16, అక్టోబర్ 2020, శుక్రవారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 చతుర్థ స్కంధం -6


దక్షాదుల శ్రీహరి స్తవంబు 


ఆ విధంగా వచ్చిన వికారదూరుడైన ముకుందుని చూచి బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలైన దేవతలు లేచి “దయాసముద్రునకు నమస్కారం! నమస్కారం” అని భక్తితో మ్రొక్కారు. ఆ విధంగా ప్రణామాలు చేసిన తరువాత...ఆ విష్ణుమూర్తి అఖండమైన పరాక్రమం వల్ల, తేరిచూడరాని తేజస్సు వల్ల దేవతలు నిర్ఘాంతపోతూ ఆయనను స్తుతించడానికి అశక్తులైనారు. భయకంపితులై కన్నీరు కారుస్తూ డగ్గుత్తికతో నిశ్చేష్టులై నిలబడి ఎట్టకేలకు కమాలాక్షుని కటాక్షం పొంది...దేవతలు నుదుట చేతులు ఉంచుకొని ఆ మహాత్ముని మహిమను తెలుసుకొని స్తుతించటానికి అసమర్థులైనప్పటికీ ఆయన అనుగ్రహాన్ని పొంది, తమకు చేతనయినట్లు కొనియాడసాగారు. భక్తుల పూజలు పరిగ్రహించేవాడు, బ్రహ్మాదులకు జనకుడు, సునందుడు నందుడు మొదలైన పరమ భక్తులచేత సేవింపబడేవాడు, యజ్ఞేశ్వరుడు అయిన భగవంతుణ్ణి రక్షకుడుగా భావించి దక్షుడు ఇలా స్తుతించాడు. “దేవా! నీవు స్వరూపంతో ఉన్నప్పుడు రాగద్వేషాలు లేని అద్వితీయుడవు, చిద్రూపుడవు, నిర్భయుడవు. ఒకసారి మాయను నిరసిస్తావు. ఒక్కొకసారి దానిని అనుసరిస్తావు. లీలామానుష రూపాలను ధరిస్తావు. నీవు స్వతంత్రుడవు. అయినా మాయకు లొంగి రాగాదులు ఉన్నవాని వలె రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాలను ధరించి దర్శనమిస్తావు. ఈ లోకానికి నీవే ప్రభుడవని, తక్కిన బ్రహ్మరుద్రాదులు నీ మాయా వైభవ మూర్తులని, అందువల్ల లోకాలకు ప్రభువులు కారని, భేదదృష్టితో ఉన్న నన్ను మన్నించు. ఈ విశ్వాసానికి హేతువులైన శివుడు, బ్రహ్మ, దిక్పాలకులు, సకల చరాచర జీవకోటి అన్నీ నీవే. నీకంటె వేరయినది ఈ విశ్వంలో లేదు” అని దక్షుడు విన్నవించిన తరువాత ఋత్విక్కులు ఇలా అన్నారు. దేవా! మేము నందీశ్వరుని శాపం వల్ల యజ్ఞాది కర్మలయందు ఆసక్తుల మైనాము. వేదాలలో ప్రతిపాదింపబడిన ధర్మలక్షణాలు కలది యజ్ఞం. ఆ యజ్ఞంలో ఇంద్రాది దేవతల రూపంతో నీవే సాక్షాత్కరిస్తుంటావు. నీవు యజ్ఞస్వరూపుడవు. నిష్కించనుడవు. నిర్మలుడవు. నిరవద్యుడవు. మాధవా! గోవిందా! హరీ! ముకుందా! చిన్మయమూర్తీ! నిత్యసౌభాగ్యశాలీ! నీ యథార్థ స్వరూపాన్ని మేము గ్రహింపలేము.”సదస్యులు ఇలా అన్నారు. భక్తప్రసన్నుడవైన దేవా! సంసారమార్గం శోకమనే కార్చిచ్చు మంటలచే చీకాకైనది. కష్టాలు అనే గొప్ప కోటలతో దాటరానిది. యముడనే క్రూర సర్పంతో కూడినది. దుర్జనులనే పెద్ద పులులతో నిండినది. అంతులేని సుఖదుఃఖాలనే కాలకూట విషంతో నిండిన గుంట వంటిది. దిక్కు లేనిది. అటువంటి సంసార మార్గంలో సంచరిస్తూ ఎండమావులవంటి ఇంద్రియ వాంఛలలో పడి కొట్టుమిట్టాడుతూ ‘నేను, నాది’ అనే భావాలకు కారణాలయిన దేహం గేహం వంటి గొప్ప బరువును మోస్తూ ఉండే పరమమూర్ఖులైన మానవులు నీ పాదపద్మాలను ఎప్పుడూ చూడలేరు.” 

రుద్రుడు ఇలా అన్నాడు. వరదా! పరమయోగి పూజితుడవైన అచ్యుతా! నీ పాదపద్మాలను నిత్యం మనస్సులో నింపుకొని నీ సంపూర్ణ దయను పొందిన నన్ను చూచి బుద్ధిహీనులు ‘అమంగళమూర్తి’ అని నిందిస్తారు.అయినా ఆ నిందను నేను లెక్కచేయను.”

భృగుడు ఇలా అన్నాడు. పద్మనాభా! నీ మాయకు చిక్కి బ్రహ్మ మొదలైన శరీరధారులు కూడా నీ మహామహిమను గ్రహింపలేరు. కమలనయనా! భక్తుల బాధలను తొలగించే చూపులు కలవాడా! నాకు నిత్యానందాన్ని ప్రసాదించి నన్ను కాపాడు.”బ్రహ్మ ఇలా అన్నాడు. పదార్థ భేదాలను మాత్రమే గ్రహించే నేత్రాలనే ఇంద్రియాలతో పురుషుడు నీ మాయాస్వరూపాన్ని మాత్రమే చూడగలడు. సంపూర్ణమై, జ్ఞానార్థాలకు సత్త్వం మొదలైన గుణాలకు నెలవై అసత్తుల కంటె వేరై, సాటి లేనిదై, విలక్షణమైన నీ రూపాన్ని జీవులు చూడలేరు. నీవు నిర్వికారుడవు. నిరంజనుడవు. నిష్కళంకుడవు. సర్వేశ్వరుడవు. క్రియారహితుడవు. విమలాత్ముడవు. విశ్వవిధాతవు. నిరవద్యుడవు. వేదవేద్యుడవు. ఆనందస్వరూపుడవు. భవబంధాలను పటాపంచలు చేసేవాడవు.”ఇంద్రుడు ఇలా అన్నాడు.రాక్షసులను సంహరించే ఆయుధాలతో దేదీప్యమానంగా ప్రకాశించే ఎనిమిది బాహువులతో కూడి, యోగుల అంతరంగాలకు ఆనందం కల్గించే నీ దేహం శాశ్వతమైనది. ఈ ప్రపంచం లాగా అశాశ్వతమైనది కాదు. హరీ! దేవా! దేవతాచక్రవర్తీ! అటువంటి నీ స్వరూపాన్ని నేను నా మనస్సులో భావిస్తున్నాను.” ఋత్విక్కుల భార్యలు ఇలా అన్నారు.“నీ పాదాలను ఆరాధించడంకోసం దక్షప్రజాపతి ప్రారంభించిన యజ్ఞం పరమశివుని ఆగ్రహంవల్ల భస్మీపటలం అయింది. యజ్ఞభూమి శ్మశానంగా మారి కళాహీనంగా కనిపిస్తున్నది. యజ్ఞవైభవమంతా నేల పాలయింది. అచ్యుతా! పద్మపత్రాల వంటి నీ నేత్రాలను విప్పి ఒక్కమాటు చూస్తే ఈ యజ్ఞం పవిత్రమై యథారూపాన్ని పొందుతుంది.”

ఋషులు ఇలా స్తుతించారు. పుణ్యాత్మా! మాధవా! నీవు మాలాగే కర్మలు చేసినా ఆ కర్మఫలం నిన్ను పొందదు. సంపదలకోసం లోకులు సేవించే లక్ష్మీదేవి ఎంతో ప్రీతితో నిన్ను వరించి దరి చేరినప్పటికీ ఆమెను ఆదరించవు. గోవిందా! కమలనాభా! నీ చరిత్రను వర్ణించడం మాకు సాధ్యమా?” సిద్ధులు ఇలా 

అన్నారు. శ్రీహరీ! సంసార దుఃఖం అనే భయంకరమైన కార్చిచ్చుకు చిక్కి మా మనస్సు అనే ఏనుగు తపించి దప్పిగొన్నది. ఇప్పుడు నీ పవిత్ర గాథలనే అమృత స్రవంతిలో మునిగి తేలి సంసార తాపాన్ని పోగొట్టుకున్నది. పరబ్రహ్మతో ఐక్యాన్ని సంపాదించిన ధీరునివలె ఆ నదిలో నుండి తిరిగి బయటికి రావటం లేదు.”యజమానుని భార్య అయిన ప్రసూతి ఇలా అన్నది.“కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలు అన్నీ ఉన్నా తలలేని మొండెము శోభిల్లదు. అలాగే ప్రయాజలు మొదలైన ఇతర అంగాలెన్ని ఉన్నా నీవు లేని యజ్ఞం శోభిల్లలేదు. ఇప్పటి నీ రాక శుభదాయకం. మధవా! మమ్ము కాపాడు.” లోకపాలకులు ఇలా అన్నారు. దేవాదిదేవా! ఈ కనిపించే విశ్వాన్ని నీవు వేరుగా ఉండి చూస్తావు. నీవు బహిర్ముఖాలైన మా ఇంద్రియాలకు పంచభూతోపలక్షితమైన జీవివలె కనిపిస్తావు. ఇదంతా నీ మాయా విలాసం. ఓ అవ్యయానందా! గోవిందా! పురుషోత్తమా! శుద్ధ సత్త్వ గుణంతో కూడిన నీ రూపాన్ని మాకు చూపించవు. ఏమి బ్రతుకులయ్యా మావి?”

యోగీశ్వరులు ఇలా అన్నారు.ఓ విశ్వస్వరూపా! ఈ విశ్వంలోని జీవులను నీకంటె వేరుగా చూడనివాడు నీకు మిక్కిలి ఇష్టుడు. నీవు లోకాల సృష్టి, స్థితి, లయల కోసం బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన అనేక భేదాలను పొందుతావు. సత్త్వరజస్తమస్సులనే వేరు వేరు గుణాలతో కూడిన నీ మాయవల్ల ఇలా చేస్తూ స్వస్వరూపాన్ని ధరిస్తూ ఉంటావు. ఓ కరుణామయా! కమలాప్రియా! కమలనయనా! నిరంతర నిఖిల భువన రక్షా! భృత్యభావంతో, అత్యంతానురక్తితో అనన్య భక్తితో నిన్ను సేవించే మమ్ము కాపాడు.”శబ్దబ్రహ్మ ఇలా అన్నారు. హరీ! నీ అసలైన రహస్యాన్ని గ్రహించటానికి ఉత్తమ భక్తియుక్తులమైన నేనుగాని, బ్రహ్మ మొదలైనవారు గాని సమర్థులం కాదు. నీవు సత్త్వగుణానికి నిలయమైనవాడవు. పరాత్పరుడవు. నిర్గుణుడవు. పరబ్రహ్మ స్వరూపుడవు. ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు విధాలైన పురుషార్థ ఫలాలను నీవు ప్రసాదిస్తావు. అటువంటి నీకు మేమంతా సంతతం నమస్కరిస్తున్నాము. మమ్ము ఆదరించు.” అగ్నిదేవుడు ఇలా అన్నాడు.హరీ! నీవు యజ్ఞాలను రక్షిస్తావు. ఐదు అగ్నిహోత్రాలు, ఐదు మంత్రాలు గల యజ్ఞమూర్తివి నీవే. నీవు హోమస్వరూపుడవు. నీ తేజస్సును దాల్చి నీ ఆజ్ఞానుసారం నేను యజ్ఞాలలో హోమద్రవ్యాలైన హవ్యలను ధరిస్తున్నాను.”దేవతలు ఇలా అన్నారు.

శ్రీపతీ! దేవాధిదేవా! పూర్వం ప్రళయకాలంలో సర్వాన్ని కడుపులో దాచుకొని నీవు ఒంటరిగా ఉన్నప్పుడు జనలోకానికన్నా పైలోకాలలో ఉండే సిద్ధపురుషులు నీ సత్య స్వరూపాన్ని మనస్సులో మననం చేయగా ఆనాడు పాలసముద్రం మధ్యలో పన్నగరాజు తల్పంపై పవ్వళించి ఉన్న నీ దివ్య స్వరూపాన్ని ఈనాడు మళ్ళీ మాకు చూపించావు.”గంధర్వులు ఇలా అన్నారు..కమలలోచనా! లక్ష్మీహృదయేశ్వరా! దేవా! ఈశ్వరా! శివుడు, బ్రహ్మ మొదలైన దేవతలు, మరీచి మొదలైన ప్రజాపతులు నీ అంశాంశాలచేత జన్మించారు.ఈ బ్రహ్మాండం నీ క్రీడా మందిరం. నీకు పరమభక్తితో ప్రణమిల్లుతున్నాము. మమ్మల్ని పాలించు.” విద్యాధరులు ఇలా అన్నారు.కమలనయనా! విను. నీ మాయకు వశుడై మానవుడు దేహం ధరించి, ఆ దేహంపై ‘నేను, నాది’ అని ఆసక్తి పెంచుకుంటాడు. కొడుకు, భార్య, ఇల్లు, పొలము, చుట్టాలు, ధనం, పశువులు మొదలైన వాటి సంయోగ వియోగాల వల్ల దుఃఖిస్తాడు. దయామయా! లక్ష్మీప్రియా! అలాంటి ధైర్యహీనుడు, ఇంద్రియార్థాలలో మిక్కిలి ఆసక్తి కలవాడు, చెడ్డ మనస్సు కలవాడు కూడా నీ గుణాలకు సంబంధించిన సత్కథలను వింటే ఆ అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానం పొందుతాడు.బ్రాహ్మణులు ఇలా అన్నారు. “దేవా! ఈ యజ్ఞం, ఇందులోని హవ్యం, అగ్ని, మంత్రాలు, సమిధలు, దర్భలు, పాత్రలు, సదస్యులు, ఋత్విక్కులు, దంపతులు, దేవతలు, అగ్నిహోత్రాలు, స్వధ, సోమరసం, నెయ్యి, యజ్ఞపశువు - అన్నీ నీవే. నీవు పూర్వం వేదస్వరూపమైన ఆదివరాహరూపం ధరించి, ఏనుగు తన దంతంతో పద్మాన్ని పైకి ఎత్తినట్లు నీ కోరకొనతో పాతాళంనుండి భూమిని పైకి లేవనెత్తావు. యోగులు నిన్ను స్తుతిస్తారు. నీవు యజ్ఞస్వరూపుడవు. వేదకర్మలు ఆచరింపక భ్రష్టులమైన మాపై దయ చూపు. నీ నామాన్ని సంస్తుతిస్తే యజ్ఞాలలో సంప్రాప్తించే సమస్త విఘ్నాలు సమసిపోతాయి. అటువంటి నీకు నమస్కరిస్తున్నాము. అని ఈ విధంగా సమస్త జనులూ తనను స్తుతించగా విష్ణుమూర్తి ప్రసన్నుడై శివుడు ధ్వంసం చేసిన దక్షుని యజ్ఞాన్ని ఏ కొరత లేకుండ చక్కగా పూర్తి చేయించాడు.తాను సకలాంతర్యామియై సకల హవిస్సులను భుజించేవాడై కూడ తన భాగమైన ‘త్రికపాల పురోడాశం’ మంత్రంతోనే తృప్తిపడి దక్షునితో ఇలా అన్నాడు. పుణ్యాత్ముడా! నేనూ, బ్రహ్మా, శివుడూ ఈ లోకాలకు కారణభూతులం. వారిలో నేను ఈశ్వరుడను, సాక్షిని, స్వయంప్రకాశుడను అయి త్రిగుణాత్మకమైన నా మాయలో ప్రవేశించి సృష్టి స్థితి లయ కార్యాలకు కారణాలైన ఆయా పనులకు బ్రహ్మ రుద్రుడు మొదలైన నామాలను పొందుతాను. నాకంటె వేరైన పరబ్రహ్మ రూపం లేదు. బ్రహ్మ శివుడు మొదలైనవారిని, జీవకోటిని బుద్ధిహీనుడు నాకంటె వేరుగా చూస్తాడు. మనుష్యుడు తన చేతులు, కాళ్ళు మొదలైన అవయవాలను తన శరీరం కంటె వేరుగా చూడనట్లు నా భక్తుడు జీవులను నాకంటె వేరుగా భావింపడు. కనుక మా ముగ్గురిని ఎవడైతే వేరు వేరుగా చూడడో వాడే ధన్యుడు” అని ఉపదేశించగా దక్షుడు...

విష్ణువు ఉపదేశాన్ని దక్షుడు) విని విష్ణుదేవతాకమైన త్రికపాల పురోడాశ మనే యజ్ఞాన్ని చేసి విష్ణుమూర్తి పాదపద్మాలను పరమభక్తితో పూజించాడు. ఇంకా...

దక్షుడు అంగప్రధానకాలైన యాగాలను చేసి, దేవతలను, శివుణ్ణి పూజించి, వారి వారి భాగాలను వారికి సమర్పించి, ఋత్విక్కులతోను సోమపానం చేసినవారితోను అవభృథ స్నానం చేసి, యజ్ఞఫలాన్ని సమగ్రంగా పొందాడు. దేవతలు, మునులు, బ్రాహ్మణులు దక్షుని చూచి “ధర్మబుద్ధి కలిగి సుఖంగా జీవింతువు గాక!” అని దీవించి తమ తమ గృహాలకు వెళ్ళారు. విష్ణువు, శివుడు తమ తమ మందిరాలకు వెళ్ళారు.

ఆ తరువాత దక్షుని కూతురైన సతీదేవి పూర్వ శరీరాన్ని విడిచి, హిమవంతునకు, మేనకకు కుమార్తెగా జన్మించి, ప్రళయకాలంలో ప్రస్తుప్తమైన శక్తి సృష్టికాలంలో ఈశ్వరుని పొందిన విధంగా తన పూర్వభర్త అయిన రుద్రుని వరించింది” అని దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన రుద్రుని చరిత్రను బృహస్పతి తన శిష్యుడైన ఉద్ధవునకు చెప్పాడు. ఆ ఉద్ధవుడు నాకు చెప్పాడు. నేను నీకు చెప్పాను” అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇంకా ఇలా అన్నాడు. “ఈ కథను చదివిన బుద్ధిమంతులకు, విన్న ధీరులకు ఐశ్వర్యం, ఆయువు, కీర్తి లభిస్తాయి. పాపాలు, భవబంధాలు తొలగిపోతాయి.”అని ఇంకా ఇలా అన్నాడు. విదురా! విను. సనకుడు మొదలైనవారు, నారదుడు, హంసుడు, అరుణి, ఋభుడు, యతి అనే బ్రహ్మ కుమారులందరూ నైష్ఠికులై గృహస్థులు కాకపోవటం వల్ల వారి వంశాలు కొనసాగలేదు. ఇంకా అధర్మునకు మృష అనే భార్యయందు దంభుడు అనే కుమారుడు, మాయ అనే కుమార్తె జన్మించారు. అధర్మ సంతానం కనుక వారిద్దరూ దంపతులయ్యారు. వారిద్దరినీ సంతానం లేని నిరృతి దత్తు చేసుకున్నాడు. ఆ దంపతులకు లోభుడు అనే కుమారుడు, నికృతి అనే కుమార్తె కలిగి వాళ్ళు దంపతులయ్యారు. వారికి క్రోధుడు అనే కొడుకు, హింస అనే కూతురు పుట్టి భార్యాభర్తలయ్యారు. ఆ జంటకు కలి అనే కుమారుడు, దురుక్తి అనే కుమార్తె జన్మించి దంపతులయ్యారు. ఆ దంపతులకు భయం అనే పురుషుడు, మృత్యువు అనే స్త్రీ జన్మించి దంపతులయ్యారు. వారికి యాతన, నిరయం అనే జంట జన్మించి దంపతులయ్యారు. వీరు సంసార హేతువైన అధర్మం అనే వృక్షానికి కొమ్మలై వ్యాపించారు. తన మేలు కోరే మానవు డెవ్వడూ ఏమాత్రం వారిని అనుసరించకూడదు. ఈ విధంగా ప్రతిసర్గాన్ని నీకు సంగ్రహంగా వినిపించాను. ఈ పుణ్యకథను మూడుసార్లు చదివినవాడు పుణ్యాత్ముడౌతాడు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: