24, అక్టోబర్ 2020, శనివారం

కష్టాలు

 నిత్యజీవితంలో ఎన్నో కష్టాలు మనల్ని వెంటాడుతూ భయకంపితుల్ని చేస్తుంటాయి. దుఃఖసంద్రంలో ముంచెత్తి మానసికమైన ఒత్తిళ్ళకు గురి చేస్తుంటాయి. దారిద్ర్యం తాండవిస్తూ మనల్ని నిరాశావాదమనే ఊబిలోకి నెట్టేస్తుంది. ఇలాంటి క్లిష్టపరిస్థితులలో ఒక్కసారి అమ్మ నామాన్ని స్మరించడాం, అమ్మ గుణాల్ని కీర్తించడం, అమ్మ రూపాన్ని దర్శించడం వల్ల ఎనలేని కష్టాలూ, అంతులేని అవాంతరాలూ అంతరించిపోతాయి. మన దుఃఖాలు, దారిద్ర్యం భయం, పోయేందుకు దుర్గాదేవిని స్తుతించాలని ’దేవీ మహాత్మ్యం’ సూచిస్తోంది.


దుర్గే స్మృతా హరసి భీతి మశేష జన్తోః

స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి

దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా

సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా!! (దేవీ మాహాత్మ్యం 4-17)


ఓ దుర్గా! కష్టకాలంలో నిన్ను తలచుకున్న వారి భయాన్ని తొలగిస్తావు. సుఖసంతోషాలతో ఉన్నవారు నిన్ను స్మరిస్తే, వారికి అంతకన్నా అధికమైన శుభాలను కలుగజేసే బుద్ధిని ప్రసాదిస్తావు. దారిద్ర్యం, దుఃఖం, భయం పోగొట్టి అందరికీ ఆనందాన్నిచ్చే సున్నిత మనస్సు నీకు తప్ప వేరెవరికి కలదు తల్లీ!” ప్రపంచాన్ని అంతటినీ పట్టి పీడిస్తున్న దుర్గమాసురుణ్ణి సంహరించడం బ్రహ్మాది దేవతలకు దుర్గమమైంది. 


అప్పుడు దుర్గమాసురుని బారినుండి తమను రక్షించాల్సిందిగా ఋషులు పార్వతీదేవిని వేడుకున్నారు. కరుణాస్వరూపిణి అయిన అమ్మ మనస్సు కరిగి, దుర్గమాసురుణ్ణి సంహరించింది. జగన్మాత, దుర్గమాసురుణ్ణి సంహరించడం వల్ల ’దుర్గ’గా ఆరాధనలు అందుకుంటోంది. మనకు కలిగే దుర్గమమైన కష్టాలను సైతం అంతరింపజేస్తుంది.

కామెంట్‌లు లేవు: