16, అక్టోబర్ 2020, శుక్రవారం

ప్రహ్లాదుడు

 🌺 *ఓం నమో నారాయణాయ* 🌺



*34. సురలం దోలుటయో, సురాధిపతులన్ స్రుక్కించుటో, సిద్ధులం బరివేధించుటయో, ముని ప్రవరులన్బాధించుటో, యక్ష కిన్నరగంధర్వ విహంగ నాగపతులన్ నాశంబు నొందించుటో, హరియంచున్ గిరి యంచు నేల చెడ మోహాంధుండవై పుత్రకా!*



*భావము:-* కుమారా! ప్రహ్లాదా! దేవతలను పారదోలవయ్యా. లేకపోతే దేవతా విభులను పట్టి చావబాదటం కాని, సిద్ధులను బాగా వేధించటం కాని మునీశ్వరులను బాధించటం కాని, లేదా యక్షులు, కిన్నరులు, గంధర్వులు, పక్షి రాజులు, నాగరాజులను చంపటం కాని చెయ్యాలి. ఇలా చేయటం మన ధర్మం. అది మానేసి, హరి అంటూ గిరి అంటూ అజ్ఞానం అనే అంధకారంతో ఎందుకు మూర్ఖుడిలా చెడిపోతున్నావు.”




*35.అనినఁ దండ్రిమాటలకుఁ బురోహితు నిరీక్షించి ప్రహ్లాదుం డిట్లనియె "మోహ నిర్మూలనంబు జేసి యెవ్వని యందుఁ దత్పరులయిన యెఱుకగల పురుషులకుం బరులు దా మనియెడు మాయాకృతం బయిన యసద్గ్రాహ్యంబగు భేదంబు గానంబడ దట్టి పరమేశ్వరునకు నమస్కరించెద.*



*భావము:-* ఇలా చెప్పిన తండ్రి మాటలు విని ప్రహ్లాదుడు గురువు చండామార్కులను చూసి ఇలా అన్నాడు “జ్ఞానులు మోహం తొలగించుకొని భగవంతుని అందు ఏకాగ్ర భక్తి ప్రపత్తులతో ఉంటారు. అట్టి వారికి తమ పర భేదం అనే మాయా మోహం అంటదు. ఆ భగవంతుడు విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను.




*36.అజ్ఞుల్కొందఱు నేము దా మనుచు మాయంజెంది సర్వాత్మకుం బ్రజ్ఞాలభ్యు దురన్వయక్రమణునిన్ భాషింపఁగా నేర రా జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వే దజ్ఞుల్తత్పరమాత్ము విష్ణు నితరుల్ దర్శింపఁగా నేర్తురే?*



*భావము:-* కొందరు అజ్ఞానంలో పడి తాము వేరు, పరులు వేరు అనే మాయ అనే భ్రాంతిలో ఉంటారు. సర్వాత్మకుడు అయిన భగవంతుడిని ఎంత తెలివితేటలూ, పాండిత్యం ఉపయోగించినా కూడా తెలుసుకోలేరు. ఆ విష్ణుమూర్తిని పరమాత్ముడిని బ్రహ్మ వంటి వేద విజ్ఞాన మూర్తులు కూడా తెలుసుకోలేని వారే. ఇక ఇతరులు సామాన్యులు ఆ పరాత్పరుడు అయిన విష్ణుమూర్తిని ఎలా దర్శించగలరు!

కామెంట్‌లు లేవు: