24, అక్టోబర్ 2020, శనివారం

ధర్మతత్పరత అంటే

 🙏🌷🌷ధర్మతత్పరత అంటే🌷🌷🙏


దిలీప మహారాజు భార్య సుదక్షిణాదేవి.వారికి సకల సంపదలు ఉన్నా కానీ, సంతానం మాత్రం లేకపోవడంతో వశిష్ట మహర్షి వద్దకెళ్లి తరుణోపాయం చెప్పమని కోరారు.

ఆయన తన వద్ద ఉన్న నందిని అనే ధేనువును ఆ రాజదంపతులకిచ్చి "దీనిని నిష్ఠగా సేవించండి. తప్పక సంతానప్రాప్తి కలుగుతుంది" అని చెప్పాడు.

ఆ దంపతులు ఆ ఆవుని తీసుకెళ్లి భక్తి శ్రద్ధలతో సేవించుకో సాగారు.

ప్రతిరోజు  రాజే స్వయంగా అడవికి తీసుకెళ్లి.అది మేత మేసిన తర్వాత తీసుకొచ్చేవాడు. 

           ఓ రోజున రాజు ఏమరపాటున ఉన్నప్పుడు ఆ ఆవు కాస్తా తప్పిపోయింది. రాజు దానికోసం వెతుకుతుండగా సమీపంలో ఉన్న ఒక గుహనుంచి అంబారావాలు వినిపించాయి. 

వెంటనే ఆ గుహలోకి ప్రవేశించాడు రాజు. అక్కడ ఆ అవును ఒక సింహం చంపి తినడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. 

దిలీపుడు వెంటనే బాణం సంధించబోయాడు. 

చిత్రం!

ఆయన చెయ్యి స్తంభించిపోయినట్లయింది.

ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయిన రాజుతో ఆ సింహం మానవభాషలో 

"రాజా! 

నేను శివుడికి అత్యంత ఆప్తుడనైన కుంభోధరుడనేవాడను. శివుడు నందిని అధిరోహించేముందు నా పైన కాలు పెట్టి ఎక్కుతాడు.

ఈ గుహలోకి ప్రవేశించిన పశుపక్ష్యాదులను భక్షించడం నా హక్కు.ఇప్పుడు ఈ అవును చంపి తిని నా ఆకలి తీర్చుకుంటాను,

అడ్డులే" అంటూ తొందర చేసాడు కుంభోదరుడు.

"మా గురువు వశిష్ఠుడు దీని భాధ్యతను నాకు అప్పగించారు. 

నా సంరక్షణలో ఉన్న ఈ ఆవుని విడిచిపెట్టు లేదా, నేనే దాని బదులుగా నీకు ఆహారమవుతా" అన్నాడు దిలీపుడు.

"పిచ్చివాడా! ఆవుకోసం ప్రాణాలెవరైనా వదులుకుంటారా! నీవు రాజువు. నీ ప్రాణాలు ఉంటే ఇటువంటి వెయ్యి ఆవులను దానంగా ఇవ్వవచ్చు" అంది సింహం.

"ఆవునే కాపడలేనివాడిని నేనింక ప్రజల ప్రాణాలనేమి కాపాడగలను?అందుకే నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో" అంటూ ప్రాధేయపడటంతో అంగీకరించింది సింహం. కళ్ళు మూసుకున్నాడు రాజు.

అయితే, సింహం తన మీద పడకపోగా పైనుంచి పూలవర్షం కురవడంతో పాటు, 

" కుమారా!లే" అన్న పలుకులు వినపడటంతో ఆశ్చర్యంగా కళ్ళు తెరిచాడు రాజు. 

"రాజా! నీ ధర్మతత్పరతకు మెచ్చాను. నా పాలు పిండి, నీవు, నీ భార్యా ఇద్దరూ తాగండి.సత్సంతానం ప్రాప్తిస్తుంది"అని చెప్పింది నందిని.

దిలీప మహారాజు ఆ ఆవుపాలు పితికి తాను తాగి భార్యకు కూడా తాగించాడు. 

రాణి గర్భం ధరించి,పండంటి బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డే రఘుమహారాజు.రాముడి తాతగారు. ఆయన పేరు మీదుగానే రఘువంశం ఏర్పడింది.రాముడు ఆయన నుంచే ధర్మాన్ని పుణికి పుచ్చుకున్నాడు. రఘురాముడయ్యాడు.


జైశ్రీరామ్🙏🙏

కామెంట్‌లు లేవు: