19, సెప్టెంబర్ 2023, మంగళవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 26*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 26*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


         *విరించిః పంచత్వం వ్రజతి హరి రాప్నోతి విరతిం*

         *వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |*

         *వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా*

         *మహాసంహారేఽస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ ||*


నాలుగో పాదంలో *మహా సంహారే అస్మిన్* అని అన్నారు. ఏమిటీ మహాసంహారము అంటే, బ్రహ్మ గారికి నూరు కల్పాలు పూర్తయితే, మహాకల్పము అంటారు. అప్పుడిక ఆయన పని అయిపోతుంది. ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు ఎలా ఉంటుందో వివరిస్తున్నారు.

కల్పాంతం వేరు, యుగాంతం వేరు.యుగాంతంలో మార్పులుంటాయి కానీ ప్రళయం, జగత్తు మాయం అవటం వుండవు. అది కల్పాంతంలో జరుగుతుంది.


అస్మిన్ = ఆ సమయంలో


విరించిః పంచత్వం వ్రజతి = బ్రహ్మ మరణిస్తాడు.


హరిరాప్నోతి విరతిం = స్థితి చేయటానికి సృష్టి జరగలేదు కాబట్టి విష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు.


వినాశం కీనాశో భజతి = యముడు కూడా వెళ్ళిపోయాడు. దిక్కులే లేవు కనుక దిక్పాలకులూ లేరు.


ధనదో యాతి నిధనమ్ = కుబేరుడు కూడా. ఆయనా ఒక దిక్పాలకుడేగా!


వితంద్రీ మాహేంద్రీ వితతిరపి = ఇంద్రులంతా వెళ్లిపోయారు.


సంమీలితదృశా విహరతి సతి త్వత్పతి రసౌ = 22 వ శ్లోకార్ధం లో చెప్పుకున్నాము సత్ అంటే ఎప్పుడూ ఉండేవాడని. అమ్మవారికి అన్వయిస్తే సతి అవుతుందని. ఆమె శాశ్వతమైన ఉనికి కలది.*దేశ కాలా పరిచ్చిన్నా* ఆమె.

ఈ జగత్తు అంతా నాశనమవుతుంటే ఆయన, ఆవిడా విహరిస్తూ చూస్తూ ఉంటారట. ఆయన నాట్యం చేస్తుంటే, ఆమె చూస్తూ ఆనందిస్తుందట. గుర్తు తెచ్చుకోండి--అమ్మవారి నామాల్లో *మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ*


అమ్మా ! మహా ప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మ, విష్ణువు కూడా అంతమును పొందెదరు. అందరికీ మృత్యు పాశములు వేయు యముడు కూడా మృత్యువును పొందుచున్నాడు. ధనమునకు అధిపతి అయిన కుబేరుడు కూడా మరణము చెందుచున్నాడు. ఇంద్రుడు మున్నగు దేవతలు, మునులు కూడా అంతము చెందుచున్నారు. అటువంటి మహా ప్రళయమునందు కూడా నీ పతి యగు సదాశివుడు నిన్ను చేరి స్వేచ్చగా నీతో విహారము చేయుచున్నాడు కదా ! 


360 మానవ సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం.

12 వేల దేవతల సంవత్సరాలు ఒక చతుర్యుగం.నాలుగు యుగాలు కలిపి మనుష్యమానంలో 

43 ,20 ,000 సంవత్సరాలు.

అలాటి 2 వేల చతుర్యుగాలు బ్రహ్మకు ఒక అహో రాత్రం. (ఒక పగలు, ఒక రాత్రి)

ఇటువంటి 360 బ్రహ్మ దివసాలు ఒక బ్రహ్మ మాన సంవత్సరం.

అలాటి 50 బ్రహ్మ వత్సరాలు ఒక పరార్ధం. బ్రహ్మ జీవిత కాలం 2 పరార్ధాలు. మన లెక్కలో 31104 కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు మనం రెండవ పరార్ధంలో వున్నాము.


వెయ్యి చతుర్యుగాలు పధ్నాలుగు మన్వంతరాలుగా విభజించారు. ఈ 14 మన్వంతరాలు కలిపి ఒక కల్పము. అట్టి 100  కల్పములు బ్రహ్మ జీవిత కాలం. ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క మనువు అధిపతి. ప్రస్తుతం శ్వేత వరాహ కల్పంలో ప్రస్తుత బ్రహ్మ గారి 51 వ సంవత్సరం నడుస్తున్నది. ఈ కల్పంలో ఇప్పుడు 7 వ మనువు వైవస్వతుడు అధిపతి. 

మనువులు స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఔత్తమి, తామసుడు, రైవతుడు, చాక్షషుడు, వైవస్వతుడు, సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, రౌచ్య సావర్ణి, ఇంద్ర సావర్ణి వీరు పదునాలుగు మంది మనువులు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: