24, అక్టోబర్ 2020, శనివారం

బొబ్బట్లు

 బొబ్బట్లు .


సాధారణంగా  ఈ తొమ్మిది  రోజులూ  అమ్మ వారికి  ముఖ్యాతి  ముఖ్యంగా  అన్న ప్రసాదాలే  నివేదన చేస్తారు.


చింతపండు పులిహోర , నిమ్మకాయ పులిహోర , కట్టె పొంగలి , కొబ్బరి అన్నం , పులగం , చక్కెర పొంగలి ,  పాయసము , పెసర పప్పుతో  పాయసము , బియ్యపు రవ్వతో  పాయసము ఇలా  అన్న ప్రసాదములే.. ఎక్కువగా  నివేదిస్తారు.


ఇక ఈ తొమ్మిది  రోజులు  ఒకే  అన్న ప్రసాదము  రెండవ సారి  మూడవ సారి నివేదించినా  దోషము  లేదు.


కాకపోతే  ఆ ప్రసాదము  శుచిగా మడితో   తయారు చేసుకుని  నివేదన చేస్తేనే  మంచి  ఫలితం వస్తుంది.


బజారు లో కొన్న స్వీట్లు , క్యాటరింగ్  వారికి  ఆర్డర్  ఇచ్చి తెప్పించుకున్న ప్రసాదములు  అమ్మ వారికి  నివేదించకపోవడమే  అత్యుత్తమం. ఉల్లిపాయలు వేసి చేసిన  ఏ పదార్ధమైనా  నివేదనకు  పనికి రాదు. యాలకులు , లవంగాలు  వంటి  సుగంధ  ద్రవ్యములు  వాడవచ్చును .


దానికన్నా    మడితో  అన్నం వండి , దానిపై  బెల్లం ముక్క పెట్టి , నెయ్యి తో  అభికరించి  , దానిపైన  నీళ్ళు చల్లి ఆ జగన్మాతకు  నివేదన చేస్తే చాలు. ఆ తల్లి  సంతుష్టురాలవుతుంది.


మరి  అన్న ప్రసాదాలు కాకుండా  మిగిలిన  స్వీట్లు , హాట్లు ప్రసాదాలు మనమే   స్వయముగా  తయారు చేసిన ప్రసాదాలు  నివేదన చేయడము  మన సంతృప్తి  కొరకే . దానిలో  దోషమేమియు  లేదు. మన కుటుంబ సభ్యులందరూ  సంతోష పడతారు.


బొబ్బట్లు.


కావలసినవి .


మైదాపిండి  --  ఒక కప్పు.

నూనె  --  2  స్పూన్లు 

ఉప్పు   --  చిటికెడు .

నెయ్యి  --  ఒక కప్పు 

యాలకులపొడి  --  స్పూను


బొబ్బట్లు లోపల  Stuff  చేసుకోవడానికి .


పచ్చి శనగపప్పు  -  ఒక కప్పు 

బెల్లం  -- అర కప్పు 


తయారీ  విధానము .


ముందుగా  మైదాపిండి లో  చిటికెడు  ఉప్పు వేసి  స్పూను  నూనె వేసి పొడి పిండి  బాగా కలుపుకోవాలి .


తర్వాత  ఆ పిండిలో  కొద్ది కొద్దిగా  నీరు  పోసుకుంటూ  పిండిని  చపాతీ పిండి మాదిరిగా  కలుపుకోవాలి .


తర్వాత ఆ పిండిలో  మరో స్పూను నూనె వేసుకుని  పిండిని  మరింత మృదువుగా  మెదాయించుకోవాలి .


దానిపై  ఒక పలుచని  గుడ్డను  కప్పి  ఒక ముప్పావు గంట సేపు పక్కన  పిండి  మరింత మృదువుగా  అవ్వటానికి విడిగా ఉంచుకోవాలి .


తర్వాత  పచ్చి శనగపప్పు  ఒకసారి కడిగి  ఒక గిన్నెలో  వేసుకుని  తగినన్ని నీళ్ళు  పోసి  కుక్కర్ లో పెట్టుకుని  మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి .


బెల్లం ను పొడి చేసుకుని ఉంచుకోవాలి .


మిక్సీ లో ఉడికిన పచ్చి శనగపప్పు , బెల్లం  పొడి , యాలకుల పొడి వేసుకుని  మెత్తగా  వేసుకోవాలి .


ఆ తర్వాత ఒక అరిటాకును  తీసుకుని  దానిపైన నూనె రాసుకుని , మైదాపిండిని  నిమ్మకాయంత  తీసుకొని  పూరీ మాదిరిగా  చేతితో వత్తుకుని  అందులో పూర్ణం పిండిని  పెట్టుకుని  చేతితో నాలుగు  వైపులా మూసి వేసి , పలుచగా  చేసుకోవాలి .


తర్వాత  స్టౌ మీద పెనం పెట్టుకుని  పెనం మీద   నెయ్యి  వేసుకుని  వత్తిన  బొబ్బట్లను   కొద్ది  కొద్దిగా  నెయ్యి  వేసుకుంటూ అటు ఇటూ అట్లకాడతో తిప్పుతూ మాడకుండా రెండు వైపులా కాల్చుకోవాలి .

అంతే . ఎంతో రుచిగా  ఉండే ప్రాచీన వంటకం   బొబ్బట్లు  అమ్మ వారి నివేదనకు  సిద్ధం .

కామెంట్‌లు లేవు: