16, అక్టోబర్ 2020, శుక్రవారం

16-07-గీతా మకరందము

 16-07-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇక అసురస్వభావము గలవారినిగూర్చి పండ్రెండు శ్లోకములద్వారా వివరముగ బోధించుచున్నారు-


ప్రవృత్తిం చ నివృత్తిం చ 

జనా న విదురాసురాః | 

న శౌచం నాపి చాచారో 

న సత్యం తేషు విద్యతే || 


తాత్పర్యము:- అసురస్వభావముగల జనులు ధర్మప్రవృత్తినిగాని, అధర్మనివృత్తినిగాని యెఱుగరు. వారియందు శుచిత్వముగాని, ఆచారము (సత్కర్మానుష్ఠానము) గాని, సత్యముగాని యుండదు.


వ్యాఖ్య:- అసురస్వభావయుతులు ధర్మకార్యములను చేయుటనుగాని, అధర్మకార్యములనుండి మఱలుటనుగాని యెఱుగరు. ఒకరు చెప్పినను వినరు. వీరు అధములు. తమ తప్పిదమునుగూర్చి మఱియొకరు చెప్పినపుడు దానిని మార్చుకొనువారు మధ్యములు. అసలు తప్పిదమే చేయనివారు ఉత్తములు. ఈ శ్లోకమున అధములను గూర్చియే చెప్పబడినది. మఱియు ప్రవృత్తి, నివృత్తియని ఇచట రెండు తెలుపబడినవి. ఇచట ‘ప్రవృత్తి' యనగా చేయదగినదియనియు, నివృత్తియనగా విడిచిపెట్టదగినది యనియు అర్థము. రెండిటిని విజ్ఞుడు తెలిసికొనియుండవలెను. అనగా దైవసంబంధకార్యములు, దైవగుణములు మున్నగు గ్రాహ్యవస్తువులనుగూర్చియు, విషయసేవనము, అధర్మకార్యములు, అసురగుణములు మున్నగు త్యాజ్యవస్తువులనుగూర్చియు ఎఱిగియుండవలెను. అసురస్వభావయుతులు వాని నెఱుగరని ఇట చెప్పబడినది.


ప్రశ్న:- అసురస్వభావుల కొన్ని లక్షణములను పేర్కొనుము?

ఉత్తరము:- (1) వారు ధర్మప్రవృత్తిగాని, పాపనివృత్తిగాని యెఱుగరు (2) శుచిత్వము, ఆచారము, సత్యము వారియందుండదు.

కామెంట్‌లు లేవు: