🌺 *ఓం నమో నారాయణాయ*
*57. కమలాక్షు నర్చించు కరములు కరములు;
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు
; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
; మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి
; దేవదేవుని చింతించు దినము దినము;
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.*
*భావము:-* నాన్న గారు! కమలాల వంటి కన్నులు కల ఆ విష్ణుమూర్తిని పూజిస్తేనే అవి చేతులు; లేకపోతే చేతులు, చేతులు కావు; శ్రీపతి అయిన విష్ణుదేవుని స్తోత్రము చేస్తేనే నాలుక అనుటకు అర్హమైనది; కాకపోతే ఆ నాలుకకు సార్థకత లేదు; దేవతలను కాపాడే ఆ హరిని చూసేవి మాత్రమే చూపులు; ఇతరమైన చూపులకు విలువ లేదు; ఆదిశేషుని పానుపుగా కల ఆ నారాయణునకు మ్రొక్కేది మాత్రమే శిరస్సు; మిగిలిన శిరస్సులకు విలువ లేదు; విష్ణు కథలు వినే చెవులే చెవులు; మధు అనే రాక్షసుని చంపిన హరి యందు లగ్నమైతేనే చిత్త మనవలెను; పరమ భగవంతుడైన ఆయనకు ప్రదక్షిణము చేసేవి మాత్రమే పాదాలు; మిగతావి పాదాలా? కాదు. పురుషోత్తము డైన ఆయనను భావించే బుద్ధే బుద్ధి; లేకపోతే అది సద్భుద్ధి కాదు; ఆ దేవుళ్లకే దేవుడైన విష్ణుమూర్తిని తలచు దినమే సుదినము; చక్రాయుధం ధరించు ఆ నారాయణుని గాథలు విశదపరుచు చదువు మాత్రమే సరైన చదువు; భూదేవి భర్త అయిన గోవిందుని గురించి బోధించే వాడే గురువు; విష్ణుమూర్తిని సేవించ మని చెప్పే తండ్రే తండ్రి కాని ఇతరులు తండ్రులా? కాదు; నాన్నగారు!
దేహి శరీరంలోని చేతులు, నాలుక, కళ్ళు, శిరస్సు, చెవులు, చిత్తం, పాదాలు, బుద్ధి ఒకటేమిటి? సమస్తమైన అవయవాలు విష్ణు భక్తిలో పరవశమై పవిత్రం కావలసిందే. లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతఘ్నుడే. ప్రతి రోజూ, ప్రతి చదువూ శ్రీ హరి స్మరణలతో పునీతం కావలసిందే. ప్రతి గురువూ, ప్రతి తండ్రీ నారాయణ భక్తిని బోధించాల్సిందే. అవును లోకైకరక్షాకరు డైన విష్ణుమూర్తికి అంకితం గాని దేనికి సార్థకత లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి