19, సెప్టెంబర్ 2023, మంగళవారం

నవగ్రహ పురాణం - 58 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 58 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*సూర్యగ్రహ చరిత్ర - 1*



తన సంతానం - శనైశ్చరుడూ , సావర్ణి , తపతీ పెద్దవాళ్లయ్యే కొద్దీ - ఛాయ సంజ్ఞ పిల్లలకు మానసికంగా బాగా దూరంగా జరిగింది. వైవస్వతుడినీ , యముడినీ , యమినీ చూడడానికే ఆమె ఇష్టపడడంలేదు.


ఛాయ తన బిడ్డలు ముగ్గుర్నీ రహస్యంగా సమావేశపరిచింది. *"వైవస్వతుడూ , యముడూ , యమి మంచి వాళ్ళు కారు. వాళ్ళకు మీరు దూరంగా ఉండాలి"* అంది. ముగ్గురూ ముఖాలు చూసుకొన్నారు.


*“అన్నలిద్దరూ మంచివాళ్ళమ్మా !”* సావర్ణి ఆశ్చర్యపోతూ అన్నాడు.


*“నాకు కూడా అలాగే అనిపిస్తుంది ! వైవస్వతుడు , యముడూ మాతో చక్కగా ఆడుకుంటారు !”* శనైశ్చరుడు ఛాయనే చూస్తూ అన్నాడు.


*“వాళ్ల మనసులు మీకు తెలీవు ! మీరు చిన్న పిల్లలు...”* ఛాయ చెప్పుకుపోతోంది. 


*"అక్క యమి చాలా మంచిదమ్మా ! నేను ఏది కావాలన్నా అడ్డు చెప్పకుండా ఇచ్చేస్తుంది తెలుసా !"* తపతి ఛాయ వైపే చూస్తూ అంది.


ఛాయ అసహనాన్ని దాచుకుంటూ నిట్టూర్చింది. *"మీకో నిజం తెలుసా ? మంచివాళ్ళకు సర్వమూ మంచిగానే , అందరూ మంచివాళ్ళగానే అనిపిస్తారు !”* 


*“అయితే మేం మంచి వాళ్ళమా అమ్మా ?"* శని ఆసక్తిగా అడిగాడు.


*“అందుకే గద నాయనా ! ఆ ముగ్గురూ మంచి వాళ్ళు కాకపోయినా మీకు మంచివాళ్ళుగా కనిపిస్తున్నారు !”* ఛాయ తెలివిగా అంది. *“వాళ్ళు ముగ్గురూ ఎంత చెడ్డ వాళ్ళంటే , మీ పరోక్షంలో మీ గురించి నాతో చెడుగా చెబుతూనే ఉంటారు. అయినా , నేను నమ్మనుగా ! మీరు చాలా మంచివాళ్ళనీ , చాలా బుద్ధిమంతులనీ , అమ్మ మాట జవదాటరనీ నాకు తెలుసుగా !"*


శనీ , సావర్జీ , తపతీ అనుమానంగా ఒకర్నొకరు చూసుకొన్నారు. ముందుగా శని పెదవి విప్పాడు.


*“అందుకేనేమో వాళ్ళను చూసినప్పుడల్లా ఎందుకో తెలియకుండానే నాకు కోపం వస్తూంటుంది. గుడ్లు ఉరిమి ఆగ్రహంగా చూడాలనిపిస్తుంది !"* 


ఛాయ శనిని ఆప్యాయంగా చూసింది. *"చూశారా ! ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి...".*


*"అంటే..."* తపతి అమాయకంగా అడిగింది. *"ఏం చేయాలి ?"*


*"మీరు ముగ్గరూ ఒక బృందంగా కలిసి ఉండాలి. ఆ ముగ్గురితో కలవకూడదు. అర్ధమైంది కదా ?"* ఛాయ అడిగింది.


*"మా బృందానికి నేను నాయకుడిని ! సరేనా , అమ్మా !"* శని ఉత్సాహంగా అడిగాడు.


*"ఔను ! మీలో పెద్దవాడివి నువ్వేగా , నాయనా ! అయితే ఒక ముఖ్యమైన విషయం. నేను మీతో చెప్పిందంతా వైవస్వతుడికీ , యముడికీ , యమికీ చెప్పకూడదు. అలాగే మీ తండ్రిగారికీ చెప్పకూడదు !"* ఛాయ గొంతు తగ్గించి అంది. 


*"నాన్నగారికి చెప్తే ఏం ?"* శని అనుమానం వ్యక్తం చేశాడు.


*“చెప్పకూడదు. అన్నాను కద !"* ఛాయ విసుగ్గా అంది. 


*"ఎందుకు ?"* శని మొండిగా అడిగాడు.


*"మీ నాన్నగారు నమ్మరు ! ఆయనకి వాళ్ళంటే ఎక్కువ ఇష్టం !"* ఛాయ అంది. 


*"అలాగా...మాకు తెలీదమ్మా !”* సావర్ణి ఆశ్చర్యంగా అన్నాడు. 


*"అందుకే మీరెప్పుడూ అమ్మ మాటే వినాలి !"* అంది ఛాయ.


ఛాయ ప్రబోధం ఆమె పిల్లల్లో మార్పు తెచ్చింది. వాళ్ళు సంజ్ఞ సంతానానికి దూరంగా ఉండటం ప్రారంభించారు. ముందుగా ఆడపిల్లలైన యమి , తపతి అభిప్రాయభేదాలకు అంకురార్పణ చేశారు. తల్లి మాటల్ని పూర్తిగా నమ్మిన తపతి యమి పట్ల ఇన్నాళ్ళూ ఉన్న ప్రేమను ద్వేషంగా మార్చుకుంది.


రోజులు గడిచే కొద్దీ ఛాయలో సంజ్ఞ బిడ్డల పట్ల వేళ్ళుతన్నిన ద్వేషం కొద్దికొద్దిగా వ్యక్తం కాసాగింది.


తల్లిలో కనిపిస్తున్న మార్పు వైవస్వతుణ్ణి , యముడినీ ఆశ్చర్యంలో పడవేసింది. తల్లి తనను చూస్తున్న విధానం వల్ల యమి అమితంగా బాధపడసాగింది. ముగ్గురూ , తమలో తాము బాధపడుతూ ఉండిపోయారు.


*“అమ్మ మనల్ని సరిగ్గా చూడడం లేదు. శనినీ , సావర్ణినీ , తపతినీ ప్రత్యేకంగా చూసుకుంటోంది. అమ్మలో వచ్చిన మార్పు మన మనసుల్ని బాధపెడుతోంది. నాన్నగారికి చెప్పాలి"* యముడు ఆవేశంగా అన్నాడు.


*"అమ్మ మంచిది కాదని నాన్నకు చెప్పడం తప్పు , తమ్ముడూ !”* వైవస్వతుడు యముడి భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు.


*"తప్పెందుకవుతుంది ? తప్పు చేసే వాళ్ళ గురించి పెద్దలకు చెప్పడం తప్పు కాదు. ధర్మం తప్పి ప్రవర్తించే వాళ్ళని వదిలి పెట్టరాదన్నయ్యా ! తల్లి అయినా , తండ్రి అయినా అంతే ! ధర్మం ధర్మమే ! అధర్మం అధర్మమే !"*


*"ఈ మధ్య నువ్వు ధర్మం గురించి ఎక్కువగా చెప్తున్నావు , యమా !"* వైవస్వతుడు నవ్వుతూ అన్నాడు.


*"అవును !"* యముడు వైవస్వతుడిని తదేకంగా చూస్తూ అన్నాడు. *"మీకు గుర్తుందో లేదో...మన తమ్ముడు శని జన్మించినప్పట్నుంచీ అమ్మ మారిపోయింది. సావర్ణి పుట్టాక ఇంకొంచెం , తపతి పుట్టాక మరికొంచెం - వాళ్ళు ముగ్గురూ పెద్ద వాళ్ళయ్యాక - ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అమ్మ !”*


*"ఏమో , యమన్నయ్యా ! నేను గమనించలేదు !"* అంది యమి. 


*"నేను కూడా !"* వైవస్వతుడు అన్నాడు. *"నువ్వెలా గమనించగలిగావో నాకు తెలీదు !"*


*"ఎలా గమనించానంటే - అమ్మ కళ్ళు చూసి ! ఆ తపతినీ , సావర్ణినీ , శనినీ చూస్తున్నప్పుడు అమ్మ కళ్ళు దీప కళికల్లా మెరుస్తాయి. మనల్ని చూసినప్పుడు అగ్ని గోళాల్లా మెరుస్తాయి"* యముడు వివరిస్తూ అన్నాడు. *"అమ్మ కళ్ళల్లో నాకు మన పట్ల ద్వేషం కనిపిస్తుంది , తెలుసా ? ఇప్పుడు అమ్మ మాటల్లో కూడా మన పట్ల అయిష్టత స్పష్టంగా వ్యక్తమవుతోంది !"*


*"అమ్మ... ఎందుకిలా అయిపోయిందన్నయ్యా !"* యమి వైవస్వతుణ్ణి అడిగింది అమాయకంగా. *“ఆలోచిస్తుంటే , నాకూ నిజమే అనిపిస్తోంది. తపతిని మెచ్చుకుంటుంది. నేను - కంటపడితే చాలు - కసురుతుంది !"*


*“బిడ్డలందర్నీ సమానంగా చూడడం తల్లిదండ్రుల విధి ! అది ధర్మం ! ఈ సారి అమ్మ పక్షపాతం చూపిస్తే నేను ఊరుకోను !"* యముడు నిష్కర్షగా అనేసి , అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.


*"యముడు ఎప్పుడూ 'ధర్మం , ధర్మం' అంటూ వుంటాడు ! ఏం చేస్తాడో ఏమో !"* వైవస్వతుడు ఆందోళనగా అన్నాడు. 


*“ఏం చేస్తాడు ? 'ధర్మం, ధర్మం' అనే వ్యక్తి ధర్మమైందే చేస్తాడు !"* యమి యముడు

వెళ్ళినవైపే చూస్తూ అంది.

కామెంట్‌లు లేవు: