16, అక్టోబర్ 2020, శుక్రవారం

రామాయణమ్..145

 రామాయణమ్..145 

.........

నేను ఒకప్పుడు వేయి ఏనుగుల బలముతో,పర్వతమంత ఆకారముతో సంచరిస్తూ మునుల ఆశ్రమాల మీదకు దండుగా వెళ్లి వారివారి యజ్ఞాలను భంగము కావిస్తూ ఉండేవాడిని .

.

ఒకసారి విశ్వామిత్ర మహర్షి ఆశ్రమములో కలిగిన అనుభవము చెపుతాను విను .

.

ఆ మహర్షి ఒకప్పుడు గొప్ప యజ్ఞం చేయ సంకల్పించి యాగరక్షణార్దము దశరధ మహారాజు వద్దకు వెళ్లి ఆయన కొడుకును తనతో పంపమన్నాడు .అందుకు ఆ రాజు వీడింకా పసిబాలుడు ,నా చతురంగబలాలు తీసుకొని నేనే వస్తాను అని అన్నాడు.

అందుకు మహర్షి నిరాకరించి ,నా యజ్ఞ విధ్వంసానికి పూనుకునే రాక్షసులు సామాన్యులుకారు ,వారిని వధించాలంటే రాముడొక్కడే శరణ్యము కావున రాముని పంపు అని ఆయనను ఒప్పించి పసిబాలుడైన రాముని తెచ్చుకుని కాపలా పెట్టుకున్నాడు.

.

 రాముడికి అప్పటికింకా పసితనపు చాయలు పోలేదు విశాలమైన నేత్రాలు,శోభాసంపన్నుడు అయిన రాముడికి మీసము కూడా మొలవలేదు ,

.

ఒకటే వస్త్రము చుట్టుకొని ,జుట్టుముడిపెట్టుకొని బంగారుమాల ధరించి ,చిత్రముగా ఉన్న ధనస్సును చరుచుకుంటూ ఆశ్రమ వాకిట అటూఇటూ తిరుగుతున్నాడు.

.

నేను అప్పుడు మహర్షి ఆశ్రమము లోపలికి ప్రవేశిస్తూ ఉండగానే నన్ను గమనించి ఏ మాత్రమూ తొట్రుపాటు,భయమూ లేకుండా ధనస్సుకు నారి కట్టాడు .

.

ఆ! వీడేమిచేస్తాడు బాలుడు అని లక్ష్యపెట్టక తొందరగా విశ్వామిత్రుడి యజ్ఞవేదిక వద్దకు వెళ్ళాను .

.

అప్పుడు నాకు గుర్తు ! ఒకేఒక్క బాణము రయ్యిన దూసుకుంటూ వచ్చి నన్ను నూరు యోజనముల దూరములోనున్న సముద్రములో పడవేసినది .

.

ఎందుకు దయతలచాడో కానీ నాకు తెలవదు ,నన్ను మాత్రము ప్రాణాలతో విడిచిపెట్టాడు.సముద్రములో పడ్డ నేను కొంతసేపటికి తేరుకొని బ్రతుకుజీవుడా అని లంకకు చేరుకున్నాను.

.

అప్పటికి రాముడు అస్త్రవిద్య పూర్తిగా నేర్చుకొని యుండలేదు.

.

ఈ మధ్య కాలములో జరిగిన సంఘటన ఒకటి చెపుతాను విను .

.

మనవాళ్ళు ఇద్దరితో కలిసి ఒక క్రూరమైన మృగ రూపము ధరించి అడవిలో మునులను భయపెడుతూ సంచరిస్తున్నాను నేను .

.

భార్యా ,తమ్ముడితో కలిసి అడవిలో రాముడు ఉండటము చూశాను .వాళ్ళను చూడగానే పూర్వము నాకు జరిగిన అవమానము గుర్తుకు వచ్చి వారిని భక్షించాలని తలచి మెల్లగా వారి ఆశ్రమముప్రాంతములోనికి చేరుకున్నాము.

.

ఎట్లా పసిగాట్టాడో పసిగట్టాడు రాముడు మూడు బాణాలు ధనస్సుకు తొడిగాడు అవి మాకోసమే అని అర్ధమయ్యి అవి ధనుస్సు నుండి వేలువడేలోగానే నేను తప్పించుకున్నాను .

పాపము వారిరువురికీ రాముడి బాణము గురించిన జ్ఞానము లేకపోవటము చేత వాటి బారినపడి మృతులయ్యారు.

.

కాబట్టి రావణా ,హాయిగా సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖ్ఖాన ఎందుకు పెట్టుకుంటావు ,నీవాళ్ళంతా రకరకాల ఉత్సవాలు చేసుకుంటూ రోజూ ఆనందముగా ఉంటున్నారు ,వారికి ఆ ఆనందము కలకాలము ఉండేటట్లు చూడు .నిష్కారణముగా రాముడికి అపకారము చేసి ఆయన కోపానికి గురి అయ్యి మొత్తము రాక్షస జాతినే ఎందుకు పాడు చేసుకుంటావు అని పలికాడు మారీచుడు.

.

రామాయణమ్ .146

.........

మరణించబోయేవాడికి ఇచ్చిన ఔషధములవలె ,చవట నేలలో వేసిన విత్తనములవలె మారీచుడి హితోక్తులు నిష్ఫలమైపోయాయి.

.

రావణుడు రాముడి పట్ల అభిప్రాయమేమీ మార్చుకోలేదు ,పైగా అతడు మానవమాత్రుడు నన్నేమీ చేయజాలడు అన్నట్లుగా పరుషముగా మాట్లాడాడు .

.

ఖరుడి హత్యకు ప్రతీకారముగా ఆతడి భార్యను ఎత్తుకొని రావలసిందే అని పట్టుబట్టాడు .

.

నేను చేయాలనుకున్న పని యొక్క గుణ దోష విచారము చెయ్యి అని నిన్ను అడుగలేదు .

.

నీకు రాజుతో మాటలాడే పద్ధతి తెలియకున్నది ,దోసిలి ఒగ్గి అతనికి ప్రతికూలముకాని హితకరములైన విషయాలను వినయముగా, మృదువుగా చెప్పవలె! 

.

ఎంత హితకరములైనా గౌరవము లేకుండా తిరస్కార బుద్ధితో చెప్పినచో రాజు హర్షించడు..

.

రాజు అనగా అయిదుగురు దేవతల తెజోంశలు కలగలసినవాడు .

అగ్ని,ఇంద్ర,వరుణ,యమ,చంద్ర అంశలవి.

.

నీవు ఆ జ్ఞానము కోల్పోయి నీ ఇంటికి సహాయము నిమిత్తము స్వయముగా వచ్చిన నన్ను అవమానిస్తున్నావు.

.

ఇది మంచిదా ,లేక చెడ్డదా నాకు ఈ పని చేయగల సామర్ధ్యమున్నదా లేదా అని నేను నిన్ను అడుగలేదు .

.

నేను తలపెట్టిన ఈ మహా కార్యమునకు నీ సహాయము అత్యంత ఆవశ్యకము కావున నీవు చేసి తీరవలె !

.

 ఇది నా ఆజ్ఞ!

.

నీవు చిత్రవిచిత్ర వర్ణములగల బంగారు లేడి రూపము ధరించు ,ఆ లేడి వంటి మీద వెండి చుక్కలు మెరుస్తూ ఉండాలి సుమా !

.

వారి ఆశ్రమ పరిసర ప్రాంతాలలో తిరుగుతూ సీత దృష్టిని ఆకర్షించు ,నిన్ను చూసి ఆవిడకు ఆశ్చర్యము కలుగవలె !

.

.నిన్ను పట్టితెమ్మని ఆవిడ రాముని పంపుతుంది ,నీవు అతనిని ఆశ్రమానికి బహు దూరముగా తీసుకొని పోయి "అయ్యో లక్ష్మణా ,అయ్యో సీతా " అని అరుపులుకూడా అరువు.

.

అది విని సీత లక్ష్మణుని రాముని కొరకు పంపగలదు .వారిరువురూ ఆవిధముగా దూరముగా వెళ్ళిన పిదప అనాయాసముగా ఆమెను నేను ఎత్తుకొని రాగలను.

.

మారీచుడా నీవు ఈ పని చేసినట్లైన ఎడల నా రాజ్యములో సగ భాగము నీకిచ్చెదను. 

ఆలస్యముచేయక బయలుదేరు నీ వెనుక రధముపై కూర్చుండి నేను అనుసరిస్తాను. 

.

ఈ విధముగా రాముని వంచించి యుద్ధము చేయకుండగనే సీతను పొంది కృతకృత్యుడనై లంకకు తిరిగి వెళ్ళేదను, 

.

నా ఆజ్ఞకు విరుద్ధముగా నీవు చేసినట్లైనచొ ఇప్పుడే నిన్ను చంపి వేస్తాను ,రాజుకు ప్రతికూలముగా ఉండేవాడు సుఖముగా అభివృద్ది చెందజాలడు. 

.

నీచే బలాత్కారముగా నైనా ఈ పని చేయిస్తాను . నీ ఇష్టాయిష్టములతో నాకు పని లేదు..

.

నీవు రాముని వద్దకు వెళ్ళినచో మరణించవచ్చును ,లేక మరణించకపోవచ్చును కానీ నాతొ విరోధము పెట్టుకుంటే తక్షణమే మరణిస్తావు కావున నీకేది మంచిదో ఆలోచించి నిర్ణయించుకో! 

.

అని బెదిరించాడు రావణుడు!


రామాయణమ్ 147

...............

రావణుడి ఆజ్ఞ విని మారీచుడు అంతేపరుషముగా బదులిచ్చాడు.

నీవు,నీపుత్రులు,నీఅమాత్యులు,నీ రాష్ట్రము సకలము నాశనమయ్యేటట్లు ఏ పాపాత్ముడిచ్చాడు నీకీ సలహా ! 

.

కోరికోరి మృత్యుద్వార ప్రవేశము చేయాలనుకుంటున్నావు.

.

నీకు సరి అయిన సలహా ఇచ్చే మంత్రులే కరవైనారే!

.

రావణా ఇంత తీక్ష్ణ స్వభావముగల నీ పాలనలో ప్రజలంతా కూడా నక్కచేత కాపలా కాయబడే గొర్రెల వంటి వారు ! వారికింకా వృద్ది ఎక్కడ?

.

నేను ఎలాగూ రామునిచేతిలో చంపబడతాను ,ఆ తరువాత కొంతకాలానికే నీ వంతుకూడా వస్తుంది ,నేను ఆయన చేతిలో చనిపోవడానికే నిశ్చయించుకున్నాను.

.

రాముడి చూపు నా మీద పడనంతవరకే నా ప్రాణాలు ఈ శరీరములో ఉంటాయి ,ఒక్కసారి ఆయన నన్ను చూశాడా ఇక ఆ క్షణమే నా జీవితపు చివరి క్షణము.

.

అని పలుకుతూ దీనముగా ఇక వెళదాము పద అంటూ రావణుడితో బయలుదేరాడు మారీచుడు .

.

అప్పుడు రావణుడు ఆనందముగా మారీచుని కౌగలించుకొని తన రధము మీద కూర్చుండ బెట్టుకొని రామాశ్రమసమీపములోకి చేరాడు.

.

విమానము వలెనున్న ఆ రధము దిగి పరిసరాలను గమనిస్తూ ఆశ్రమము వైపు దృష్టి సారించాడు.

.

మారీచా !అదుగో ఆ అరటి చెట్లు పెరిగివున్నదే ఆ ప్రదేశము ! అదే శ్రీరాముని ఆశ్రమము ,నీవు త్వరగా పనిపూర్తిచేయాలి సుమా అని హెచ్చరించి పంపాడు.

.

మారీచుడు ఒక అందమైన లేడి రూపము ధరించాడు.

.

ఆ మృగానికి అందమైన కొమ్ములున్నాయి,

 ఆ కొమ్ముల చివరలు మణికాంతులతో మెరిసిపోతున్నాయి.

ముఖము కొంత తెలుపు,కొంత నలుపు ,

దాని ముఖము ఒక చోట ఎర్రని పద్మమువలె మరియొక చోట నల్లకలువలాగా ఉన్నది.

.

దాని చెవులు ఇంద్రనీలాల మణులా అన్నట్లుగా భాసిస్తున్నాయి.

మెడ కొంచెము ఎత్తుగా ఉండి క్రింది దవడ ఇంద్రనీల మణి లాగా మెరుస్తూ ఉన్నది.

.

దాని పొట్ట మల్లెపూవులాగా ,చంద్రుడులాగా ,వజ్రములాగా ప్రకాశిస్తూ ఉన్నది.

.

దాని శరీరము కొంత భాగము ఇప్పపూవు రంగులో,కొంత భాగము పద్మ కేసరవర్ణముతో మెరిసిపోతూ ఉన్నది.

.

సన్నటి పిక్కలతో తళతళ మెరిసే రంగుతో పొందికైన అవయవములతో చూడగానే స్వంతము చేసుకోవాలన్న భావన ఎంతవారికైనా కలిగించేదిగా ఆ మృగము ఉన్నది.


రామాయణమ్..148

......

ఆ మాయా మృగము చెంగుచెంగున గంతులు వేస్తూ సీతారాముల ఆశ్రమ ప్రాంతములో సంచరిస్తున్నది .

అది గంతులు వేసినప్పుడల్లా సూర్యకాంతి దాని శరీరము మీదనుండి ప్రతిఫలించి వింత వింత శోభలతో అలరారుతున్నది .

.

ఎలాగైనా సరే సీత కంట్లో పడాలనే తాపత్రయముతో ఆశ్రమ పరిసరాలలోకి వెళుతున్నది ,మరల బయటకు వస్తున్నది ,సీతమ్మ వచ్చే అరటిచెట్ల దగ్గరే తిరుగాడుతూ సీత దృష్టి పడేటట్లుగా దూకుతున్నది , హఠాత్తుగా గంతులు వేసి గుండ్రముగా తిరుగుతున్నది,దాని హొయలు,వయ్యారము చెప్పనలవి గాకుండా ఉన్నది.

.

తోటి మృగాలు దాని వద్దకు వచ్చి వాసన చూసి గాభారాపడి తప్పుకుంటున్నాయి. మృగాలు దగ్గరకు వచ్చినప్పుడు తినాలనివాటిమీద కోరిక కలిగినప్పటికీ నిగ్రహించుకుంటున్నాడు మారీచుడు.

.

 ఆ సమయములో పూలుకోసుకోవడానికి సీత ఆశ్రమము నుండి బయటకు వచ్చింది అదే సమయములో ఆమె కళ్ళముందు ఏదో మెరుపు మెరిసినట్లయి అటువైపు చూసింది ,అప్పుడు ముత్యములచేత,మణులచేత సహజసిద్ధముగా అలంకరింపబడి ప్రకాశించే మృగము ఆవిడ కంట పడ్డది.

.

సీతను చూడగానే ఆ మాయామృగము ఇంకా చిత్ర విచిత్ర గతులతో విన్యాసాలు చేసింది ,మధురముగా కూసింది,ఆహ్లాదకరంగా ఆడింది ,ముద్దులు ఒలకబోస్తూ గిరగిరా తిరిగింది, భూమి మీద పడుకొని వళ్ళు విరుచుకొని శరీర సౌందర్యమంతా సీత కళ్ళలో పడేటట్లుగా అటూఇటూ మెదిలింది.

.

అ మృగాన్ని చూడగానే బిగ్గరగా కేక వేసి రామలక్ష్మణులను పిలిచింది సీత.

.

ఆ మృగాన్ని చూడగానే వీడు మారీచుడే అని గుర్తుపట్టాడు లక్ష్మణుడు,

.

అన్నా వీడు నిస్సందేహముగా మారీచుడే ! వేటకు వచ్చిన రాజులను భ్రమింప చేసి రకరకాల మృగ రూపాలు ధరించి వారిని సమీపించి వారు మొహములో పడి దగ్గరకు రాగానే వారిని చంపి భక్షించే వాడు ,అది వాడి చరిత్ర .

.

ఇది వాడి ఐంద్రజాలమే !

.

రామా ఎక్కడైనా మణిమాణిక్యాలు,రత్నాలు సహజముగా పొదగబడ్డ మృగము సృష్టిలో ఉంటుందా ? అని పలుకుతున్న లక్ష్మణుని మాటలకు అడ్డు తగిలి సీత ఇలా పలికింది.

కామెంట్‌లు లేవు: