మనం ఇంతకు ముందు ఎన్నో జన్మలు ఎత్తి ఉంటాం, ఆ జన్మల పుణ్య ఫలితంగా మానవ జన్మ వచ్చింది. కాని ఎవరూ మళ్ళీ జన్మ లేకుండా ముక్తి కొరకు ప్రయత్నం చేయడం లేదు. కొంత మంది ఇహలోక సుఖాలు, భోగాలు అనుభవించడం కొరకు ఆరాటపడుతుంటే, మరి కొంత మంది స్వర్గలోక సుఖాల కొరకు యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. ఇంకా కొందరు వచ్చేజన్మ మంచి రావాలని మరో మంచి జన్మకోసం ఆరాటపడుతున్నారు. ఈ మానవులలో అతి కొద్ది మంది మాత్రమే ఈ జనన మరణ చక్రం నుండి ముక్తి కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో జన్మలో కొద్ది కొద్దిగా పుణ్యం సంపాదించుకుంటూ, పోగుచేసుకుంటూ, జ్ఞానం సంపాదించుకొని, గతజన్మ వాసనలను పోగొట్టుకుంటూ చివరికి పరమాత్మకు తనకు భేదం లేదు అనే స్థితికి చేరుకుంటున్నారు. అప్పుడు సర్వం పరమాత్మ మయంగా కనిపిస్తుంది.
లక్షల్లో ఒకడికి వచ్చే లాటరీ టిక్కట్టును, ఆ లాటరీ తనకే తగులుతుంది అనే ఆశతో కొనంగా లేనిది, ఆ ముక్తి నాకే వస్తుంది అని ముక్తి కొరకు ఎందుకు ప్రయత్నించకూడదు.
"జన్మసార్ధకం అవ్వాలంటే ముక్తికోసం సాధన తప్పనిసరిగా చేయాలి."
అబ్బో! ఎన్నో జన్మల తరువాత వచ్చే ముక్తి కోసం ఇప్పటి నుండే ఎందుకు తాపత్రయపడటం దండగ అని చేతులుముడుచుకొని కూచోకూడదు. ఎందుకంటే, ఎప్పుడో 21 ఏళ్ల తరువాత వచ్చే ఇంజనీరింగ్ డిగ్రీకి ఇప్పటి నుండే చదవడం ఎందుకు అని ఊరికే కూర్చోవడంలేదుగా!
5వ ఏటనుండి ABCD లతో చదువు మొదలు పెడుతున్నాము కదా! ప్రస్తుతం ఒకటో క్లాసు నుండి ఐఐటి కోచింగులు ఇచ్చే స్కూళ్లు కూడా మొదలైయ్యాయి. ఇదీ అలాగే అనుకోవాలి. ఇప్పటి వరకు ఎన్ని జన్మలు గడిచిపోయాయో! ఏమో! ఇదే ఆఖరి జన్మేమో.. కాబట్టి ఇప్పుటీనుండే ప్రయత్నం మొదలెట్టాలి.
🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి