శుభోదయం🙏
శతకాలు లోకాలోకన ముకురాలు సత్సందేశప్రదాలు.సకలశ్రేయోదాయకాలు. వినండి
పెమ్మయగారి సింగన పద్యం!
తన ఉనికికి భద్రత ముఖ్యం!
మచ్చికలేనిచోట,ననుమానము వచ్చినచోట,మెండుగా
కుచ్చితులున్నచోట,విద్యకు
న్మెచ్చనిచోట,రాజుకరుణింపనిచోట,గుణాఢ్యులున్నచో
నచ్చట మోసమండ్రు సుగుణాకర!పెమ్మయసింగధీమణీ!!
లోకాలోకనం చేత పండిన అనుభవంతో కొందరు హితోపదేశపూర్వకమైన శతకాలువ్రాశారు.అందులో ప్రముఖమైనది పెమ్మయ సింగయగారి శతకమొకటి.
మానవుడు తానెక్కడభద్రంగా ఉండగలనో చక్కగా ఆలోచించుకుని ముఖ్యమైన నిర్ణయాలు తీసికోవాలి. ఉద్యోగం విషయంలో మరీముఖ్యంగా ఆలోచించవలసినవిషయాలివి.
తనకు పరిచయం లేనిచోట,అనుమానాస్పదమైనచోట,కుట్రదారులున్నచోట,సద్గుణవంతులు లేనిచోట,అధికారియే అపకారియైనచోట,తనవిద్సకుమెప్పులేనిచోట,సజ్జనులుండరాదు.
ఉంటే,ప్రమాదం!!!🙏🌷🌷🙏🙏🙏🌷🪸🪸🌷🌷🌷🌷🪸🌷
గ ణా ల తో తం టా!
క:మగణంబు గదియ రగణము
వగవక కృతి మొదట నిల్పు వానికి,
" మరణం",
బగు; నిక్కమండ్రు ;మడియడె,
అగుననియిడి, తొల్లి, టేంకణాదిత్యుఁ
డనిన్;
అనియొక అపప్రధ ప్రచారంలో ఉంది."కావ్యారంభంలో, మగణం తరవాత రగణం ఉపయోగించి పద్యంచెప్పరాదట!" ఒకవేళచెపితే, కృతికర్తకు మరణం సంభవిస్తుందట!
నిజమా?అంటే, నిజమే నంటున్నారు.
ఉదాహరణంగా "నన్నె చోడకవిని" పేర్కొంటున్నారు.
శివకవిశేఖరుడగు నన్నెచోడమహాకవి,"కుమారసంభవమను"-12ఆశ్వాసముల మహాగ్రంధమును
రచియించి తనగురువైన జంగమ మల్లిఖార్జునునకు అంకిత మిచ్చాడు.(ఇతడొక చోడవంశమునకు దెందిన మాండలిక ప్రభువు.)
ఆగ్రంధం కావ్యారంభపద్యంగా" స్రగ్ధరా"-
వృత్తమును వ్రాశాడు.దానికి లక్షణం,
మ-ర-త-న-త- త-గ-అనేగణాలు.పద్యంకావాలా?ఇదిగో చిత్తగించండి!
స్ర:శ్రీవాణీంద్రామరేంద్రార్చిత మకుటమణిశ్రేణిధామాంఘ్రి
జాతోద్యత్కేసరుండాశ్రితజనలషితాశేష
వస్తుప్రదుం డా
దేవాధీశుండు నిత్యోదితుఁడజుడుమహా
దేవుఁడాద్యుండు విశ్వై
కా వాసుండెప్పుడున్ మాకభిమతములుప్రీతాత్ముఁడై యిచ్చుగాతన్;
కుమారసంభవం-మొదటిపద్యం!
భావము: బ్రహ్మేంద్రాది దేవతల కిరీటములయందలి మణిగణ కాంతులచే నర్చింపఁబడు పాదములుగలవాడును,సకలజనుల అభీష్ఠములనొసగు వాడును,నిత్యప్రకాశి ,యు,ఆద్యుడునుయగు విశ్వాకారియు,నగు మహాదేవుడు, ప్రేమతో మాకోరికలుదీర్చుగాక!-అని;
సరే ప్రస్తుతమునకు వస్తాను.ఈపద్యంలో మగణం తర్వాత రగణం ఉపయోగింపబడింది.తత్కారణంగా నన్నెచోడునకు మరణం సంభవించిందట!
చరిత్ర కూడా ఈనిజాన్ని ధృవపరిచింది.పల్లవరాజులతోయుధ్ధంలో నన్నెచోడుడు మరణించాడని సాక్ష్యం గా నాటి చరిత్రను పెద్దలు ధృవపరచినారు.
తస్మాత్ యువకవులారా!
ఇలాంటి ఛందోప్రయోగ రహస్యాలనుగూడా పెద్దలనుండి తెలిసికొని పద్యాలల్లండి!
"శుభంభూయాత్"
స్వస్తి!🌷🌷🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి