిస్తున్నారు. వారికి మాత్రమే మూలవిరాట్టుని తాకే అర్హత ఉంది. 


 క్రీ.శ.614. పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దారణ కావింపబడింది. సామవై పెరిందేవి క్రీ.శ. 614 లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది. అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి శ్రీ వైఖనస భగవఛ్ఛాస్త్రోక్తంగ ప్రతిష్టింపజేసింది. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది


ఆ వెండి విగ్రహాన్ని మనవాల పెరుమాల్ అని పిలుస్తారు. అప్పటికే స్వామివారి ఆలయంలో గర్భాలయం, అంతరాలం, విమాన గోపురం ఉన్నాయి.

అంతరాలం అనేది స్వామివారికి ఏకాంత సేవ జరిపే శయన మంటపం! ఈ మంటపం బయట రాములవారి మేడ ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు స్వామివారి ఆలయ ప్రదక్షిణ ఉండేది. 


1150వ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. స్వామివారి విమాన ఆకారాన్ని పెంచి, ఆ బరువును మోయడానికి గర్భాలయ గోడలను మరింత పటిష్టం చేశారు.


 ఆ క్రమంలోనే ప్రస్తుతమున్న వైకుంఠ ప్రదక్షిణ ఏర్పాటు చేశారు. రాములవారి మేడను మూసేసి అర్థమంటపం, ముఖ మంటపం కట్టారు. గరుడాళ్వార్ సన్నిధి, ఇరువైపులా ద్వారపాలకులను కూడా ఆసమయంలోనే నిర్మించారు. ప్రదక్షిణ మార్గంలో ఈశాన్యం వైపు యోగ నరసింహస్వామి దేవాలయం, ఆగ్నేయంలో వరదరాజులస్వామి వారి ఆలయం, దక్షిణ ఆగ్నేయంలో యాగశాల మంటపం, పచన మంటపం, పాకశాల నిర్మించారు. అప్పుడే విమాన ప్రదక్షిణం ఏర్పడింది. 


గరుడాళ్వార్ సన్నిధి వెనకవైపు ధ్వజస్తంభం, బలిపీఠాన్ని ప్రతిష్టించారు. ఆ సమయంలోనే రెండో ప్రాకారంగా పిలిచే వెండివాకిలి నిర్మించారు.

13వ శతాబ్దంలో శ్రీవారి ఆలయానికి మరిన్ని హంగులద్దారు. ఆలయం బయట రంగనాయకుల మండపాన్ని నిర్మించారు. 


అప్పుడే అద్దాల మండపం కూడా కట్టారు. ఈ అద్దాల మండపంలోనే వరాహస్వామి కొలువై ఉండేవారని చెప్తుంటారు. అప్పట్లో అక్కడ ఒక పూలబావి ఉండేది. 14వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల హయాంలో మహద్వార గోపురం, మహాప్రాకారం నిర్మించారు. 


మహద్వార గోపురం లోపల 16 స్తంభాలతో ప్రతిమా మంటపాన్ని కట్టారు. అందులో శ్రీ కృష్ణ దేవరాయలు ఒక సామాన్య భక్తుడిగా తన ఇద్దరు రాణుల ప్రతిమలను ఏర్పాటు చేయించారు. ఆ రెండు విగ్రహాలు స్వామివారికి నమస్కరిస్తున్నట్టుగా కనిపిస్తాయి. 


అప్పటికే ఆలయంలో సుమారు 9, 10 శతాబ్దాల్లో నిర్మించిన వెయ్యి కాళ్ల మంటపం, వాహన మంటపం ఉండేవి. తిరుమల వెంకన్న ఆలయంలోని మండపాలు, ప్రాకారాలు, సోపానాలు, జలాశయాలే కాదు- ప్రతీరాయి ప్రతీస్తంభం వైఖానస ఆగమశాస్త్రం ప్రకారమే నిర్మించారు. ఎక్కడా శాస్త్రాన్ని మీరలేదు. కించిత్ వాస్తుదోషం లేకుండా దివ్యక్షేత్రంగా తిరుమల ఆలయ నిర్మాణం జరిగింది.


 ఒకపక్క వరదహస్తం మరోపక్క కటిహస్తంతో నిశ్చలానంద మందార మకరందంతో కనిపించే శ్రీనివాసుడి రూపం మధురం! ఆయన నామం బతికించే సిద్ధమంత్రం! ఆయన పాదం పరమపదం! అందుకే వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన! ఎన్నిసార్లు కైమోడ్పులు అర్పించినా.. పునర్‌దర్శనం ఇప్పించు స్వామీ అని వేడుకుంటాం.


పద్మావతీస గోవిందా, పద్మ మనోహర గోవిందా, ఆనంద నిలయ గోవిందా, ఆనంద రూపా గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||32


మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, పురాణ గాథల కోసం *సనాతన హిందూ ధర్మం* పేజీని లైక్ చేసి ఫాలో చేయండి.


ఈ పోస్ట్ నచ్చితే షేర్ చేయండి.


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: