**దశిక రాము**
**మహాభారతము**
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
112 - విరాటపర్వం.
' కర్తవ్యం నీభర్తలకు వదిలి, ఆంత:పురం లోనికి తిరిగివెళ్ళు, రాజసభలో నర్తకిలాగా ప్రవర్తించకు. ' అన్న ధర్మరాజుతో రోషంగా, ' ఓయీ కంకుభట్టారకా ! లెస్సపలికితివి. నాభర్తల్లో ఒకయోధుడు, నటుడే. నేనూ పతివ్రతా ధర్మంగా నటన చెయ్యవలసిన దానినే ! అతడు నటుడేకాదు, జూదరికూడా. అట్టిజూదరి భార్యకు నడవడి విధానం తెలిసేదెలా ? ' అంటూ ఆమెకూడా ప్రత్యుత్తరమిచ్చి, అంత;పురానికి వెళ్ళింది. భారమైన హృదయంతో, మేఘావృతమైన చంద్రునివలె, దుమ్ముకొట్టుకుని పోయిన ఆడ యేనుగువలే, మందగమనంతో, బిక్కుమంటూ చూస్తూ, ఆమె వెళ్లినతీరు సభికులచే కంటతడి పెట్టించింది.
ఇక, పుండుపై కారం జల్లినట్లు, సైరంధ్రి అంత:పురం జేరుకోగానే, యేమీ తెలియనట్లు, సుదేష్ణాదేవి, ' ఎందుకలా విచారంగా వున్నావు ? ఏమి జరిగింది ? నిన్నెవరైనా బాధించరా ? చెప్పు ' అని గుచ్చి గుచ్చి అడిగింది. దానికి సైరంధ్రి, ' మహారాణీ ! మీకంతా తెలుసు. నేను వెళ్ళబోయేముందు కీచకుని గృహంలో, యేమి జరుగుతుందో మీకు తెలుసు. నేనుచెప్పినా వినకండా నన్ను ఆనీచుడు, కీచకునివద్దకు పంపించారు. నిండుసభలోకి నన్ను తరుముకుంటూ వెళ్లి, నా పమిటచెంగు లాగి, తలపై, అందరూ చూస్తుండగా, తన కాలితో నా ముఖం మీద తన్నాడు, ఆ దుర్మార్గుడు. ' అన్నది.
సుధేష్ణ కూడా విరాటరాజు లాగానే, గాంభీర్యం ప్రదర్శిస్తూ, ' మాలినీ ! నీవు శోకించవలదు. ఆ దుష్టునికి యిప్పుడే మరణదండన విధిస్తాను. ఎవరక్కడ ? ' అని పరిచారకులను పిలువబోతుండగా ' అమ్మా ! మీకంత శ్రమ అక్కరలేదు. పరాభవింపబడినవారు, పరాక్రమవంతులైతే, కీచకునికి మరణశాసనం వ్రాసినట్లే లెక్క. ' అని కసిగా అన్నది ద్రౌపది.
' ఒక్క రాత్రిలో భూమండలాన్ని బూడిద చెయ్యగల శక్తిమంతులు నా భర్తలు. నీ తమ్ముని కడసారి చూసుకో. బ్రతికుండగానే శ్రార్ధకర్మ జరిపించు ఆ నీచునికి. 'అని చెప్పి రోదిస్తూ అక్కడినుండి వెళ్ళిపోయింది ద్రౌపది. అంత;పుర స్త్రీలు ఓదార్చినా, సుధేష్ణ లాలించినా, ఆమె కుదుటబడలేదు. స్నాన, అన్నపానాదులు త్యజించి, యేమి చెయ్యవలెనా అని ఆలోచిస్తున్న సమయంలో, ఆమెకు భీమసేనుడు మదిలో మెదిలాడు. రాత్రి సమయంలో, అతనివద్దకు వెళ్ళింది ద్రౌపది.
అప్పటికే దినచర్యలో అలిసిపోయిన భీమసేనుడు గాఢనిద్రలో వున్నాడు. అతనిని తట్టిలేపి, దుఃఖిస్తూ, ' నాకు ఇంత పరాభవం జరిగినా, నీ కళ్లారా అదిచూసినా నీకు నిద్ర యెలాపడుతున్నది. నా భర్తలు వీరులని నేను ప్రగల్భాలు పలుకు తున్నాను. ఇక్కడ నీకు రవంత అయినా ఆందోళనలేదు. ' అని నిష్టూరంగా పలికింది.
భీముడు అదాటున నిద్రలేచాడు. పక్కన ద్రౌపదిని చూసాడు. ఆమె అన్నమాటలు స్ఫురణకు తెచ్చుకుని, ' ద్రౌపది ! నేను చెయ్యవలసినపని సూటిగాచెప్పు. నేను నీకు యెప్పుడూ అండగానే వున్నాను. త్వరగా నాకు కర్తవ్యం చెప్పి, చప్పున యెవరికంటా పడక ముందే వెళ్ళిపో. నిశ్చిన్తగా వుండు. ' అని అన్నాడు.
ద్రౌపది యీమాటలకు తృప్తి చెందలేదు.' నీకు అంతా తెలుసు, నాచే చెప్పించాలని అడుగుతున్నావు. నేను యీఅవమానాల ప్రవాహంలో పడి అలిసిపోయాను. కౌరవసభలో, దుశ్శాసనుడు, అరణ్యంలో జటాసురుడు, సై0ధవుడు, ఇప్పుడు యీదుష్టుడు, అందరూ నన్ను అవమానిస్తున్నవారే. ఆ దుశ్శాసనుడు నన్ను యే ముహూర్తాన దాసీ అని సంబోధించాడో, నాకు అదేబ్రతుకు సంప్రాప్తిన్చింది. అయోనిజను, అగ్నిసంభూతను, ద్రుపదుని గారాలపట్టిని, ద్రుష్టద్యుమ్నుని అనుంగు సోదరిని, అయిదుగురు భర్తలు ఈశ్వరప్రసాదంగా పొందినదానను, నాకెందుకు విధి యిన్ని పరీక్షలు పెడుతున్నది ? నన్ను కీచకుడు విరాటుని కొలువులో కాలితో తన్నుతూ వుంటే, అందరూ బొమ్మలలాగా చూస్తూ యెందుకని వుండిపోయారు ? '
అని అనేక విధాలా ద్రౌపది ఆక్రోశిస్తూ యెదుట నిలబడి వుంటే, భీమసేనుని నిద్రమత్తు యెగిరిపోయింది. ఆమె కన్నీటిని తుడుస్తూ " ద్రౌపదీ ! కంట తడి పెట్టకు. అన్నింటికీ యీ అజ్ఞాతవాస జీవనం అడ్డు వస్తున్నది. అన్నమాట, కట్టి పడవేస్తున్నది. ధర్మరాజు కనుసన్న చెయ్యకుండా వుండివుంటే, అప్పుడే, విరాటుని సభలోనే, కీచకుని పీచమణిచేవాడిని. అదేవిధంగా ఆనాడు కౌరవసభలో కూడా ! ఒక విధంగా నీ పాతివ్రత్యమే నిన్ను కాపాడుతున్నది. మా పరాక్రమము నీకింతవరకూ, యే సందర్భంలోనూ వుపయోగపడలేదు. నీవు పడుతున్నకష్టాలు, నీవు చూపుతున్న ఓర్పు చూసి, రానున్న తరాలు నీకు శిరస్సు వంచి నమస్కరిస్తాయి. ద్రౌపదీ ! భీమసేనుడేనా యీవిధంగా అంటున్నాడు అనుకోవద్దు, ధర్మాన్ని వీడకు, క్రోధాన్ని జయించు. ' అని అనునయించాడు.
విలవిలలాడుతున్న ద్రౌపది ముఖాన్ని రెండుచేతులతో పట్టుకుని, ఆమె చెక్కిళ్ళను వత్తుతూ, ఒక వుపాయాన్ని రహస్యంగా ఆమెచెవిలో చెప్పాడు. ' నీవు కీచకునితో నేను చెప్పే పధకంలో భాగంగా తీయగా మాట్లాడి, ఆ దుష్టుడు యెలాగైనా నర్తనశాల లోనికి యీరాత్రి నీ పొందుగోరి వచ్చేటట్లు ప్రయత్నించు. నర్తనశాలలో, రాత్రి నిర్మానుష్యంగా వుంటుంది. అక్కడవున్న అందమైన పాన్పు మీద కీచకుడు శాశ్వత నిద్రపోయే యేర్పాటు చేస్తాను, మూడో కంటికి తెలీకుండా. నీవు ఆ ప్రయత్నంలో వుండు. ' అని చెప్పాడు భీమసేనుడు. ద్రౌపది, ఈ పధకానికి అంగీకరించి తృప్తిగా వెళ్ళిపోయింది.
మరునాడు తెల్లవారగానే, కీచకుడే ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. నిజానికి ద్రౌపదే, కీచకుని యెలా కలిసి ఈ పధకానికి అంకురార్పణ చెయ్యాలా అని ఆలోచిస్తున్నది. వెదుకబోయిన తీగ కాలికి తగిలింది. నిన్న విరాటరాజు కొలువులో యెవరూ యీమెను సమర్ధించక పోయే సరికి, రెట్టించిన ఉత్సాహంతో, ' సైరంధ్రీ ! ఈ మత్య్సదేశరాజును నేనే. నన్ను సుఖపెట్టు. నీ మొడితనం కట్టిపెట్టు. ' అని తెలతెలవారుతూనే, కామ ప్రేలాపనలు మొదలుపెట్టాడు.
ఈసారి ద్రౌపది తనధోరణి పధకానికి అనుకూలంగా మార్చి, ' కీచకా ! నా భర్తలు గొప్ప వీరులని చెప్పాను కదా ! వారికి తెలియకుండా నీతో, రహస్యంగా గడిపే గోప్యమైన ప్రదేశం లేదుకదా ! అందుకని ఆలోచిస్తున్నాను. ' అని ఉపాధ్ఘాతంగా చెప్పింది.
ఆ సమాధానానికి కీచకుడు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు, సంతోషంతో. నీవు యెక్కడకు రమ్మన్నా వస్తాను. స్థలం నీవే నిర్ణయించు. ' అన్నాడు కామంతో కనులు, మెదడు మూసుకుపోయి. అదే అదనుగా, ద్రౌపది ' కీచకా ! నర్తనశాలయే మనకు ఏకాంత ప్రదేశానికి అనువుగా వుంటుంది. రాత్రి సమయంలో అక్కడికి యెవరూరారు. ' అని స్థలా నిర్దేశం చేసి, కీచకునికి మృత్యురేఖ గీసింది, వాని ఆమోదంతోనే.
కీచకుడు సంతోషంగా సరే అని వెళ్ళిపోయాడు. ద్రౌపది నెమ్మదిగా ఊపిరి తీసుకుని, భీమునికి ఈ విషయాన్నీ చేరవేసింది.
స్వస్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి