16, అక్టోబర్ 2020, శుక్రవారం

మోహముద్గరః** (భజగోవిందం)

 దశిక రాము**


**మోహముద్గరః** (భజగోవిందం)


3) 


నారీస్తనభర నాభీదేశం 

దృష్ట్వా మాగామోహావేశం |

ఏతన్మాంసవసాది వికారం

మనసి విచింతయ వారం వారం ||


జ్ఞానప్రాప్తికి అడ్డువచ్చేవి ఏవి ?

పూర్వకాలం నుండి జ్ఞాన సంపాదనకై తమ వద్దకు వచ్చిన శిష్యులకు ఆచార్యులు జాగ్రత్తలు చెబుతుంటారు. జ్ఞానప్రాప్తికి కాంతా కనకాలు అడ్డు వస్తాయి అని. అందుకే ఆ రెండింటి గురించి శంకరులవారు ముందే హెచ్చరిస్తున్నారు.

ధనంతో అవసరం ఉన్నది. దానికోసం పిచ్చి పరుగులు తీస్తూ అదే జీవిత పరమార్థంగా భావించి, నిరంతరం అందులోనే కూరుకుపోయి, ఆశలు పెంచుకొని నీ కర్తవ్యాన్ని మరచిపోవద్దు - అని చెప్పి; అలాగే స్త్రీ పురుష సంబంధమైన ఆలోచనలతో, మోహంలో పడిపోయి నీ కర్తవ్యాన్ని మరచిపోవద్దు అని హెచ్చరిస్తున్నారు. 

అసలు ఆడమగ మధ్య ఈ ఆకర్షణ ప్రాణికోట్లు అన్నింటిలోను ఉంటుంది. భగవంతుడే ఈ ఏర్పాటు చేశాడు. ఎందుకు చేసినట్లు? ఈ సృష్టి నిరంతరాయంగా కొనసాగటానికి. అయితే ఎందుకోసం ఏర్పాటు చేయబడ్డదో అందుకే పరిమితం కావాలి. ఈ సహజ సంబంధాన్ని నియమించాలి. నిగ్రహించాలి. 

విద్యాభ్యాసం చేసేటప్పుడు పూర్తి బ్రహ్మచర్యం. గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు గృహస్థ బ్రహ్మచర్యం. వానప్రస్థ సన్యాస ఆశ్రమాలలో పూర్తి బ్రహ్మచర్య నిష్ఠను పాటించాలి. 

ఎవరైతే నిగ్రహాన్ని పాటించగలుగుతారో వారే పరమాత్మ జ్ఞానాన్ని అందుకోగలుగుతారు. అందుకు తగిన సాధనలు చేయగలుగుతారు.

అయితే యవ్వనంలో ఉన్నప్పుడు గాని, ఇంద్రియాలు పటుత్వంతో ఉన్నప్పుడు గాని, మనస్సు కోరికలతో వేగిపోతున్నప్పుడు గాని, పరిస్థితులు, వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు గాని ఈ నియమం - నిగ్రహం సాధ్యమా? అనే సందేహం కలుగుతుంది. శరీరం విషయ సుఖాలవైపు పరుగులు తీస్తుంటే దాన్ని నిగ్రహించటం కష్టమే. అయినా దాన్ని ఎదుర్కొనటానికి ఒక ఉపాయాన్ని చెబుతున్నారీ శ్లోకంలో. అదే ప్రతిపక్ష భావన లేదా దోష దృష్టి. అంటే దోషాన్ని చూడటం.

నిజంగా ఇలాంటి దోషదృష్టి మనలో లేకపోలేదు. మన పిల్లవాడు ఐస్ క్రీం కావాలన్నాడు. దానిని కొనిపెట్టే డబ్బు నీ దగ్గర లేదు. అప్పుడేమంటావు? అబ్బే! జలుబు చేస్తుంది ఐస్ క్రీం అంటావు. ఒక గాజు బొమ్మను చూపించి అది కొనమంటాడు. అబ్బే! అది ఊరికే పగిలిపోతుంది - అంటావు. నీ భార్య రాళ్ళ నెక్లెస్ చేయించమంటుంది. ఆఁ ఎందుకు? ఎక్కడికన్నా పెట్టుకొని పోవాలంటే ప్రాణాలకు ముప్పు వచ్చేటట్లుంది ఈ రోజుల్లో. ఆ డబ్బు బ్యాంక్ లో వేసుకుంటే నెలనెలా వడ్డీ వస్తుంది అంటావు. ఇదే ప్రతిపక్ష భావన అంటే. దీనినే మనం ఇక్కడ అలవరచుకోవాలి. 

అయితే నిజంగా వస్తువులలో ఆకర్షణ లేదా? అంటే ఉంది. దానితో పాటు ఏవో లోపాలు, దోషాలు కూడా ఉంటాయి. మనం ఆకర్షణలను గాకుండా దోషాలను చూడాలి. అలా చూచినప్పుడే వాటి మీద మనకు నిర్లిప్తత, వైరాగ్యం కలుగుతాయి. దానినే “వివేక చూడామణి”లో ‘దోషదృష్ట్వా ముహుర్ముహు’ అని చెప్పారు. 

🙏🙏🙏 

కామెంట్‌లు లేవు: