24, అక్టోబర్ 2020, శనివారం

పురుషార్థములు

 *పురుషార్థములు*


మానవుడి యొక్క జీవితానికి ప్రధానమైన లక్ష్యం ఏది, జ్ఞానం కలవాడిని అని చెప్పుకునే మనిషి ఆ జ్ఞానం తో సాధించాల్సినది ఏది అనే దాన్ని సూతులవారు శౌనకాది ఋషులకి వివరిస్తూ శ్రీమద్భాగవతాన్ని వివరిస్తూ,


 "జీవస్య తత్త్వ జిజ్ఞాసా"* మనిషి జీవించి ఉన్నాడు అంటే దానితో ప్రధానంగా సాధించవలసినది తత్త్వాన్ని తెలుసుకోవాలి అనే కోరిక ఆ తరువాత ఆ తత్త్వాని గురించిన జ్ఞానాన్ని ఆర్జించాలి. దానికి అనురూపంగా ఉన్న మిగతావాటిని సాధించాలి తప్ప దానికి విరుద్ధమైనవి పురుషార్థములు కావు. తత్త్వమేమిటి వివరిస్తూ సాక్షాత్తు పరమాత్మ, పరం బ్రహ్మ అని చెప్పబడే జగత్కారణమైనటువంటి ఒక తత్త్వం, దాన్ని గురించిన జ్ఞానం మనకు కలగాలి. అది ఏమి, దానితో కూడి ఏమున్నాయి, ఇవన్నీ ఎందుకు ఈ విధముగా ఉండేట్టు ఆతత్త్వం వీటిని చేస్తుందో తెలుసుకోగలగాలి. అప్పుడు మనం ఆచరించాల్సినదేమిటో తెలుస్తుంది. 


#ధర్మం


దేహం ఉన్నంత వరకు అది ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. భగవద్గీత ఐదవ అధ్యాయంలో, 


"పశ్యమ్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వషన్ ప్రలపన్* *విశృజన్ బృన్నన్ ఉన్మిషన్ నిమిషన్ నివ నిమిషన్ నపి"* 


ఏమి చేస్తున్నా కూర్చున్నా, పడుకున్నా, కంటి రెప్ప వాల్చుతున్నా, గాలి పీలుస్తున్నా ఏది చేసినప్పటికీ అది కర్మే అవుతుంది. శరీరంలో ఉన్న ప్రతీ క్షణం కూడా భగవత్ తత్త్వాన్ని గురించి తెలుసుకోవడానికి అనురూపంగా వాడితే అది ధర్మం అంటాం. 


#అర్థం

 

అలా చేసిన ధర్మాచరణ వల్ల కొంత లభిస్తుంది, అలా చేసే పనుల చేత ఏదైతే నీచే ఆర్జించ బడుతుందో దాన్ని అర్థము అంటాం. అయితే అది ఎట్లాంటిది ఆర్జించాలి అంటే ధర్మానికి అనురూపమైనంత వరకు మాత్రమే, ధర్మాన్ని అతిక్రమించడానికి పనికోస్తే అప్పుడది పురుషార్థంలోకి రాదు, అంటే అది మనం కోరతగనిది. కొంత మంది అంటుంటారు, డబ్బులు చాలా ప్రమాధకరమైనది మాకు ధనమే వద్దు అని. ధనం వద్దు అనడం కూడా అజ్ఞానమే. ధనం అనేది అవసరమే, అది ఏరకంగా ఉపయోగించుకోవడం అనేది మనం ఆచరించే ధర్మానికి అనురూపమైతే ఎంత ధనం ఆర్జించినా సరియైనదే. 


#కామం:


అట్లా ధర్మాన్ని ఆచరింఛేప్పుడు వచ్చే అర్థంతో కొన్ని అనుభవించాలి అనుకుంటావు, శరీరానికి ఏర్పడే అవసరాలు కొన్ని ఉంటాయి, కామము అంటాం. అది ధర్మాచరణ చేసేప్పుడు శరీరానికి ఏర్పడ్డ అవసరాలు తీరడానికి మాత్రమే పనికొచ్చేటప్పుడు కామం కూడా పురుషార్థమే. ధర్మాచరణని అతిక్రమించి ఇంద్రియాల వెంటే ఉంటే అది తగనిది.  కామాలు తీర్చేవి మన ఇంద్రియాలు, అంటే రుచిని గుర్తించేది రసన ఇంద్రియం, అలానే రూపాన్ని చూపేది చక్షు ఇంద్రియం, శబ్ధాన్ని వినిపించేది శ్రోత ఇంద్రియం, స్పర్షను తెలిపేది త్వ ఇంద్రియం, అలానే వాసన తెలిపేది ఘ్రానేంద్రియం అంటాం. ఆయా ఇంద్రియాల చేత ఆయా విషయాలను అనుభవించాలి, కానీ ప్రధానమైనది ఇంద్రియాలను తృప్తి పరచటమే కాకూడదు. దేహ  ధారణకు అవసరమైనంతవరకు అవి అవసరమే. 



#మోక్షం:-


మరి ఆ దేహ ధారణ ఎందుకు అంటే ధర్మాన్ని ఆచరించటానికి. ధర్మాన్ని ఆచరిస్తూ తద్వారా ఇదివరకు లోపల చేర్చి పెట్టుకున్న కర్మ వాసనలు తొలగితే, తద్వారా మనలోపల కొన్ని గుణాలు అంటే శ్రమ దమాది గుణములు ఏర్పడితే దాని వల్ల మనస్సు పరిశుద్ధమై భగవత్ ప్రేమ ఏర్పడితే దాని వల్ల లభించే భగవత్ సేవ పురుషార్థం. మానవ జన్మకి సార్థకత అక్కడ. దానికి అనుకూలంగా మిగతావన్నీ ఉన్నప్పుడు అవన్నీ అవసరాలే. ఏదేది సహకరించనిదో అవి పురుషార్థాలు కావెప్పుడూనూ. అవి  కోరతగనివి. అవిమనల్ని పాడు చేసేవి. 


*వదంతి తత్ తత్త్వ విదః తత్త్వమ్ యజ్ జ్ఞానమ్ అద్వయమ్ |*

*బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే ||*


"వదంతి తత్ తత్త్వ విదః" తత్త్వ జ్ఞానం కల మహానుభావులు మనకి చెప్పేది ఇదే. ఏమిటది ?


 *"తత్త్వమ్ యజ్ జ్ఞానమ్ అద్వయమ్",* తన తోటి సమానం కానీ తనను మించినది ఏదియూ లేనివాడైన అద్వితీయుడైన శ్రీకృష్ణుడే తత్త్వం. దాని గురించి కలిగినదే జ్ఞానం. దాని గురించి చేసినదే పని. దాని గురించి ఆర్జించినదే ఆర్జన. తదితరమైనది అంతా వ్యర్థమైనది.


"బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే"* ఆ తత్త్వం అనేది బ్రహ్మ, పరమాత్మ, భగవాన్ అని మూడు పేర్లతో పిలవబడుతుంది అంటూ సారభూతమైన తత్త్వాన్ని శౌనకాది ఋషులకు సూతులవారు అది ఏవిధంగా లభిస్తుందో  శ్రీమద్భాగవతంలోవివరిస్తారు.

కామెంట్‌లు లేవు: