24, అక్టోబర్ 2020, శనివారం

రామాయణమ్. 102

 రామాయణమ్.  102

...

భరతుడి గురించి ఇంతగా శంకిస్తున్నావు కదా!వాడు ఎప్పుడైనా నీకు ఇసుమంతైనా అప్రియము చేసినాడా?

.

తాతగారి ఇంటి వద్దనుండి తిరిగివచ్చి జరిగిన విషయము తెలుసుకొని తల్లిపై కోపించి మనలను తిరిగి తీసుకు వెళ్ళడానికే వస్తున్నాడు తప్ప మనమీద కత్తిదూయటానికి కాదు

.

.అయినా ఏ మూర్ఖుడైనా తండ్రినీ తోడబుట్టిన వారినీ చంపుకుంటాడా? .భరతుడు మనసులో కూడా మనగురించి అప్రియముగా ఆలోచించలేడు.

.

నీవు రాజ్యము కోసమే ఈ విధముగా మాట్లాడుతుంటే భరతుడు రాగానే ఆ రాజ్యమేదో నీకే ఇవ్వమని చెపుతాను.భరతుడు మహదానందంగా ఇస్తాడు. నీవే ఏలుకుందువుగాని.

.

ఇంకెప్పుడూ భరతుని విషయములో నీవు అప్రియముగా మాటాడరాదు .భరతుని అంటే నన్ను అన్నట్లే అని రాముడు లక్ష్మణుని మందలించగా తన శరీరములోనికి తానే ముడుచుకొని పోయినట్లుగా కుంచించుకొనిపోయి సిగ్గుపడుతూ మెల్లగా "అవును భరతుడు మనలను చూచుటకొరకే వచ్చి యుండును" అని పలికాడు.

.

భరతునితో కలిసి మన తండ్రి కూడా వచ్చి యుండునని తలుస్తున్నాను.ఆయనే మనలను తిరిగి తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడేమో!

.

అదుగో తండ్రిగారి ఉత్తమాశ్వములు.అదిగో శత్రుఞ్జయము అది మన తండ్రిగారి భద్రగజము!

.

కానీ ....ఏలనో శ్వేత ఛత్రము కానరావడం లేదు! లక్ష్మణా నా మనసేదో కీడు శంకిస్తున్నది. అని ఇరువురూ మాట్లాడుకొంటూ ఉండగా ..

.

అక్కడ భరతుడు తాను ,గుహుడు,శత్రుఘ్నుడు మూడు జట్లుగా మారి రాముడి నివాస స్థానం కోసం వెదుక సాగారు.

.

పొగ వచ్చేదిక్కునుగమనిస్తూబయలుదేరారు.సైన్యాన్నంతా దూరంగా నిలిపి వేసి పాదచారులై గాలిస్తున్నారు.

.

భరతుడికి మనసులో ఒకటే చింత, ఆందోళన ! అన్నగారిపాదాలకు శిరస్సును ఆనించి తన కన్నీళ్ళతో అభిషేకిస్తేగానీ ఆయన ఆందోళన సద్దుమణగదు.

.

వడివడిగా అడుగులు వేస్తున్నాడు ఆయన హృదయస్పందన అడుగుల సవ్వడి ఒకేరకంగా ఉన్నాయి వాటి ధ్వని రామా రామా అనే విని పిస్తున్నట్లుగా ఉన్నది.

.

అప్రయత్నంగా భరతుని పాదాలు రామ సామీప్యంలోకి ఆయనను నెట్టుకొచ్చాయి.సుమంత్రుడి మనఃస్థితి,శత్రుఘ్నుడిదీ ,గుహుడిదీ అందరిదే అదే పరిస్థితి!

.

వారి గుండె వేగము హెచ్చింది రామదర్శనాన్ని వారిలోని అణువణువూ కోరుతున్నది.


.

అదుగో పర్ణశాల! అక్కడ పడవేసి ఉన్న కట్టెలు,కోసిన పువ్వులు చూశారు. పర్ణశాల మార్గము తెలియడం  కోసమని లక్ష్మణుడు చెట్లకు కట్టిన నారచీరలు గాలికి ఎగురుతున్నాయి.

.

లేళ్ళపేడ,ఆవుపేడ,మహిషముల పేడతో చేసుకొన్నపిడకలప్రోగులు ,అవి చలికాలంలో ఉపయోగించడానికి, అక్కడ కనపడ్డాయి.

.

అక్కడ వీరాసనము వేసుకొని ఇందీవరశ్యాముడు, పురుషశ్రేష్ఠుడు,రాజీవనేత్రుడు,నీలమేఘశ్యాముడు నేలపై కూర్చొని కనపడ్డాడు.

.

ఆయనను చూడగనే ఛీ నా జీవితము ఎందుకు? లోకాలను ఏలగలిగినవాడు,మహాకాంతిశాలీ,అయిన రాముడు నా వలననే కదా ఇలా కటిక నేలపై కూర్చున్నది.

నా మూలముననే కదా ఆయనకు ఇన్ని కష్టాలు అని కనుల నిండా నీరు నింపుకొని ఒక్కసారిగా రాముడి పాదాల వద్ద "అన్నా" అంటూ కూలబడినాడు భరతుడు.

.

NB


(ఎదుటి వాడి లోని శీల సంపద గుర్తించగలగటం రాముడి ప్రత్యేకత ! దశరధుడు కానీ,లక్ష్మణుడు కానీ గ్రహించలేకపోయారు .

ఇక సామాన్యుల మైన మన విషయానికి వస్తే !

We are Conscious of our GOODNESS and other's BADNESS).

.

వూటుకూరుజానకిరామారావు 

.

కామెంట్‌లు లేవు: