పొతన తలపులో....92
నారదా...పరమ పావన రామావతారం గురించి చెబుతాను విను.....
తోయజహిత వంశ దుగ్ధ పారావార-
రాకా విహార కైరవహితుండు
కమనీయ కోసలక్ష్మాభృత్సుతా గర్భ-
శుక్తి సంపుట లసన్మౌక్తికంబు
నిజపాదసేవక వ్రజ దుఃఖ నిబిడాంధ-
కార విస్ఫురిత పంకరుహసఖుఁడు
దశరథేశ్వర కృతాధ్వరవాటికా ప్రాంగ-
ణాకర దేవతానోకహంబు
చటుల దానవ గహన వైశ్వానరుండు
రావణాటోప శైల పురందరుండు
నగుచు లోకోపకారార్థ మవతరించె
రాముఁడై చక్రి లోకాభిరాముఁ డగుచు.
***
ఆయన సూర్యవంశమనే పాల కడలికి పున్నమి చంద్రుడు.
కోసలరాజు కూతురైన కౌసల్యాదేవి గర్భమనే ముత్తెపు చిప్పలో పుట్టిన మేలి ముత్యం.
తన పాదసేవకుల శోకమనే చిమ్మచీకట్లను పోకార్చే సూర్యభగవానుడు.
దశరథమహారాజు గారి పుత్రకామేష్ఠి యాగశాల ముంగిట మొలకెత్తిన కల్పవృక్షం. దానవులనే దారుణారణ్యాన్ని దహించే కార్చిచ్చు.
రావణుని గర్వమనే పర్వతాన్ని బద్దలు చేసే ఇంద్రుడు.
శ్రీరాముడుగా, చక్రధారి శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయడం కోసం జగదభిరాముడై భూలోకంలో అవతరించాడు
***
దశరథుడికి ఇచ్చిన మాట ప్రకారం రాముడు అడవులకు వెళ్లాడు.
***
అరుదుగ లక్ష్మణుండు జనకాత్మజయుం దనతోడ నేఁగుదే
నరిగి రఘూత్తముండు ముదమారఁగ జొచ్చెఁ దరక్షు సింహ సూ
కర కరి పుండరీక కపి ఖడ్గ కురంగ వృకాహి భల్ల కా
సర ముఖ వన్యసత్త్వచయ చండతరాటవి దండకాటవిన్
***
లక్ష్మణుడు, సీత అడవులకు వెళ్తున్న రాముడి వెంట వెళ్ళారు. అలా రఘువంశ లలాముడైన ఆ శ్రీరాముడు సింహాలు, అడవిపందులు, ఏనుగులు, పులులు, కోతులు, ఖడ్గమృగాలు, జింకలు, తోడేళ్లు, పాములు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు మొదలైన అడవి మృగాలు వసించే అత్యంత భీకరమైన దండకారణ్యం ప్రవేశించాడు.
***
ఆ వనమున వసియించి నృ
పావననయశాలి యిచ్చె నభయములు జగ
త్పావన మునిసంతతికిఁ గృ
పావననిధి యైన రామభద్రుం డెలమిన్.
***
దయాసముద్రుడైన ఆ శ్రీరాముడు, ఆ దండకారణ్యంలోని లోకాలను పవిత్రం చేసే మునులు అందరికి అభయాలు యిచ్చాడు.
***
ఖరకర కుల జలనిధి హిమ
కరుఁ డగు రఘురామవిభుఁడు గఱకఱితోడన్
ఖరుని వధించెను ఘనభీ
కర శరముల నఖిల జనులుఁ గర మరుదందన్.
సూర్యవంశమనే సముద్రానికి చంద్రునివంటివాడైన ఆ రామచంద్రుడు , మిక్కిలి భయంకరమైన బాణాలు ప్రయోగించి ఖరుడనే రక్కసుణ్ణి చంపివేశాడు.
**
హరిసుతుఁ బరిచరుఁగాఁ గొని
హరిసుతుఁ దునుమాడి పనిచె హరిపురమునకున్;
హరివిభునకు హరిమధ్యను
హరిరాజ్యపదంబు నిచ్చె హరివిక్రముఁడై
***
సింహపరాక్రముడైన శ్రీరామచంద్రుడు సూర్యసుతుడైన సుగ్రీవుణ్ణి అనుచరునిగ స్వీకరించాడు. ఇంద్ర పుత్రుడైన వాలిని నేలగూల్చి యమపురికి పంపాడు. వానరాధిపుడైన సుగ్రీవునికి కిష్కింధ రాజ్యాన్ని, సింహం వంటి నడుము గల రుమని అప్పగించాడు.
***
🏵️పోతన పదం🏵️
🏵️భక్తిరసం🏵️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి