రామాయణమ్ 166
.....
మృత్యువు! ,మృత్యువు! ,మృత్యువు!
.
లంకలో మృత్యువు రావణ అంతఃపురంలో ప్రవేశపెట్టబడ్డది.
.
అంతఃపురములోని సేవికలకు వెంటనే ఆజ్ఞలు జారీచేయబడ్డాయి ,ఎవరూ సీతను బాధించరాదు ! సీతకు కష్టముకలుగచేసినవాడు ఎవడైనా సరే వాడి కుత్తుకలుత్తరింపబడతాయి అని హెచ్చరికలివ్వబడ్డాయి.
.
ఆవిడ ఏది కోరితే అది ఉత్తరక్షణంలో ఆవిడముందు ఉండాలి. నేను అడిగితే ఒకటీ సీత అడిగితే ఒకటీ కాదు ,ఆమె ఆజ్ఞ నా ఆజ్ఞగా భావించండి అని ఆదేశించాడు రావణుడు.
.
అంతఃపురకాంతలను ఆ విధముగా ఆదేశించి బయటకు వచ్చి ఇక మిగిలిన కార్యమేమున్నదా అని ఆలోచించాడు.
.
రావణుడు వెంటనే ఎనిమిదిమంది మహాబలశాలురైన రాక్షసగూఢచారులను రావించాడు.
వారిని జనస్థానమునకు తక్షణమే వెళ్ళమని ఆదేశాలు జారీచేశాడు.
.
మీరంతా రాముడి కదలికలను వేయికన్నులతో గమనించండి .సకల మాయోపాయాలు ప్రయోగించి ఏదోవిధముగా అతనిని సంహరించండి .మన ఖరదూషణుల హత్యకు ప్రతీకారము తీర్చుకొనవలె!
.
రాముడన్న నా హృదయంలో అంతులేని క్రోధము రగులుతున్నది ,నా అధీనములోని జనస్థానములో మనవారెవ్వరూ లేకుండా హతమార్చినాడు.
.
మనకున్న భయంకరమైన శత్రువు రాముడు.
.
రణరంగములో అద్భుతపరాక్రమము చూపిన మీ అందరినీ పంపుటకు గల కారణము రామసంహారమే !
.
వెంటనే ఆ ఎనిమిదిమంది రాక్షసులు ఎవరికీ కనపడకుండా జనస్థానము దిశగా సాగిపోయారు.
.
రామాయణమ్ 167
.....
హృదయంలో కామజ్వాలలు ఎగసి ఎగసి పడుతున్నాయి రావణునికి అవి అతనిని ఉన్నచోట ఉండనీయటంలేదు .కాలుకాలిన పిల్లిలా అటూఇటూ తిరుగుతున్నాడు.
శరీరాన్ని అలంకరించుకున్నాడు ,సుగంధపరీమళాలు వెదజల్లే ద్రవ్యాలు వంటికి పూసుకున్నాడు .సీత ఇక నాదే ! అనే భావన వాడి నరనరానా వ్యాపించగా ఇక ఉండబట్టలేక ఆవిడనుంచిన అంతఃపురప్రదేశానికి మనోవేగంతో విచ్చేశాడు .
.
కన్నులుకన్నీటి చెలమలయై హృదయంలో బడబాగ్ని చెలరేగుతూ బుసలు కొడుతూ బంధింపబడిన ఆడనాగులాగా నిస్సహాయంగా రాక్షసస్త్రీల మధ్య ఉన్న సీతను చూశాడు.
.
అమాంతం సీతను ఎత్తుకొని తన రాజసౌధాన్ని అంతా తిప్పిచూపుతూ సంధిప్రేలాపనలు పేలుతున్నాడు.
.
ఆ రాజసౌధాలన్నీ బంగారము ,వెండితో నిర్మింపబడిఉన్నాయి .స్తంభాలకు మణులు పొదగబడి ఉన్నాయి.ఉద్యానవనాలు,దిగుడుబావులు ,
పద్మసరస్సులతో కూడి నయనమనోహరంగా వైభవము ఉట్టిపడుతున్న ప్రాసాదాలన్నీ చూసింది సీత!.
.
సీతా ! నా అవసరము చెప్పనవసరములేకుండా నా మనసులో ఉండగనే అది గ్రహించి పనిపూర్తిచేయుటకు ఎల్లప్పుడూ వేయిమంది ముందుకు వస్తూ ఉంటారు.
.
సీతా ఎందరో మేలైన ,ఉత్తమురాండ్రైన నాచే కొనితేబడిన అనేకమయిన స్త్రీలకు నీవు ప్రభువుగా ఉండుము.నీకు మరొక ఆలోచన వద్దు .నీ యందే మనస్సు నిలుపుకొన్న నన్ను అనుగ్రహించు.
.
రాముడు ! వాడొక దరిద్రుడు ! ఇంటినుండి వెడలగొట్టబడిన నిస్సహాయుడు ! వాడు ఇక్కడకు వచ్చి నిన్ను రక్షించడం కల్ల.
.
లంక నలుమూలలా సముద్రము చేత ఆవరింపబడి ఎత్తైన శిఖరము మీద ఉన్న శత్రుదుర్భేద్యమైన నగరము!
.
ఒకతమ్ముడు తోడుగా ఉన్న వాడు ఇంత దూరము వచ్చి నిను తీసుకొని వెళ్ళటము అసంభవము .
.
ఆ రాజ్యభ్రష్టుడిమీద ఆలోచనలు వదులుకో ,
నీ సుందరమైన పాదాలకు నమస్కరిస్తున్నాను
రా ! నాతో రమించు!
నీతో కలిసి రసరమ్యలోకాలను చుట్టివస్తాను.
.
నిస్సిగ్గుగా రావణుడు ప్రేలుతున్న మాటలు వింటూ చీరకొంగుతో ముఖమును కప్పుకొని కన్నీరు కారుస్తూ
ఏ మాత్రమూ భయపడక తనకూ రావణునకు మధ్య గడ్డిపరకను అడ్డము వుంచి ,రావణా ! సత్యసంధుడూ ,మహాబాహువూ అయిన రాముడే నా భర్త! నా దైవము!
.
ఓరీ నీవూ నీబలము ఆయనకు గడ్డిపోచతో సమానము !
మహాభయంకరులు,యమకింకరులూ అంటూ నీ రాక్షసవీరులగురించి ఏవేవో వదరుతున్నావు .
.
రాముడనే గరుత్మంతుని ముందు నీ రాక్షససర్పాలు విషహీనమై చీల్చి చెండాడబడతాయి.రాముడి సమక్షంలో నన్ను నీవు అవమానించగలిగినట్లయితే ఆ క్షణమే నీ ప్రాణములు అనంతవాయువులలో కలిసిపోయి ఉండేవి.
.
రాముడితో వైరము పెట్టుకొని బ్రతికి బట్టకట్టాలనే అనుకుంటున్నావా?
.
రాముడే నన్ను విడిపిస్తాడు !
.
నీవు చేసినపనికి నీ లంక ,నీ లంకానగరస్త్రీలు సమస్తము వైధవ్యము పొందుతారు జాగ్రత్త!
.
.
NB
.
అదీ సీతమ్మ అంటే !
అంతేగానీ మన సినిమాలలో చూపించినట్లు నిస్సహాయంగా పడి ఉండే అబల కాదు !
అనంతశక్తిరూపిణి ,అద్భుత చైతన్యదీప్తి
నా తల్లి సీతమ్మ!
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి