శ్రీ మహర్నవమి.
మహర్నవమి నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయండి!......
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో రేపటి రోజు.. అంటే ఆశ్వయుజ శుక్లపక్ష నవమిని ''మహర్నవమి'' అంటారు. ''దుర్గాష్టమి'', ''విజయదశమి'' లాగే ''మహర్నవమి'' కూడా అమ్మవారికి విశేషమైన రోజు.
మహర్నవమి నాడు అమ్మవారిని ''అపరాజిత''గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. కొందరు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజయిన ఈ మహర్నవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు.
మహార్నవమి రోజున ఇతర పిండివంటలతోబాటు చెరుకుగడలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైన ప్రదేశాల్లో మహర్నవమి రోజున ''కన్యా పూజ'' నిర్వహిస్తారు. నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిదిమంది కన్యా రూపాలు సంకేత పూర్వకంగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు.
అమ్మవారికి అభిషేకం చేసి, ముఖాన కుంకుమ దిద్ది, కొత్త బట్టలు సమర్పిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మహర్నవమి నాడు సువాసిని పూజ, దంపతి పూజ జరుపుకుంటారు. ఈ రోజున కుంకుమ పూజ చేయించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
తెలంగాణా ప్రాంతాల్లో మహర్నవమి నాడు బతుకమ్మ పూజ చేసి సరస్వతీ ఉద్యాపన చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో దుర్గాష్టమి రోజున ఆయుధ పూజ చేయగా కేరళ రాష్ట్రంలో మాత్రం మహర్నవమి నాడు ఆయుధ పూజ చేసే సంప్రదాయం కొనసాగుతోంది. నవరాత్రులు ముఖ్యంగా మహర్నవమి సందర్భంగా మైసూరు మహారాజా ప్యాలెస్ ను మహాద్భుతంగా అలంకరిస్తారు.
*******************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి