24, అక్టోబర్ 2020, శనివారం

అరణ్యపర్వము – 5

అరణ్యపర్వము – 5

కిరాతార్జునీయం

అర్జునుడు ఇంద్రకిలాద్రికి వెళ్ళి అక్కడ శివుని గురించి ఘోర తపస్సు మొదలు ఆరంభించాడు. పరమ శివుడు అర్జునుడుని పరీక్షించదలిచాడు. ఒక కిరాతుడివేషంలో అర్జుని దగ్గరకు వచ్చాడు. అక్కడ మూకాసురుడు అనే రాక్షసుడు అర్జునుడిని చంపడానికి పంది రూపంలో వచ్చాడు. అర్జునుడు ఆ పందిని బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా పందిని కొట్టాడు. రెందు బాణాలు తగలగానే ఆపంది ప్రాణాలు వదిలింది. అర్జునుడు కిరాతునితో ” నేను కొట్టిన జంతువును నువ్వు ఎందుకు కొట్టావు? వేటలో అలా కొట్టకూడదన్న ధర్మం నీకు తెలియదా ” అన్నాడు. ముందు నేను కొట్టిన బాణంతో ఆ పంది చనిపోయింది. నువ్వు కొట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గు లేదా ? చేవ ఉంటే నాతో యుద్ధానికి రా ” అన్నాడు శివుడు.

అర్జునుడు శివుని మీద బాణవర్షం కురిపించాడు. కానీ శివుడు చలించ లేదు. అర్జుననకు ఆశ్చర్యం వేసింది ” ఇతను సామాన్యుడు కాదు దేవేంద్రుడైనా పరమ శివుడైనా అయి ఉండాలి ” అని కున్నాడు. కాని ఈ ఎరుక నాపై వేసిన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. ఇవి దివ్యాస్త్రాల వలె ఉన్నాయి ” అని మనసులో అనుకున్నాడు. మరల బాణం వేయడానికి గాండీవం తీసుకున్నాడు. అతని చేతిలోని గాడీవం అదృశ్యం అయింది. ఇక ఇరువురు ద్వంద యుద్దానుకి దిగారు. శివుని దెబ్బలకు తాళలేని అర్జునుడు మూర్చబోయాడు. శివుడు తన నిజ రూపం ధరించాడు. అర్జునుడు కైమోడ్చి శివునకు నమస్కరిస్తూ అనేక విధాల స్థితించాడు. ” పరమశివా! నిన్ను సామాన్యుడిగా ఎంచి నీతో యుద్ధం చేసాను. నా తప్పు మన్నించు ” అన్నాడు. అందుకు శివుడు ” అర్జునా! నిన్ను క్షమించాను. నీవు సామాన్యుడివి కాదు. పూర్వజన్మలో నువ్వు నరుడు అనే దేవఋషివి . ఇదిగో నీ గాడీవం .ఇంకా ఎదైనా వరం కోరుకో ” అన్నాడు.

అర్జునుడు ” త్రయంబకా! నాకు పాశుపతం అనే అస్త్రం ప్రసాదించు. ఈ లోకంలో బ్రహ్మశిరం, పాశుపతం మహాస్త్రాలు. శత్రు సంహారానికి అవి అవసరం కనుక నాకు వాటిని ప్రసాదించు ” అన్నాడు. ఈశ్వరుడు సంతోషించి అర్జునుడికి పాశుపతాన్ని మంత్ర, ధ్యాన, జప, హోమ పూర్వకంగా పాశుపతాస్త్రం , సంధానం, మోక్షణము,

సంహారం సహితంగా అర్జునుడికి ఉపదేశించాడు.శివుడు అర్జునుడితో ” అర్జునా! ఈ పాశుపతాన్ని అల్పులపై ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్ర ప్రభావంతో నీవు అఖిల లోకాలను జయిస్తావు ” అని చెప్పి అంతర్ధానం అయ్యాడు.

పరమశివుని చూసినందుకు అర్జునుడు సంతోషించాడు. పరమశివుని స్పర్శతో అర్జునిని శరీరం దివ్యకాంతితో ప్రకాశిస్తుంది. ఈ విషయం తెలుసుకుని ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అశ్వినీ దేవతలతో కలసి అర్జునిని వద్దకు వచ్చాడు. ” అర్జునా నీ పరాక్రమానికి మెచ్చి నీకు వరాలివ్వడానికి వచ్చాము ” అన్నాడు ఇంద్రుడు. యముడు తన దండాన్ని అర్జునుడికి ఇచ్చాడు. వరుణుడు వరుణపాశాలను, కుబేరుడు కౌబేరాస్త్రాన్ని దానం చేసారు. అర్జునుడు వారిని దర్శించినందుకు, వారిచ్చిన అస్త్రాలకు పరమానందం చెందాడు. దేవేంద్రుడు అర్జునుడికి రథం పంపి ఇంద్రలోకానికి ఆహ్వానించాడు.

కామెంట్‌లు లేవు: