24, అక్టోబర్ 2020, శనివారం

మహాభారతము ' ...59.

 మహాభారతము ' ...59. 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


అరణ్యపర్వం.


సూర్యస్తోత్రం పూర్వం  బ్రహ్మదేవుని వలన ఇంద్రునికి, ఇంద్రునిద్వారా నారదమహర్షికి లభించింది.  నారదుని నుండి ధౌమ్యులవారికి ఆ స్తోత్రం వుపదేశించబడింది.  ఇప్పుడు అదే స్తోత్రాన్ని ధౌమ్యుడు ధర్మజునికి వుపదేశించాడు.  


ధౌమ్యుడు చెప్పిన ' సూర్యోపాసనా విధి ' ప్రకారం ధర్మరాజు భక్తి శ్రద్ధలతో, మరునాడు ప్రాతఃకాలాన అరుణోదయ సమయంలో గంగానదిలో నడుములోతు వరకు నిలబడి, సూర్యుని అష్టోత్తర శతనామావళి తో పూజించి మెప్పించాడు.


సూర్యుడు ప్రత్యక్షమై,  యేమి కావాలని అడగకుండానే, తనను ప్రార్ధించిన కారణం తెలిసినట్లుగా, ఒక మహిమాన్వితమైన రాగిపాత్రను  అనుగ్రహించి, ' ధర్మజా !  మీ అరణ్యవాస సమయమైన పన్నెండు సంవత్సరాలు, అన్నసంతర్పణ,  దీని మహిమ వలన నీవు యే యిబ్బంది లేకుండా చేయగలుగుతావు.  దీనికి ఒకే ఒక నియమం   వున్నది.  ప్రతిరోజూ, సంతర్పణ జరిగిన తరువాత, చివరగా ద్రౌపది భోజనం చేయాలి.  ఆ తరువాత యీ పాత్రనుండి ఆరోజుకి యేమీ ఆశించకూడదు.  దీని సహాయంతో మీకు ఆకలిదప్పులు గురించి ఆలోచించే శ్రమ వుండదు.  ఆ సమయాన్ని మంచి విషయాల పై దృష్టి మరల్చండి.  మీకు మేలు చేకూరుతుంది.  పదమూడేళ్ల తరువాత, మళ్ళీ మీ రాజ్యం మీరు,  తప్పకపొందుతారు. ఇదే నా ఆశీర్వాదం. '  అని ఆపాత్ర యిచ్చి సూర్యుడు అంతర్ధానమయ్యాడు.   


ధర్మరాజు ఆనందానికి హద్దులు లేవు.  నదిలోనుండి బైటకువచ్చి ఆ పాత్రను ధౌమ్యులవారి ముందు పెట్టి నమస్కరించాడు ధర్మజుడు.  దానిని ధౌమ్యులవారి ద్వారా ద్రౌపదికి అందజేసి, ప్రతిరోజూ వుపయోగించిన తరువాత జాగ్రత్తగా వుంచమని చెప్పారు.  సూర్యభగవానుడు చెప్పినట్లే, దానిని పూజించి, ప్రార్ధిస్తే, ప్రతిరోజూ దానినుండి రుచికరమయిన ఆహార పదార్ధాలు కావలసినంత పరిమాణంలో రావడం మొదలు పెట్టాయి.  బ్రాహ్మణులూ రోజూ తృప్తిగా భోజనాలు చేస్తున్నారు.  ఇలా కొన్నిరోజులు ఆనందంగా గడిచిన తరువాత, వారంతా బ్రాహ్మణులతో కలిసి, కామ్యకవనానికి వెళ్లారు.   


అక్కడ హస్తినలో ధృతరాష్ట్రునికి, విదురునికీ మళ్ళీ వివరమైన చర్చ జరిగింది, పాండవులు వనవాసానికి వెళ్లిన పరిస్థితులపై.  విదురుడు యింతకుముందు చెప్పినమాటలే, మళ్ళీ ధృతరాష్ట్రునికి చెప్పి, పాండవులను తిరిగి పిలిపించమన్నాడు. కౌరవులు పాండవులను జయించలేరని చెప్పాడు. ధర్మం వారివైపే వుందన్నాడు. ఇంతకు ముందు, యిలాంటి హితవచనాలు విదురుడు చెప్పినప్పుడు, ధృతరాష్ట్రుడు మౌనంగా వినేవాడు.  తన అశక్తతకు దుఃఖించేవాడు.


అయితే యీ సారి ధృతరాష్ట్రుడు ఆశ్చర్యంగా,  ' విదురా !  దుర్యోధనాదులు, నా స్వంత కుమారులు.  నాదేహము నుండి వచ్చినవారు. పాండవులు నా తమ్మునికుమారులు.  నీకు ఈసంగతి తెలిసికూడా నన్ను పదేపదే బాధపెడుతున్నావు.  నీవు మా ఉప్పు తింటూ కూడా, నా పిల్లలపై లేశమైనా ప్రేమ చూపించడంలేదు.  నన్ను నీ మాటలతో బాధించవద్దు.  నీకు యిష్టమైనచో,యెక్కడికైనావెళ్లి జీవించు. '  అని నిర్ద్వందంగా చెప్పాడు.


విదురుడు కామ్యవనానికి వచ్చి పాండవులను కలిశాడు.  ధృతరాష్ట్రునికి తనకు జరిగిన చర్చ, దాని పర్యవసానం చెప్పాడు.  జరిగినదానికి, ధర్మజుడు యెంతో బాధపడి,  పెదతండ్రిగారు,  త్వరలో మిమ్ములను దూరం చేసుకున్నందుకు, మీ విలువ తెలుసుకుని తిరిగి హస్తినకు పిలువనంపుతారని భావిస్తున్నాను.  తమరు మాతో వుంటే, మాకెంతో సంతోషం.'  అని ధర్మజుడు విదురుని సాదరంగా ఆహ్వానించి తమతో పాటు వుంటూ, ధర్మమార్గం వుపదేశించమని కోరాడు.  రోజులు కామ్యవనంలో ప్రశాంతంగా గడుస్తున్నాయి. 


అక్కడ ధృతరాష్ట్రుడు, విదురుని వెళ్ళమని అయితే అన్నాడు గానీ, విదురుడు లేకుండా ఉండలేకపోయాడు.  త్రేతాయుగంలో రామాయణంలో, రావణుడు తన తమ్ముడైన విభీషణుని హితవాక్యాలు నచ్చక, విభీషణునితో వైరం వచ్చి వెళ్లగొట్టి,  అహంకారపూరిత మనస్తత్వంతో, తిరిగి పిలిచే ఆలోచన చెయ్యలేదు.  కానీ యిక్కడ ధృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డి. రావణుని అంత దురభిమానికాదు. కేవలం పుత్రవాత్సల్యం చేత దుష్టుడయ్యాడు కానీ, బుధజనులతో సత్సంగ అభిలాష కలవాడు.  అందుకే, విదురుడు లేకుండా యెక్కువరోజులు వుండలేక, సంజయుని పిలిచి,' సంజయా ! విదురుడు నా తమ్ముడు.  అతడు లేకుండా నేనుండలేను.  విదురుడు ఎక్కడున్నా గాలించి వెంటనే  హస్తినకు తీసుకురా !   నామాటగా చెప్పు. '  అని పంపించాడు.


విదురుని కామ్యకవనంలో కలిసి ధృతరాష్ట్రుని మానసిక వేదన తెలియజెప్పి, మళ్ళీ హస్తినకు తీసుకువెళ్లాడు, సంజయుడు.  విదురుని చూడగానే, ధృతరాష్ట్రుడు ఆనందంతో, కౌగలించుకుని, మన్నించమని అడిగాడు.  పరస్పర ప్రేమపూర్వక సంభాషణలతో యిద్దరూ  మళ్ళీ ఒక్కటైనారు. 


విదురుడు పాండవుల వద్దకు వెళ్లి రావడం దుర్యోధనునికి తెలిసి, మళ్ళీ యే మాయోపాయంతో, ధృతరాష్ట్రుని మనసు విరిచి, పాండవులను తిరిగి రప్పిస్తాడో అని తలచి దుర్యోధనుడు, దుశ్శాసన,శకుని, కర్ణులతో సమావేశమయ్యాడు, ప్రతివ్యూహం కొరకై.


స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.


తీర్థాల రవి శర్మ

9989692844

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం.

కామెంట్‌లు లేవు: