*అనన్య చింతన*
తానే సర్వస్వం అని, తనని అనన్య చింతనతో స్మరించుకునే వారి యొక్క యోగ క్షేమాన్ని తాను అన్నీ చూసుకుంటాను అన్న భరోసా శ్రీకృష్ణుల వారు.
యాంతి దేవవ్రతా దేవాన్
పితౄన్ యాంతి పితృవ్రతాః ।
భూతాని యాంతి భూతేజ్యా
యాంతి మద్యాజినోఽపి మామ్ ।।
ఆ.9 శ్లో.25
దేవతలను పూజించే వారు దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరకి వెళ్తారు, భూతప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు, మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు.
ఈ శ్లోకంలో స్వామివారు అత్యున్నత ఆధ్యాత్మిక పురోగతి సాధించటం కోసం మనము ఆ పరమాత్మనే ఆరాధించాలి అని చెప్తున్నారు.
.
ఇంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, అగ్ని వంటి వారిని ఆరాధించేవారు స్వర్గాది లోకాలకు వెళతారు. ఆ తర్వాత వారి యొక్క పుణ్య ఫలములు తరిగిపోయిన తరువాత వారు స్వర్గము నుండి పంపించి వేయబడుతారు. పితృదేవతల పట్ల కృతజ్ఞతా భావన ఉండటం మంచిదే, కానీ వారి అతి చింతన నష్టదాయకమై మరణించిన పిదప పూర్వీకుల లోకాలకు వెళతారు.
తామస గుణ ప్రధానంగా ఉన్నవారు, భూతప్రేతములను పూజిస్తూ భూతప్రేతములలో జన్మిస్తారు అని శ్రీ కృష్ణుడు అంటున్నారు.
తమ మనస్సులను పరమేశ్వరుడైన భగవంతుని యందే నిమగ్నం చేసినవారే సర్వోన్నత భక్తులు. తదుపరి జన్మలో ఆయన దివ్య ధామానికి చేరుకుంటారు.
పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।
తదహం భక్త్యుపహృతమ్
అశ్నామి ప్రయతాత్మనః ।।
అ.9 శ్లో. 26
నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తుని చే ప్రేమతో ఇవ్వబడిన దానిని, నేను సంతోషంగా ఆరగిస్తాను.
పరమేశ్వరుడిని ఆరాధించటం ఎంత సులువైనదో శ్రీ కృష్ణుడు వివరిస్తున్నారు. వేదాలు దేవతల మరియు పితృదేవతల ఆరాధనకై ఆచరించవలసిన ఎన్నో నియమాలని చెప్తాయి. కానీ శ్రీకృష్ణుల వారి ఈ శ్లోకం లో ప్రేమ నిండిన హృదయంతో తో సమర్పించబడిన ఏదైనా స్వీకరిస్తాను అని తెలియ చేస్తున్నారు. కాపొతే అది ప్రేమ/భక్తితో ఇవ్వబడాలి. ముఖ్యంగా గ్రహించాల్సింది భక్తుని యొక్క భక్తి మాత్రమే భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది. దీని ద్వారా స్వామివారి కరుణాపూరిత స్వభావం తెలుస్తోంది.
తులసీ దళ మాత్రేణ
జలస్య చులుకేన చ!
విక్రీణీతే స్వం ఆత్మానం
భక్తేభ్యో భక్త-వత్సలః!!
(హరి భక్త విలాస్ 11.261)
"భగవంతునికి నిజమైన ప్రేమతో, ఒక తులసి ఆకు మరియు మీ దోసిట్లో పట్టేంత నీరు సమర్పిస్తే, బదులుగా ఆయన తననే మీకు సమర్పించుకుంటాడు, ఎందుకంటే ఆయన ప్రేమకు వశమైపోతాడు."
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అనిర్వచనీయమైన మహాద్భుత గుణములు కలవాడు, ఎవరి సంకల్ప మాత్రం చేతనే అనంతమైన బ్రహ్మాండాలు సృజించబడి, లయమై పోతుంటాయో, ఆయన తన భక్తునిచే నిజమైన ప్రేమతో సమర్పించబడిన అత్యల్పమైన దాన్ని కూడా స్వీకరిస్తాడు.
కాపోతే "కల్మషములేని పవిత్ర హృదయం (మనస్సు) తో ఉన్న వారు సమర్పించే దానిని స్వీకరిస్తాను" అని శ్రీమద్భాగవతం (10.81.4) లో సుదాముని వద్ద అటుకులు తినేటప్పుడు, శ్రీ కృష్ణుడువివరించాడు.
శ్రీ కృష్ణుడు, కౌరవులు, పాండవుల మధ్య సంధికై హస్తినాపురం వెళ్లినప్పుడు దుర్యోధనుడు గర్వంతో యాభై-ఆరు విభిన్న వంటకాలతో విందు ఏర్పాటు చేసాడు. కానీ, శ్రీ కృష్ణుడు ఈ ఆథిధ్యాన్ని వద్దని సామాన్యమైన విదురని ఇంట్లో కేవలం అరటి పండ్లే ఉండి, ప్రేమభావనలో అయోమయంతో పండు పడేసి, తొక్కలు తినిపిస్తుంటే, అక్కడ భక్తి ని చూసిన శ్రీ కృష్ణుడు, ప్రపంచంలో అదే అత్యంత రుచికరమైనదన్నట్టు, పరమానందంతో ఆ తొక్కలు తిన్నాడు.
*అనన్య భక్తి*
భగవంతుడిని సేవించటానికి, తెలుసుకోవటానికి ఎన్నో మార్గాలు, పద్ధతులున్నాయి. అందులొ ఒకటి “భక్తి” మార్గం.
ఈ భక్తిని సాధన చేయటానికి తొమ్మిది పద్ధతులు పెద్దలు చెప్పారు. వాటినే, ” నవ విధ భక్తి ” అని అంటారు.
శ్రీ నారద “భక్తి సూత్రాల”లొ, భక్తిని గురించి ‘” సా త్వస్మిన్ పరమప్రేమరూపా ” అని చెప్పారు:
దీని అర్ధం : పరమాత్మపై అపారమైన ప్రేమ కలిగియుండుటయే భక్తి. అచంచల విశ్వాసము ప్రేమకు పునాది. అది అనంత తత్త్వావలోకమునకు అనాది. విశ్వసించినవానికి విశ్వేశ్వరానుగ్రహము అరచేతి ఉసిరిక.
పై అర్ధాన్ని కొంచెం వివరంగా చెప్పుకుందాం. ఎవరిపైన మనకు అచంచల విశ్వాసముంటుందో, వారిపైన మనకు ప్రేమవుంటుంది. అంటే, ముందుగా, మన పైన మనకు విశ్వాసమున్నట్లేగదా!! ఈ విశ్వాసమన్నది ఒక పూమొగ్గ. ఆ మొగ్గ, రెక్కలు తొడిగి, విచ్చుకొని, తరువాత, ఒక కాయ రూపంగా మార్పు చెందుతుంది.
అదే ప్రేమ. ఆ ప్రేమ అపారంగా, అచంచలంగా వృద్ధిచెందిన ప్పుడు, అది “భక్తి” అనే పండుగా మారుతుంది. పరమాత్మపై మనకు అచంచల విశ్వాసమున్నపుడు, అది ప్రేమగా, భక్తిగా మారుతుంది.
అయితే, దీని ఆంతర్యం ఏమిటి? లేదా దీని “తత్త్వం” ఏమిటి? అతి సులభంగా చెప్పాలంటే, పరమాత్మ అనేవాడు ఒకడు వున్నాడు అని మనం నమ్మినట్లైతే, పరమాత్మ సర్వవ్యాపి అనే సూత్రాన్ని మనం నమ్మాలి. సర్వవ్యాపి అయిన పరమాత్మ, సర్వ ప్రాణులలో వున్నట్లేగదా!! అంటే, పరమాత్మను మనం విశ్వసించి, ప్రేమిస్తున్నట్లైతే, సర్వ ప్రాణులను మనం ప్రేమిస్తున్నట్లేగదా!!
విశ్వంలోని ప్రతి ప్రాణిని మనం ప్రేమిస్తున్నప్పుడు, మనని, మనం ప్రేమించుకున్నట్లే గదా. ఈ “విశ్వప్రేమే”, “విశ్వశాంతి”ని కలుగచేస్తుంది; అనంతమైన ఆనందాన్ని మన మనసుల్లో సృష్టిస్తుంది. మన ” మనసులొ కలిగే ఈ ఆనందాన్నే ఆనందమయకోశం” అంటారు. అనంతమైన ఈ ఆనందాన్ని పొందటమే, మోక్షమని అంటారు. మరి దీనికి మూలకారణం ” భక్తే “గదా!!
ఈ భక్తికి సంబంధించి ఒక గొప్ప కథను ఇప్పుడు చెప్పుకుందాం:
ఒకసారి, నారదుడు బృందావనం వెళ్ళినప్పుడు, అక్కడ గోపికలందరు ఒక చోటకూడి తమలోతాము చాలా తీవ్రంగా ఏదో విషయంపై చర్చించుకోవటాన్ని గమనించాడు. గోపికలకు, కృష్ణుడంటే, అపారమైన ప్రేమ, భక్తి. కృష్ణుడులేనిదే, వారికి లోకమేలేదు. నారదుని చూసి, గోపికలందరూ, ఆయనకు నమస్కరించి, ఆహ్వానించి కూచోబెట్టారు. ఆ తరువాత, వారు, మరల తమలోతాము వాదించుకోసాగారు.
అప్పుడు, నారదుడు, మీ వాదులాట దేనిగురించి అని అడిగాడు. గోపికలందరూ, ఒక్కమాటగా, ఒకమాట చెప్పారు.
” మనుషులను సృష్టించిన ఆ భగవంతుడికి, అంటే, బ్రహ్మకు అసలు బుద్ధిలేదని”.
అది విన్న నారదుడు, వారిని వారించి, భగవంతుడుని తిట్టటం పాపమని బోధించాడు. అయినా, గోపికలు వారి వాదనను వదిలిపెట్టలేదు.
అప్పుడు, నారదుడు, సరే, భగవంతుడికి బుద్ధిలేదని మీరు ఏవిధంగా చెప్పగలరని ప్రశ్నించాడు.
దానికి వారు బదులిస్తూ, మనుషుల కళ్ళకు రెప్పలు పెట్టి, బ్రహ్మ చాలా పెద్ద పొరపాటుచేసాడు అని చెప్పారు.
దానికి, నారదుడు, కళ్ళల్లో దుమ్ము,ధూళి పడకుండా కాపాడటానికేగదా ఆ బ్రహ్మ కనురెప్పలు పెట్టాడు; అది తప్పు ఎట్లాఅవుతుంది అని ప్రశ్నించాడు.
అప్పుడు, గోపికలు “ ఓ నారదా, మేము, మా ప్రేమస్వరూపుడైన కృష్ణుడుని ఒక్క క్షణంకూడా చూడకుండా వుండలేము. అయితే, క్షణ,క్షణానికి, కనురెప్పలు మూసి, తెరుచుకోవటంవల్ల మేము మా కృష్ణుడిని నిరంతరంగా చూడలేకపోతున్నాము. అదేగానీ, బ్రహ్మ కనురెప్పలు పెట్టకుండావుండివుంటే, మేము మా కృష్ణుడిని తదేకంగా చూడగలిగేవారంకదా!! కనురెప్పలవల్ల, మా ఆనందానికి అవరోధం కలుగుతున్నది” అని చెప్పారు.
అదివిన్న నారదుడు, నేనే గొప్ప భక్తుడిని అనుకుంటే, ఈ గోపికలు నన్ను, అందరిని మించిపోయారు
గదా అని ఆశ్చర్యపోయాడు. వారి అనన్య “భక్తి” కి తలవంచాడు.
అందుకే, గోపికలందరూ, ఆనంద-బ్రహ్మస్వరూపాలు. ముక్తి సాధకులు. ఇదే భక్తి-తత్త్వం యొక్క రహస్యం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి