19, సెప్టెంబర్ 2023, మంగళవారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-51🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-51🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*తిరుమల బ్రహ్మోత్సవాలు:*


తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి 'బ్రహ్మోత్సవాలు' అయ్యాయని అంటారు. మరో వ్యాఖ్యానం ప్రకారమైతే- నవాహ్నిక దీక్షతో, నవబ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి 'బ్రహ్మోత్సవాలు'. అసలీ ఉత్సవాలకూ బ్రహ్మదేవుడికీ సంబంధంలేదనీ తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే, ఇవి చాలా పెద్దయెత్తున జరిగేవి కాబట్టి వీటిని 'బ్రహ్మోత్సవాలు' అంటారనీ ఇంకొందరి భావన. ఈ ఉత్సవాలన్నీ పరబ్రహ్మస్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని 'బ్రహ్మోత్సవాలు' అంటున్నారని మరికొందరి భావన.

బ్రహ్మోత్సవాలలో రకములు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం 9 రోజులు కన్నులపండువగా జరుగుతాయి. 'నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి' అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో- అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారు. స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి, భక్తిపారవశ్యంతో పునీతులవుతారు.

నిత్య బ్రహ్మోత్సవం

ప్రతి సంవత్సరం నిర్ధారిత మాసంలో నిర్ధారిత నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మోత్సవాలు. ఇవి మూడురోజులుగానీ అయిదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు రోజులుగానీ జరుగుతాయి.

శాంతి బ్రహ్మోత్సవం

కరవు, కాటకాలు, భయాలు, ప్రమాదాలు, వ్యాధులు, గ్రహపీడల నివారణ కోసం ప్రత్యేకంగా జరిపించేవి 'శాంతి బ్రహ్మోత్సవాలు'. ఇలాంటి శాంతి బ్రహ్మోత్సవాలను గత చరిత్రకాలంలో చాలామంది ప్రభువులు, దేశ, ప్రాంత, జనహితార్థం అయిదు రోజులపాటు నిర్వహించిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి.

శ్రద్ధా బ్రహ్మోత్సవాలు

ఎవరైనా భక్తుడు, తగినంత ధనాన్ని దేవస్థానంలో, దైవసన్నిధిలో సమర్పించి, భక్తిశ్రద్ధలతో జరిపించుకొనేది 'శ్రద్ధా బ్రహ్మోత్సవం'. శ్రీవారి ఆలయంలో ఇలాంటి శ్రద్ధా బ్రహ్మోత్సవాలను 'ఆర్జిత బ్రహ్మోత్సవాలు'గా పేర్కొంటున్నారు.

ఒకరోజు బ్రహ్మోత్సవం

రథసప్తమి రోజు స్వామిని సప్తవాహనాలలో ఊరేగిస్తారు. అందువల్ల దీనిని ఒకరోజు బ్రహ్మోత్సవమని చెబుతారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభించి, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనంలో స్వామిని ఊరేగిస్తారు. చక్రస్నానానంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలలో ఊరేగిస్తారు. సప్తాశ్వాల, సప్తమి నాటి, సప్తవారాల సంకేతంగా సూర్యుడు పుట్టినప్పుడు ఈ ఉత్సవం జరుగుతుంది.


అంకురార్పణ:

స్వామివారి బ్రహ్మోత్సవాలు 'అంకురార్పణ'తో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల ఆరంభదినానికి ముందురోజుగానీ మూడు రోజులు, అయిదు రోజులు, ఏడు రోజులు, తొమ్మిదిరోజుల ముందుగానీ అంకురార్పణ జరుగుతుంది. ఇలా నిర్ధారితమైన రోజున, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకై స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు, ఆలయంలో నైరుతిథిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. ఆ తర్వాత, నిర్ణీత పునీత ప్రదేశంలో, భూదేవి ఆకారాన్ని లిఖించి, ఆ ఆకారమునందు లలాట, బాహు, స్తన ప్రదేశాలనుంచి మట్టిని తీసి, స్వామివారి ఆలయంలోకి వస్తారు. దీన్నే 'మత్సంగ్రహణం' అంటారు. యాగశాలలో, ఈ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో- శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలను పోసి, పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికలలోని నవధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. అందుకే ఈ వేడుకలన్నీ శుక్లపక్షంలో జరుగుతాయి. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తర్వాత పూర్ణకుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరుపోసి, అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇదే 'అంకురార్పణ' అయింది.


*మొదటి రోజు ధ్వజారోహణం:*

 

వేంకటేస్వరుడికి ముందుగా ఊరేగింపుకు వచ్చే బ్రహ్మరధం

బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం 'ధ్వజారోహణం'. ఆరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాలసేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయసన్నిధిలోని ధ్వజస్తంభంమీద పతాకావిష్కరణ చేస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్త వస్త్రంమీద గరుడుడి బొమ్మ చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీన్ని 'గరుడధ్వజపటం' అంటారు. దీన్ని ధ్వజస్తంభంమీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. గరుడధ్వజపటాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో- గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి చేరుస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే- సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రం. అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకూ ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ, రాక్షసగణాలకు, వారివారి నిర్ణీత స్థలాలను కేటాయించి, పద్ధతి ప్రకారం, వారి నియమాల ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే.


బ్రహ్మోత్సవాలు రెండో రోజు

శేషవాహనం

 

*శ్రీవారి శేష వాహనం:*

 

శ్రీవారి చిన్నశేష వాహనం

ధ్వజారోహణం తర్వాత, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, వాహన మంటపంలో ఉన్న పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రంగనాయక మంటపంలో విశ్రమింపజేస్తారు. స్వామి శేషతల్పశాయి. ఆయన కొలువున్న కొండ- శేషాద్రి. అందుకే ఏడు తలలున్న పెద్ద శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనదిగా పరిగణిస్తారు. వెుదట్లో ఈ పెద్ద శేషవాహనాన్ని తొమ్మిదోరోజు ఉదయంపూటనే ఊరేగింపునకు వినియోగించేవారు. కానీ ఇప్పుడు అది మొదటిరోజుకే వచ్చి చేరింది.

గతంలో స్వామివారి ఊరేగింపునకై రెండు, మూడు, నాలుగు, ఏడోరోజులలో ఎలాంటి వాహనాలనూ వినియోగించేవారు కాదు. కానీ ఇప్పుడారోజుల్లోనూ వాహనసేవ జరుగుతోంది. అందులో భాగంగా రెండోరోజు ఉదయం, ఉత్సవమూర్తిని ఐదు తలలుండే చిన్న శేషవాహనం మీద ఊరేగిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే, చిన్న శేషవాహనాన్ని 'వాసుకి'కి ప్రతీకగా పరిగణించటం కద్దు. రోజూ సాయంత్రం వేళలో స్వామివారిని హంస వాహనంమీద వూరేగిస్తారు. ఈ హంసవాహనం మీద స్వామి, విద్యాలక్ష్మీగా వూరేగటం విశేషం.

ధ్వజారోహణం తెల్లవారి ఉదయం మలయప్ప స్వామి చిన్న శేష వాహనం పై నాలుగు మాడ వీధులలో విహరిస్తారు.


 చిన్న శేషుడు అనగా శేషుని తమ్ముడు వాసుకి. ఈ వాసుకి శ్రీమన్నారాయణుని ఆజ్ఞతో క్షీరసాగర మదన సమయంలో మందర పర్వతానికి కవ్వపు తాడుగా మారి సముద్రాన్ని చిలకడానికి సహాయం చేశాడు. స్వామి ఆజ్ఞతో తన పడగల నుండి అనగా ముఖముల నుండి విషజ్వాలలు చిమ్ముతూ రాక్షసులను మూర్ఛాక్రాంతులను చేశాడు. తన విషమును సముద్రమున ఉద్గారం(వాంతి) చేసి సముద్రంలో హాలాహలం పుట్టడానికి తన వంతు సేవ చేసి శంకరునికి ఆ హాల హలాన్ని పానం చేసి లోకాలను రక్షించే అవకాశాన్ని ఇచ్చి దానికి కృతజ్ఞతగా శంకరుని చేతికి కంకణమైనాడు. తన చెల్లె లైనా ‘జగత్కారు’ ని ‘జగత్కారు’ అనే మహర్షికి ఇచ్చి వివాహం చేసి బ్రహ్మ ఆజ్ఞను పాటించి ఆ దంపతుల సంతానమైన ఆస్తీకునితో జన్మయజయుడు ఆచరించిన సర్పయాగాన్ని నివారించి అఖిల నాగులకు జీవితాన్ని ప్రసాదించిన మహానుభావుడు ‘వాసుకి’. అందుకే మలయప్ప స్వామి వాసుకికి రెండవ సేవా భాగ్యాన్ని ప్రసాదించాడు.



*మూడో రోజు సింహవాహనం*

 

శ్రీవారి సింహ వాహనం

మూడోరోజు ఉదయం శ్రీవారికి సింహ వాహనసేవ జరుగుతుంది. ఆ సమయంలో స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమయి ఉంటారు. జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనీ తలపైన ఆదిదేవుడిని ధరించాలనీ చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు.


 ఆరోజు రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి, అచ్చమైన భోగశ్రీనివాసునిగా *ముత్యాలపందిరి* వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు తెల్లటి ముత్యాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన వాహనంపై స్వామివారు వూరేగుతూ భక్తులకు అభయప్రదానం చేస్తారు.

అంతకు ముందు రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వూంజల్సేవ నిర్వహించనున్నారు.


సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపిస్తున్నారు....

జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనీ తలపైన ఆదిదేవుడిని ధరించాలనీ చెప్పే ప్రతీకగా ఈ *సింహవాహనం* పై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు.

రాత్రి ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలో పోటీ పడుతూ విద్యుద్ధీపకాంతులతో తళుకులీనే ముత్యాలపందిరి వాహనంలో మలయప్పస్వామి విహరిస్తారు.


ముత్యాలు విలువైనవి. చల్లదనాన్ని ప్రసాదిస్తాయి. అంతటి ప్రాశస్త్యమైన ముత్యాలను పందిరిగా చేసుకున్న వాహనంలో మలయప్ప స్వామి చూడముచ్చటగా ఆసీనులై భక్తులకు అభయప్రదానం చేస్తారు ఈ పందిరిలో శ్రీవారిని దర్శించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ప్రశాంతత చోటుచేసుకుంటుంది.


*శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱.

కామెంట్‌లు లేవు: