13, జులై 2023, గురువారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 115*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 115*


చాణక్యుని మాతామహుల వంశ గోత్రము శ్రీవత్సము. మాతమహులకు పుత్రసంతానము లేనందున వారికి దౌహిత్రుడైన చాణక్యుడు పిండప్రధాన తర్పణాది శ్రాద్ధ విధులకు అధికారి అయ్యాడు. ఆ కారణం చేత మాతమహుల గోత్రనామములతో 'వాత్సాయనుడు' అనే పేరుతో కామసూత్రాలను గ్రంథస్తం చేశాడు చాణక్యుడు. 


శ్లోll 


నమో ధర్మార్థ కామేభ్య స్తత్కామేభ్యో నమో నమః 

త్రివర్గ మోక్ష కామెభ్యో అమితం నమః 


ధర్మము, అర్థము, కామము అనేవి 'మూడుపురుషార్థములు'. ఈ పురుషార్థములకూ, వీటిని కోరుకునే వారికీ నమస్కారములు. ఈ మూడింటిని త్రివర్గములందురు. వీటిని అనుసరించి మోక్షము కోరువారికీ, అలాగే వీటిలోని ఏ పురుషార్ధమునందూ ఏ కోరికా లేని వారికి నమస్కారం. 


సృష్టిలోని ప్రతి జీవికీ మూడు దశలుంటాయి. అవి పుట్టడం. వృధ్ధి చెందడం. నశించడం. వీటినీ సృష్టి, స్థితి, లయ ములంటారు. ఇందులో మొదటిది సృష్టి. దీనికి మూలము కామము. విశ్వములోని ఏ జీవి అయినా కామము ద్వారానే తన జాతిని సృష్టించుకుంటుంది. మైధునక్రియ జరపకుండా జీవిపుట్టుక అసాధ్యం. ఏ జీవి అయినా వాటి వాటి పద్ధతుల ద్వారా మైధునక్రియ చేత తమ (కుటుంబాలను) సంతానాలను కని వృద్ధి చేసుకుంటాయి. నశిస్తాయి. మళ్లీ జన్మిస్తుంటాయి. 


మానవులు కూడా మైధునక్రియ ద్వారానే సంతానాన్ని పొందుతారు. కుటుంబాలను, వంశాలను అభివృద్ధి చేసుకుంటారు. అదే వరుసక్రమంలో పుట్టేవారు పుడుతుంటే పోయ్యేవారు పోతుంటారు. అయితే ఇతర జీవులకంటే భిన్నంగా మానవులకి ధర్మము, అర్థములని మరో రెండు విధులు కామమునకు తోడు అయ్యాయి. మానవుడు బుద్ధిజీవి. ఆలోచనా జ్ఞానం కలిగినవాడు. కనుకనే మోక్షమార్గములను గ్రహించి సత్వరమోక్షమునకు అర్హుడయ్యాడు. మిగతా జీవులకు ఈ అవకాశం లేదు. ధర్మమును పాటిస్తూ, అర్థమును గౌరవిస్తూ, వంశాభివృద్ధికోసమే కామమును ఆశించేవాడే ఉత్తమపురుషుడు. కనుకనే ధర్మార్థ కామములను పురుషార్ధములు అన్నారు. 


ధర్మమును ప్రవచిస్తూ వేదకాలం నాటినుండీ ఎన్నో గ్రంథములు వెలువడినాయి. అర్ధముపై గూడా మానవులకి తగినన్ని గ్రంథములు వచ్చివున్నవి. కానీ ఆరోగ్యవంతమైన, ఆచరణ సాధ్యనీయమైన కామము గూర్చి తగినన్ని గ్రంథములు లేవు. 'కామము పాపము కాదు. అది ధర్మము. శరీరావసరము' దేహానికి ఆహారము వలనే, జీవుడికి ప్రాణం వలనే, ప్రతిజీవికీ కామము అవసరము. దానిని సక్రమముగా ఆచరించాలి. అలా ఆచరించడమే ధర్మము. 


ధర్మము వలన మరణానంతరం ఉత్తమగతులు, పుణ్యలోక నివాసాలు, చివరికి మోక్షము లభిస్తాయి. అర్థము వలన సౌఖ్యానుభవము, పుణ్యకార్యములు, దానధర్మములు చేసే అవకాశం లభించి తద్వారా పుణ్యం లభిస్తుంది. కామము వలన శారీరక, మానసిక సుఖానుభూతి, సంతానప్రాప్తి చేకూరుతుంది. 


ఈ మూడింటికీ సృష్టికర్త అయిన బ్రహ్మ తొలుత ఈ శాస్త్రమును రచించాడు. ఈ శాస్త్రమునందు మూడు భాగములు ఉన్నాయి. దీనిలో....


🔸మొదటి భాగమైన ధర్మముని విడిగా 'మనుధర్మశాస్త్రము' (మనుస్మృతి) పేరిట స్వాయంభువ మనవు శాస్త్రమును రచించాడు. 


🔸రెండవ భాగమైన అర్థమును విడదీసి బృహస్పతి దానిని ప్రత్యేక గ్రంథముగా రచించాడు. 


🔸మూడవదైన 'కామము'ను శివుడి కింకరుడైన నందీశ్వరుడు వెయ్యి అధ్యాయములతో కామసూత్రములను రూపొందించాడు. 


ఆ తదనంతర కాలంలో ఉద్దాలక మహర్షి కుమారుడైన ఔద్దాలకుడు కామసూత్రాలను సంక్షిప్తం చేస్తూ అయిదువందల అధ్యాయాలతో రూపొందించాడు. ఆ తదనంతరం బభ్రుకుమారుడైన భాభ్రవ్యుబు నూటయాభై అధ్యాయాలతో సాధారణ, సంప్రయోగిగా, కన్యాసంప్రయుక్తక, భార్య, పారదారిక, వైశిక, ఔపనిషదిక అనుపేర్లు గల ఏడు అధికరణాలతో సంక్షిప్తీకరించాడు. 


అనంతరం కాలంలో పాటలీపుత్ర నివాసి అయిన దత్తకాచార్యుడు ఆ నగరంలోని వేశ్యల అభ్యర్థన మేరకు ఆరవ అధికరణమైన, 'వైశికము'ను ప్రత్యేక గ్రంథంగా రాశాడు. దత్తకాచార్యునిలాగే సువర్ణనాభుడు, ఘోటక ముఖుడు, గోనర్థీయుడు, గోణికాపుత్రుడు, కుచుమారుడు, చారాయణుడు అనువారలు భాభ్రవుని కామశాస్త్రంలోని మిగతా ఆరు అధికరణాలనూ విడివిడిగా వారి వారి అభిప్రాయాలను జోడిస్తూ గ్రంథాలు రాశారు. కాలక్రమంలో ఈ గ్రంథాలన్నీ నశించిపోయి బాభ్రవుని కామశాస్త్రము కనుమరుగైపోయింది. 


కాలక్రమంలో అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత "వాత్సాయన కామసూత్రాలు" పేరిట చాణక్యుడు గ్రంథ రచనకు పూనుకున్నాడు. బాభ్రవ్యుడు రచించిన కామసూత్రాలు పెద్దవిగా ఉండి చదవడానికి అనువుగా, అనుకూలంగా లేకపోవడం చేత ఆ గ్రంథంలోని అన్ని అంశాలనూ, అధికరణాలనూ సంక్షిప్తం చేస్తూ ఏడు అధికరణాలతో గ్రంధాన్ని రాశాడు చాణుక్యుడు. 


మొదటి అధికరణం -  సాధికారికరణం 

రెండవ అధికరణం - సాంప్రయోగితం 

మూడవ అధికరణం - కన్యాసంప్రయుక్తం 

నాలుగవ అధికరణం - భార్యాధికరణం

ఐదవ అధికరణం - పారదారికాధికరణం 

ఆరవ అధికరణం - నైశికం 

ఏడవ అధికరణం - ఔపనిషది కాధికరణం


మొత్తం ఏడు అధికరణాలతో, ముప్పయ్యారు అధ్యాయాలు అరవైనాలుగు ప్రకరాణాలు గల వాత్సాయన కామసూత్రాలు వెయ్యి శ్లోకాలతో గ్రంథస్తం చేశాడు చాణక్యుడు. వివాహానంతరం స్త్రీలకి అనేక కారణాలచేత కామశాస్త్రాన్ని చదివేందుకు అవకాశం లభించదని, కనుక వివాహానికి పూర్వమే కన్యగా వుండగానే స్త్రీలు కామశాస్త్రాన్ని అభ్యశించే అర్హత కూడా స్త్రీలకి వుందని పేర్కొన్నాడు చాణక్యుడు.


ఏది ఏమైతేనేం, కనుమరుగైపోయిన కామశాస్త్రానికి మళ్లీ జీవం పోశాడు చాణక్యుడు. అతడు గ్రంథస్తం చేసిన 'వాత్సాయన కామసూత్రాలు' మానవజాతి ఉన్నంతవరకూ చరిత్రలో సుస్థిరమై నిలుస్తాయి. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: