16, అక్టోబర్ 2020, శుక్రవారం

123వ నామ మంత్రము

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*123వ నామ మంత్రము*


*ఓం శారదారాధ్యాయై నమః*


సరస్వతీ దేవిచే ఆరాధింపబడునదిగా, శరదృతువునందు ఉపాసింపబడునదిగా, వశిన్యాది వాగ్దేవతలచే పూజింపబడునదిగా, వసంత నవరాత్రులలో సేవింపబడునదిగా విరాజిల్లు జగదీశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శారదారాధ్యా* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం శారదారాధ్యాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు సాధకునకు ఎనలేని బ్రహ్మజ్ఞానసంపదతో బాటు భౌతికపరమైన సుఖసంతోషములు కూడా సంప్రాప్తమగును.


*సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా* (శ్రీలలితా సహస్రనామ స్తోత్రం, 123వ శ్లోకం, 614వ నామ మంత్రము) జగన్మాత తనకు ఎడమకుడిప్రక్కల లక్ష్మీ, సరస్వతులచే సేవింపబడినది అనికలదు. అనగా శారదా (సరస్వతీ) దేవిచే ఆరాధింపబడినది కనుక శ్రీమాతను *శారదారాధ్యా* అని స్తుతించాము. శారదానవరాత్రులు అని దశరానవరాత్రులను అంటాము. శరదృతువులో తొలి పదిరోజులలో ఈ నవరాత్రులు వస్తాయి. శారత్ ఋతువులో ఆరాధింపబడునది గనుక శ్రీమాతను *శారదారాధ్యా* అని అన్నాము.  


కాళికా పురాణంలో


*శరత్కాలే పురాయస్మాన్నవమ్యాం బోధితా సురైః|*


*శారదా సా సమాఖ్యాతా పీఠే లోకే చ నామతః॥* 


అని చెప్పబడిసది. అనగా పూర్వము దేవతలచే శరత్కాల నవమినాడు మేల్కొల్పబడినది అగుటచే శారదా పీఠమనియు, ఆ పీఠమందుగల శ్రీమాత *శారద* అని పిలవబడుచున్నది. శరత్ అంటే సంవత్సరమని అమరంలో గలదు. సంవత్సరమునకు ప్రారంభంలో అనగా చేసిన దేవీపూజ మహాపూజ అవుతుంది అని మార్కండేయ పురాణమందు చెప్పబడినది. అందుచే శ్రీదేవిని *శారదారాధ్యా* అను నామ మంత్రముతో ఆరాధిస్తున్నాము. వసంత ఋతువులోని నవరాత్రులలో దేవిని పూజించ వలెనని రుద్రయామళమందు చెప్పబడినది. శారద అను శబ్దమునకు శాలీనుడు, ప్రతిభగలవాడు అని మేదినీ నిఘంటువు ప్రకారం చెబుతారు. కొందరు పండితులు సభలకు వెళ్ళక శాలలోనే ఉండి అన్తర్ముఖులై దేవిని ఆరాధింతురు. అట్టి శాలీనులచే ఆరాధింపబడు శ్రీమాతను *శారదారాధ్యా* అని అన్నారు. వశిన్యాది దేవతలు సాక్షాత్ సరస్వతీ (శారదా) రూపులు. అటువంటి వశిన్యాదులచే శ్రీమాత ఆరాధింపబడుచున్నది గనుక *శారదారాధ్యా* అని అన్నారు.


అట్టి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శారదారాధ్యాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: