29, ఆగస్టు 2023, మంగళవారం

రామాయణమ్ 308

 రామాయణమ్ 308

...

ఆశ్చర్యము ! అద్భుతము ! అక్ష కుమారుని వధ అనితరసాధ్యము ఒక్క హనుమంతుని వలననే అది సాధ్యపడినది.అని దేవతలందరూ కూడా ఆ అనిలసుతుని పరాక్రమాన్ని వేనోళ్ళపొగడగా అవి ఏవీ పట్టనట్లుగా ప్రజలను సంహరించడానికి తీరిక చేసుకొని కూర్చున్న యముడివలే రాబోయే యోధులకొరకు స్వామి నిరీక్షిస్తూ ఉన్నాడు.

.

అక్షకుమారుని మరణవార్త తక్షణమే రాక్షసరాజు చెవినబడ్డది.ఒక్కసారిగా ధిగ్గుమనిలేచాడు కాసేపటికి మనస్సు కుదుట పరచుకొన్నాడు  తీవ్రమైన కోపము తో ఇంద్రజిత్తు కేసి చూసి వెంటనే యుద్ధరంగానికి బయలు దేరమని ఆదేశించాడు.

.

కుమారా ! నీవు శస్త్రాస్త్రకోవిదుడవు నీ రణకౌశలాన్ని దేవతలుకూడా ఎరిగియున్నారు.

.

భుజబలములో,తపోబలములోనీకు సాటి రాగలవాడు ముల్లోకాలలో ఎవ్వడూ లేడు ,ఏ దేశములో ,ఏకాలములో ఏ పని చేయవలెనో ఎరిగిన వాడవు.

.

కింకరులు పోయినారు తిరిగిరాలేదు 

జంబుమాలి జాడలేకుండా పోయినాడు

అమాత్యపుత్రులు రణమందు అణగిపోయినారు

నీ సోదరుడు అక్షుడు ఇప్పుడు యముడికి అతిథిగా పోయినాడు.

.

వారెవరికీ నీకున్న బలము లేదు , నా వారసుడవు నీవే!

.

నాయనా ఆ వానరుని బలాన్ని అంచనా వేయుటలో పొరపడకుము! నీ బలము అతని బలము బేరీజువేసుకొని మరీ యుద్ధము కొనసాగించు ...విజయుడవై తిరిగిరా అని తండ్రి పంపగా మహోత్సాహంతో ఉత్సవము చేసుకుంటూ హనుమంతుడిని పట్టుకోవడానికి బయలుదేరాడు ఇంద్రజిత్తు..

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: