24, అక్టోబర్ 2020, శనివారం

సంతానం..సంతోషం..

 సంతానం..సంతోషం..


2010 సంవత్సరం జూన్ నెల లోని ఒక ఆదివారం ఉదయం తొమ్మిది గంటలప్పుడు, సుమారు పది పన్నెండు మంది నేను కూర్చుని ఉన్న చోటుకి వచ్చారు..ఆ సమయం లో భక్తుల తాకిడి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది..నేనూ, మా సిబ్బంది కూడా పనిలో ఉంటాము..వారిలో బాగా వయసు పైబడిన ఒక పెద్దాయన ముందుకువచ్చి..  "మేమూ 'తుమ్మల' వాళ్ళమే..(శ్రీ స్వామివారి పూర్వ నామం..తుమ్మల వేణుగోపాల నాయుడు..) ఈ స్వామికి బంధుత్వం రీత్యా దాయాదులం..మేము శిద్దనకొండూరు లో వుండేవాళ్ళము..ఇప్పుడు మద్రాసు లో వుంటున్నాము..మీ నాన్నగారు, అమ్మగారు కూడా బాగా తెలుసు..నాన్నగారు మంచం లో ఉన్నారట కదా..?" అని గబ గబా చెప్పుకొచ్చారు


శ్రీ స్వామివారికి బంధువులు అని వినగానే..లేచి నిలబడ్డాను.."మీరు కూర్చోండి.." అంటూ కుర్చీ చూపించాను..కుర్చీలో సేద తీరినట్టు గా కూర్చున్నారు..ఆయన చుట్టూరా..ఆయనతో వచ్చిన వాళ్ళంతా నిలబడ్డారు..

"స్వామివారికి బంధువులం అన్నారు గదా..శ్రీ స్వామివారి గురించి మీకు తెలిసిన విషయాలేమైనా చెపుతారా..?" అని అడిగాను..ఆయన ముఖంలో సంతోషం కనిపించింది.."తప్పకుండా చెపుతాను..ముందు వెళ్లి ఆయన్ను దర్శనం చేసుకొని వస్తాము.." అన్నారు.."పది నిముషాలు వేచి ఉండండి..ఇప్పుడున్న భక్తులు బైటకు రాగానే..మీరు వెళ్లి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకోవచ్చు.." అని చెప్పాను..అందరినీ ప్రదక్షిణ మంటపం లో కూర్చోమని చెప్పాను..


ఆ పెద్దాయన, ఆయనతోపాటు వచ్చిన ఆయన సంసారం అందరూ కొద్దిసేపటి తరువాత శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని ఇవతలికి వచ్చేసారు..


స్వామివారి బంధువులం అని చెప్పిన ఆ పెద్దాయన నేరుగా నా దగ్గరకు వచ్చి ప్రక్కనే కూర్చున్నారు.."ఇప్పుడు చెప్పండి..మీకు స్వామివారు ఎప్పటి నుంచీ తెలుసు..? మీకేమైనా అనుభవాలు ఉన్నాయా..? " అని గబ గబా అడిగేసాను..


ఒక్క క్షణం ఆగమన్నట్టు చేత్తో సైగ చేసి.."ఈ స్వామివారి కుటుంబం తో మాకు చాలా ఏళ్ల అనుబంధం ఉంది..అప్పుడప్పుడూ రాకపోకలూ ఉండేవి..ఈయన అన్నదమ్ములందరూ నాకు తెలుసు..స్వామి చిన్నతనం నుండీ తెలుసు..సంవత్సరం సరిగ్గా గుర్తులేదు కానీ..ఈ స్వామి మాలకొండకు తపస్సుకు వెళ్లే ముందు కొద్దిరోజులు మా గ్రామం శిద్దనకొండూరు కు వస్తూ పోతూ ఉండేవాడు..నాకప్పుడు దగ్గర దగ్గర నలభైయేళ్ళ వయసు..పెళ్లై పది పన్నెండు సంవత్సరాలు గడిచింది..పిల్లలు పుట్టలేదు..ఇక మాకు సంతానయోగం లేదని అనుకున్నాము నేనూ నా భార్యా..మా ఊళ్ళో ఒకరి ఇంటికి వస్తున్నాడని తెలిసి..నేను, నా భార్య అక్కడికి వెళ్ళాము..వాళ్ళయింటి ముందు అరుగు మీద చాప పరచుకొని..దానిమీద పద్మాసనం వేసుకొని కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు..మేము వెళ్లి ఆయన ముందు నిలబడ్డాము..కళ్ళు తెరచి నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు..నాకంటే వయసులో బాగా చిన్నవాడైనా..గబుక్కున నమస్కారం చేసాను..ఆయన ఏమీ మాట్లాడలేదు..అక్కడే నిలబడ్డాను..ఇంతలో ఆ ఇంటివాళ్ళు కొన్ని పళ్ళు, ఒక గ్లాసు లో పాలు తెచ్చి ఇచ్చారు..ఆ తెచ్చిన పళ్ళ లోంచి రెండు అరటిపళ్ళు చేతిలో తీసుకొని..గుండెలకు ఆనించుకొని..కళ్ళు తెరచి మా వైపు చూసి దగ్గరకు రమ్మన్నాడు..వెళ్ళాము..అరటిపళ్ళను నా భార్యకు ఇవ్వబోయాడు..ఆమె కొంగు పట్టింది..అందులో వేసాడు..నా వైపు తిరిగి.."మీకు సంతానయోగం ఉంది..ఇద్దరు పిల్లలు పుడతారు.." అన్నాడయ్యా.. ఆశ్చర్యం వేసింది..మేము సంతానం కోసం అడగాలని అనుకోలేదు అప్పుడు..కేవలం చూద్దామని వెళ్ళాము..మా మనసులోని వేదన కు పరిష్కారం అన్నట్టుగా గట్టిగా చెప్పాడు..భలే సంతోషం కలిగింది..నమస్కారం చేసుకొని వచ్చాము..ఆ మరుసటి ఏడే మగపిల్లవాడు పుట్టాడు..మరో రెండేళ్లకు అమ్మాయి పుట్టింది..ఆ మహానుభావుడి నోటి దీవేనే ఇది..ఇప్పుడు మా  పెద్దాడికి ఇద్దరు పిల్లలు..అమ్మాయికి కూడా ఇద్దరు పిల్లలు..అందరమూ మద్రాసు లోనే వుంటున్నాము..కొన్నేళ్ల క్రితం వరకూ ప్రతి ఏడూ ఇక్కడకు వచ్చేవాళ్ళం..వయసు పైబడిన తరువాత రావడం తగ్గించేసాము..మా పిల్లలకూ స్వామివారంటే భక్తి.." అన్నారు..


"ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారట గదా..? ఒక ఆదివారం నాటికి అయ్యే ఖర్చును నేను భరిస్తాను..ప్రతి ఏడూ మా పేరుతో ఒక రోజు అన్నదానం జరిపించు.." అని చెప్పారు..సరే అన్నాను..


శ్రీ స్వామివారు తన తపోసాధన కోసం మాలకొండ చేరే ముందు కొన్నాళ్ల పాటు ఇంటి వద్ద వున్నప్పుడు, శిద్దనకొండూరు గ్రామానికి వెళ్లి వచ్చేవారని నేనూ విని వున్నాను..ఈ అనుభవం వినడం అదే మొదటిసారి..శ్రీ స్వామివారు త్వరపడి ఎటువంటి వరాలు ఇచ్చేవారు కాదు..ముక్తసరిగా ఉండేది ఆయన మాట..కానీ ఆయన నోటి నుంచి ఏదైనా వాక్కు పలికితే..అది ఖచ్చితంగా నెరవేరేది..


ఆ పెద్దాయనా..ఆయన సంసారం..అందరూ ఆరోజు మధ్యాహ్నం దాకా స్వామివారి మందిరం వద్దే గడిపి..భోజనం చేసి..తిరిగి మద్రాసు కు వెళ్లిపోయారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: