16-20-గీతా మకరందము
దైవాసురసంపద్విభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - అసురసంపద గలవారు నీచజన్మలను బడసి దైవప్రాప్తిలేక తుదకు అధఃపతనమునే పొందుదురని వచించుచున్నారు –
ఆసురీం యోనిమాపన్నా
మూఢా జన్మని జన్మని |
మామప్రాప్యైవ కౌన్తేయ!
తతో యాన్త్యధమాం గతిమ్ ||
తాత్పర్యము:- ఓ అర్జునా! అసురసంబంధమైన (నీచ) జన్మమును పొందినవారలగు మూఢులు ప్రతి జన్మయందును (భగవానుడగు) నన్నుపొందకయే, అంతకంటె (తాముపొందిన జన్మ కంటె) నీచతరమైన జన్మమును పొందుచున్నారు.
వ్యాఖ్య:- పాపాత్ములను, అసురగుణములు కలవారిని నీచజన్మలందు బడద్రోసెదనని క్రిందటి శ్లోకమున భగవానుడు తెలిపియుండిరి. తదుపరి వారిస్థితి యేమగునో ఇచట తెలియజేయుచున్నారు. తమ దుష్కర్మప్రభావముచే వారు భగవానుని పొందు సౌభాగ్యమును నోచుకొనలేక, ఆనందమును చవిచూడలేక తామింతవఱకు పొందియున్న హీనజన్మకంటె ఇంకను హీనతరమైన జన్మమును పొందుదురని యిట వచింపబడినది. మేడమెట్లపైనుండి క్రిందకుజారిన బంతి ఒక్కొక్క మెట్టు దిగజారి ఏ ప్రకారముగ క్రిందకు పడిపోవునో, ఆ ప్రకారమే వారు అధోగతి నొందుచుందురు. ఆహా! పాపఫలితమెంత దారుణమైనది! కావున ఇటువంటి భగవద్వాక్యములు వినిన తరువాతయైనను దురాచారపరులు తమ దుర్వృత్తుల నికకట్టిబెట్టి సత్పథగాములై వర్తించుట శ్రేయోదాయకము.
'మామప్రాప్యైవ’ - (నన్ను పొందకయే) - అని చెప్పుటవలన వారికి దైవప్రాప్తి లేక పోగా, ఇంకను హీనతరమైన జన్మము కలుగుచున్నదని భావము. కావున (1) మనుజుడు హీనజన్మనొందక యుండులాగునను (2) దైవమును పొందులాగునను ఏకకాలముననే ప్రయత్నింపవలెను. ఇట్టి సౌభాగ్యస్థితి జీవుని సదాచారణపైననే ఆధారపడియుండును. ఈ విషయమును రాబోవు శ్లోకమున చెప్పనున్నారు.
ప్రశ్న:- అసురజన్మను పొందిన మూఢులయొక్క పరిస్థితి యెట్లుండును?
ఉత్తరము:- వారు పరమాత్మను పొందక, తామింతవఱకున్నట్టి నీచ జన్మకంటెను ఇంకను నీచతరమగు జన్మను పొందుచునుందురు.
ప్రశ్న:- కాబట్టి జీవుడు కడతేరుటకు మార్గమేమి?
ఉత్తరము: - 'అసురసంపద’ ను (దుర్గుణములను, దురాచారములను) వదలి దైవీసంపదను (సద్గుణములను, సదాచారములను) పరిగ్రహించవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి