24, అక్టోబర్ 2020, శనివారం

సరస్వతి వాగ్రూపురాలు

 వ్యాఘ్రపాదుడు అను మహాత్ముని కుమారులు ఉపమన్యు మరియు దౌమ్యుడు.  ఈ దౌమ్యుడు కన్యకలకు నామకరణము చేయునపుడు రెండు సంవత్సరముల కన్యకకు సరస్వతి అని పేరు పెట్టెను. అందుచే రెండుసంవత్సరముల కన్యక భరద్వాజస్మృతిలో ప్రాణులందరి జిహ్వలందు వాక్కులకు స్థానమై ఎల్లప్పుడు ఉంటుంది గనుక,  సరస్వతి వాగ్రూపురాలు అయి ఉండుటచేతను,రెండు సంవత్సరముల కన్యకకు సరస్వతి అని పేరు పెట్టిరి.   అందుచేతనే రెండు సంవత్సరముల కన్యకను సరస్వతిగా నవరాత్రులలో ఆరాధించు సాంప్రదాయము గలదు.

అందరి జ్ఞానదృష్టులు ఈ రెండు వత్సరముల కన్యకపై యుండును గనుక ఆ రెండువత్సరముల బాలికకు సరస్వతి అని నామమును నిర్ణయించిరి. జగన్మాత *సరస్వతీ* యని ఈ కారణముచే చెప్పదగును. ఈ సరస్వతి సర్వులకు జ్ఞానదృష్టులను  స్రవింపజేయుటచే గూడ, జగన్మాత *సరస్వతీ* యను నామముచే ప్రసిద్ధురాలు. జగన్మాత జ్ఞానప్రవాహ. 


పరాశక్తి తొలిగా ధరించిన ఏడవ రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.


సృష్టిచేయాలని బ్రహ్మ తపస్సు చేసినప్పుడు అతని శరీరం నుంచి పదిమంది కుమారులు, పదిమంది కుమార్తెలు ఉద్భవించారు. కుమార్తెలలో చివరిది శతరూప. ఆమెయే సరస్వతి.


సరస్వతీ నది హిందూ పురాణములలో చెప్పబడిన ఓ పురాతనమైన నది.  

 ఆ తరువాత మహాభారతములో ఈ నది ఎండిపోయినట్లు చెప్పబడింది.  కాని సరస్వతీ నది అంతర్వాహినియై ఉంటుందని, ప్రయాగవద్ద గంగా, యమునలలో అంతర్వాహినిగా కలిసి, త్రివేణీ సంగమము ఏర్పడినదని పురాణగాథ.    


మూలాధారం నుండి సహస్రారం దిశగా కుండలినీ శక్తి సుషుమ్నా మార్గంలో పయనిస్తుంది. సుషుమ్నాకు ఇరువైఫుల ఉండే ఇడ, పింగళ నాడులు రెండూ గంగ, యమునలు అయితే, సుషుమ్నా నాడి సరస్వతీ రూపము. ఆవిధంగా జగన్మాత సరస్వతీ స్వరూపురాలు. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సరస్వత్యై నమః* అని అనవలెను.

కామెంట్‌లు లేవు: