*_ఈ తీర్పును ఎలా తీసుకుందాం_*
అమెరికా దేశం లో ..
ఓ పదిహేనేళ్ళ కుర్రవాడు ఓ షాప్ లో బ్రెడ్-బటర్ ప్యాకెట్ దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. కాపలాదారు పట్టుకున్నాడు. ఆ కుర్రవాడు వదిలించుకుని పారిపోయే క్రమంలో షాప్ కు సంబంధించిన షెల్ఫ్ పగిలిపోయింది.
కుర్రవాన్ని న్యాయాధికారి ముందుకు ప్రవేశపెట్టారు.
“నువ్వు బ్రెడ్-బటర్ ప్యాకెట్ దొంగిలిస్తూ పట్టుబడ్డావా?” ప్రశ్నించాడు జడ్జ్.
“అవును” నేల చూపులు చూస్తూ చెప్పాడు కుర్రవాడు.
“ఎందుకు?”
“అవసరం పడింది”
“కొనుక్కోవచ్చుగా”
“డబ్బులు లేవు”
“మీ ఇంట్లోంచి తెచ్చుకోవాల్సింది” అన్నాడు జడ్జ్.
“ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంటుంది. ఏ పనీ చేయలేదు. జబ్బు మనిషి. ఈ బ్రెడ్-బటర్ ప్యాకెట్ ఆమె కోసమే” నిదానంగా చెప్పాడు.
“నువ్వేం పనిచేయవా?
“కార్లు కడిగి ఏ రోజు కా రోజు డబ్బు సంపాదించేవాడిని. నిన్న అమ్మ ఆరోగ్యం అసలేమీ బాగా లేకపోతే ఆమెను చూసుకుంటూ ఇంట్లో ఉన్నందుకు పని లోంచి తీసేశారు.” బదులిచ్చాడు కుర్రవాడు.
“ఎవరి సహాయమైనా తీసుకోకపోయావా” జడ్జ్ స్వరం లో జాలి కనిపించింది.
“పొద్దున్నే ఇంట్లోంచి బయలుదేరి కనీసం ఓ యాభై మందిని సహాయం కోసం అర్థించాను. ఎవరూ కనికరించలేదు. చివరికి బ్రెడ్-బటర్ ప్యాకెట్ దొంగతనం చేయవలసి వచ్చింది.
జడ్జ్ దీర్ఘంగా నిట్టూర్చాడు. తన తీర్పు వెల్లడించాడు.
“కేవలం ఒక బ్రెడ్-బటర్ కోసం దొంగతనం చేయవలసి రావడం చాలా సిగ్గు పడాల్సిన నేరం. దీనికి ఆ కుర్రవాడు ఏమాత్రం బాధ్యుడు కాడు. ఈ కోర్టు లో ఉన్న నాతో సహా మిగిలినవారందరూ బాధ్యులే.. నేరస్తులే. అందుకే నాతో సహా ఈ కోర్టు లో ఉన్న ప్రతి ఒక్కరికీ తలా పది డాలర్ల చొప్పున జరిమానా చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరిస్తున్నాను. పది డాలర్లు చెల్లించకుండా ఎవరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు.”
జడ్జ్ తన తీర్పు చదవడం ఆపాడు. తన పర్స్ లోంచి పది డాలర్ల తీసి టేబల్ పై ఉంచాడు. మళ్ళీ తన తీర్పును కొనసాగించాడు.
“అంతేకాకుండా ఆకలితో ఉన్న కుర్రవాడి మీద కనీస దయ చూపకుండా పోలీసులకు పట్టించినందుకు షాప్ యాజమాన్యానికి వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తున్నాను. ఇరవై నాలుగు గంటల్లో జరిమానా కోర్టు కు చెల్లించక పోతే షాప్ మూసివేసి తాళం వేయవలసిందిగా కోర్టు ఆదేశాలిస్తుంది.”
కోర్టు లో జరిమానా గా వసూలు చేసిన డబ్బును కుర్రవాడికి అందించారు.
ఆకలితో బాధపడే పరిస్తితి కుర్రవాడికి కలిగించినందుకు సమాజాన్ని మన్నించవలసిందిగా అతడిని కోరుతూ తీర్పును ముగించాడు న్యాయాధికారి.
ఈ తీర్పు విన్న కోర్టు లోని ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. కుర్రవాడు వెక్కి వెక్కి ఏడుస్తూ జడ్జ్ వంక చూశాడు. ఆయన కూడా ఉబికి వచ్చే తన కన్నీటిని అదుపు చేసుకుంటూ లోపలికి వెళ్ళాడు.
మన సమాజం, వ్యవస్థ, కోర్టు లు ఈ తరహా తీర్పులకు /నిర్ణయాలకు సిద్ధంగా ఉన్నాయా???
“ఆకలి తో ఉన్న వ్యక్తి తిండికోసం దొంగతనానికి వొడిగడితే ఆ సమాజం, దేశం, ప్రజలు సిగ్గు పడాలి” అని చాణక్యుడు ఏనాడో చెప్పాడు.
ఒకవేళ ఈ కథనం మీ హృదయాన్ని తాకి చెమరింప జేస్తే.. మరి కొందరికి కూడా పంచండి.
-బాలగంగాధరరావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి