16, అక్టోబర్ 2020, శుక్రవారం

మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 29 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా’


అమ్మవారిని నామములతో పిలవడము అంటే కేవలముగా అన్ని పేర్లతో పిలుస్తేనే పలుకుతుందని కాదు. వాటిలో ఉండే అంతరార్థమును గ్రహించి ఆ నామము చేత ప్రతిపాదింపబడిన విషయమును బాగా పట్టుకోవడము వలన మనసు పునీతమై నడవడిలో మార్పు వచ్చి అమ్మవారి పాదముల పట్ల భక్తి పెరుగుతుంది. అమ్మవారికి సంబంధించిన మంత్రములో ఆమె ముఖము ఒక కూటమయి ఉంటుంది. నోరు ముఖములో ప్రధాన స్థానమును ఆక్రమించి ఉంటుంది. ఇది పదహారు అక్షరముల నామము. అమ్మవారు మందస్మితము చేస్తున్నది. దానికి ఒక కాంతి ఉన్నది.  


మనిషికి అన్నిటికన్నా గొప్ప ఆభరణము ముఖము మీద ఉండే చిరునవ్వు. మనసు స్థితి ముఖము మీద ఉండే చిరునవ్వుతో వ్యక్తమవుతుంది. అమ్మ చల్లటి చిరునవ్వును ధ్యానము చేస్తూ పూజలో కూర్చున్నట్టయితే వెంటనే అమ్మవారితో ఒక దగ్గరతనము ఏర్పడుతుంది. ఇక్కడ వశిన్యాది దేవతలు చిరునవ్వుని అడ్డుపెట్టి ఈశ్వర దర్శనము చేయిస్తున్నారు. మహాకామేశ్వరుడు మందహాస కాంతుల ప్రవాహములోమునుగుతూ, తేలుతూ ఉంటాడు. దక్షిణామూర్తిగా తనలో తాను రమిస్తూ ఉండకుండా ఆయనను బహిర్ముఖుని చేసి ఉంచుతుంది. ఆయన కదిలేట్టుగా, తేలుతూ ఉండేట్టు, మునిగి ఉండేట్టు అమ్మవారి చిరునవ్వు చెయ్యాలి. ఆ కాంతి ఏమిటో ఒక్క మహేశ్వరునికే తెలుసు. మహాకామేశ్వరుని ఆ స్థితిలో ఉంచాలి అంటే ఆ చిరునవ్వు ఆగకుండా అలాగే ఉంటుంది. పరమశివుడు కదులుతూ మనందరికీ దొరకాలి అంటే అమ్మవారి వలననే సాధ్యము అవుతుంది. ఈ ఒక్క నామము పట్టుకుని పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి దర్శనము చెయ్యవచ్చు. తల్లి తండ్రులుగా వాళ్ళిద్దరూ చిరునవ్వుతో కూర్చుని ఉంటే ఉపాసన సిద్ధిస్తుంది. 


ఏ ప్రతిబంధకము లేకుండా ఈశ్వరుని చేరిపోవడానికి ఎప్పుడూ ఆయనను చూడడము అలవాటు అయితే పిలవడానికి చిరునవ్వుతో తల్లి లలితాపరాభట్టారిక ఒక్కతే ఉన్నది. ఆ నవ్వు కేవలము కామేశ్వరుని కొరకు మాత్రమే కాదు మన ఉపాసన ఉద్ధరించడానికి ఉన్నది. లేకపోతే వశిన్యాది దేవతలు ఈ పదహారు అక్షరముల నామము చెప్పరు. అమ్మ చిరునవ్వు వెలుగులు జ్ఞాపకము వచ్చిననాడు అమ్మవారిని స్మరించకుండా బ్రతుకు గడపలేరు. మోక్షము వైపు తీసుకుని వెళ్ళగలిగిన అనుబంధము కనక జీవితములో ఆ చిరునవ్వు చూడటము నేర్చుకోవాలి. ఆ నవ్వులో మనలను ఉద్ధరించాలన్న తాపత్రయము ఉన్నది. ఇది ఈ నామమునకు సంబంధించిన యథార్థమైన లోతు. మూకశంకరులు నీ చిరునవ్వుతో పోల్చడానికి లోకములో సాటి అయిన వస్తువు మరొకటి లేదు. నీ చిరునవ్వు అంత గొప్పది అంటారు. ఆయనే మళ్ళీ ఇంకొక శ్లోకములో – అమ్మా ! ఒకప్పుడు దేవతలు, దానవులు వెళ్ళి పాల సముద్రమును చిలికితే కొన్ని వస్తువులు వస్తే ఒక్కక్కరు ఒక్కటి తీసుకున్నారు. లక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తిని ఒక్కడినే వరించింది. నిన్ను చూసి నమస్కరించిన ఎన్ని కోట్లమందినో ఉద్ధరించగల నీ చిరునవ్వుకి పాలసముద్రమునకు పోలిక పోల్చడము కుదరదు అన్నారు. నీ బిడ్డలయిన గణపతిని, సుబ్రహ్మణ్యుని చూసి ఎంతో గొప్పవాళ్ళని నీ కళ్ళు హర్షభరితమై పొంగుతూ ఉంటాయి. పరమశివుని చూస్తూ ఉంటావు. మన్మధుని కాల్చేసిన వాడు నీ చిరునవ్వు చూసి వచ్చి పక్కన కూర్చుని తాళి కడితే నీమీద నీకు ఒక తృప్తి వచ్చి పులకాంకురములు వస్తాయి. నీ భర్త పిల్లలు సంతోషముగా ఉన్నారు కాబట్టి నీకు అంత సంతోషము. అజ్ఞానములో, కోరికలతో ఉండిపోయిన మేము కొద్దిగా వంగి నమస్కరిస్తే చాలుపైకి ఎత్తి కోరికలు తీర్చి మోక్షము వైపుకి నడిపిస్తావు. ఆశ్రయించిన వాళ్ళను ఉద్ధరించ కలిగిన శక్తులు నీ నవ్వులో ఉన్నాయి. ఆ నవ్వుకి ఉపమానము లేదు అన్నారు.  

అమ్మా ! శంకరునికి చాలా ఇష్టమైన వస్తువులని మేము కొన్ని నిర్ణయము చేసుకున్నాము. ఆయన ఎప్పుడూ నెత్తిమీద పెట్టుకునే చంద్రుడు, నెత్తిమీద పెట్టుకున్న గంగ, తుమ్మిపూలు, విభూతి ఈ నాలుగువస్తువులు అంటే చాలా ప్రీతి అని నమ్మకము ఏర్పడింది. ఎప్పుడూ నీ పక్కన కూర్చోలేడు అప్పుడప్పుడు అలా వెళ్ళి వస్తు ఉండాలి కదా ! పెళ్ళి పీటల మీద నీ చిరునవ్వు, దాని చల్లదనమును చూసాడు. ఇంట్లో ఉంటే ఆ చిరునవ్వుల చల్లదనము చూస్తూ ఉంటాడు. బయటికి వెళ్ళినప్పుడు నీ నవ్వులు గుర్తుకు వచ్చి నువ్వు పక్కన లేని లోటు తీర్చుకోవడానికి తెల్లగా చల్లగా ఉంటే నీనవ్వులు గుర్తు వస్తాయని చంద్రుని తెచ్చి తలమీద పెట్టుకున్నాడు. చద్రుడు పెరుగుతూ తరుగుతూ ఉంటాడు. ఆ చల్లదనము సరిపోయినట్టు అనిపించలేదు. చల్లగా, పుష్కలముగా ఉన్న గంగ దొరికింది నెత్తిమీద పెట్టుకున్నా సరిపోలేదు. తుమ్మిపూలను చూస్తే నీ నవ్వులు గుర్తు వస్తాయని వాటిని మాలగా మెడలో వేసుకున్నాడు. అవి సాయంత్రానికి వాడిపోతాయి. భార్య చిరునవ్వులు గుర్తు వచ్చేట్టుగా ఏదైనా వ్రాసుకుంటే బాగుండునని తెల్లటి భస్మము తీసి ఒళ్ళంతా రాసుకున్నాడు. అసలు రహస్యము ఇదమ్మా అని చెపితే నవ్విన అమ్మ నవ్వు చూసి శివుడు నవ్వితే ఆ రెండు నవ్వుల కాంతులు మమ్ములను ఉద్దరించుగాక అన్నారు. 


పరమశివునికి కుడికన్ను సూర్యుడు, ఎడమకన్ను చంద్రుడు. ప్రకృతి స్వరూపముగా పార్వతీదేవి లోకమంతా ఉంటుంది. గగనరూపములో ఆయన శిరస్సు ఉంటుంది. అమ్మవారి చిరునవ్వులు చూసి ఉండబట్ట లేని శివుడు ఎడమకన్ను కొడుతూనే ఉంటాడు. చంద్రుడు పెరగడము తరగడమే ఆయన కన్ను కొట్టడము. శుక్ల పక్షము - కృష్ణ పక్షము. పెద్దాయన పెద్దకన్ను కదా మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటుంది. అమ్మ మందస్మితములోని అమృతపు జల్లులను చూపిస్తూ పెద్దలు ఎన్నో శ్లోకములు చేసారు. అమ్మా ! నీ నవ్వులోని కాంతులు, శంకరుని నవ్వులోని కాంతులు మమ్ములను ఉద్ధరించు గాక అంటారు. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage/

కామెంట్‌లు లేవు: