16, అక్టోబర్ 2020, శుక్రవారం

**సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


పదకొండవ శ్లోక భాష్యం - రెండవ భాగం


శ్రీచక్రంలో వృత్తానికి నడుమన తొమ్మిది త్రికోణములు ఒకదాని పైన ఒకటి పేర్చబడి నలభై మూడు త్రికోణములుగా కనిపిస్తున్నాయి. మధ్యనున్న బిందువును కూడా త్రికోణంగానే భావించి మొత్తం నలభై నాలుగు త్రికోణములుగా చెప్పే పాఠాంతరము కూడా ఉన్నది. ఈ నలభై మూడు (నలభై నాలుగు) త్రికోణములు ఆరు ఆవరణములుగా ఉన్నాయి.


ఆవరణ అనేదానికి కప్పబడినది, మరిచి ఉంచెడిది అన్న అర్థం వస్తుంది. ఇక్కడ ఒక వృతాంగానో, వరుసగానో అర్థం చెప్పుకోవాలి. ఒక వ్యక్తి చుట్టూ అనేకమంది నుంచుని ఉన్నపుడు మధ్యలోని వ్యక్తి మరుగున పడతాదు కదా! ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు. నలభై మూడు త్రికోణములు ఐదు ఆవరణలుగానూ, మధ్యలోని బిందువుతో చేర్చి ఆరు ఆవరణలుగాను ఉన్నది.


ముత్తుస్వామి దీక్షితుల వారి నవావరణ కృతి మీలో చాలామంది విని ఉంటారు. ఆ నవావరణ శ్రీచక్రానికి సంబంధించినదే! ప్రతి ఆవరణలోనూ ఎవరెవరు నివసిస్తారు. ఆయా ఆవరణలు ఏయే సత్యాలను తెలియపరుస్తాయి. ఈ ఆవరణల అధిష్టాన దేవతలెవ్వరు. ఏయే ముద్రలు ఆ ఆవరణకు చెందినవన్న విషయాలను చెప్పే శాస్త్రాలున్నాయి. దీక్షితుల వారు తమ నవావరణ కృతిలో ఈ విషయాల గురించి క్లుప్తంగా వివరించారు. నేను ఆరు ఆవరణల గురించి, 43 త్రికోణముల గురించి చెప్పాను కదా! ఈ ఆరు ఆవరణలకు వెలిప్రక్క మరో మూడు ఆవరణలున్నాయి. ఏడు ఎనిమిది ఆవరణలు పద్మపు రేకలున్న వృత్తములు. ఒకదానిలో ఎనిమిది, రెండవ దానిలో పది పద్మపు రేకులుంటాయి. ఈ ఎనిమిది ఆవరణలకు కలిపి బహిఃప్రాకార మొకటున్నది. నిజానికివి మూడు గోడలు. అన్నీ కలిపి కొలమానానికందని మహాశక్తిగల రేఖాచిత్రం తయారవుతోంది. అయితే దీనిని చిత్రంచడంలో అత్యంత జాగరూకత వహించాలి. ప్రతిరేఖ, ప్రతిత్రికోణము ఖచ్చితమైన కొలతలు కలిగి ఉండాలి. శబ్దంలో మార్పు వల్ల మంత్రం దుష్ఫలితాలనిచ్చే విధంగానే యంత్రనిర్మాణంలో చిన్న తేడా కూడా విపరీత పరిణామాలకు దారితీస్తుంది. నిర్మాణము సరిగానే ఉన్నా మధ్యనున్న త్రికోణం క్రిందకి కాక పైకి చూపబడితే మనమనుకొన్న ఫలితాలకు భిన్నమైన ఫలితాలుంటాయి. శ్రీయంత్రం పూజించే వారు విగ్రహాలను పూజించే వారికంటే ఎక్కువ ఆచారాన్ని, శౌచాన్నీ కలిగి ఉండాలి. శాస్త్రోక్తమైన విధివిధానాలను ఖచ్చితంగా పాటించాలి.


ఈ రోజుల్లో చాలామంది ఇళ్ళలో శ్రీచక్రపూజ అనే పేరుతో కొన్ని కర్మలు నిర్వహిస్తున్నారు. వారు దానిని ఒక ఫేషన్ గానో, తమ గొప్పతనాన్ని చాటుకుంటానికో చేస్త్రున్నట్లుగా అవుపిస్తాయి. వారిలో చాలామందికి పూజ ఎలా చేయాలో కూడా తెలియదు. ఏమయినా శ్రీచక్రార్చనలోని విధివిధానాలను సక్రమంగా అనుష్టించకపోతే ఫలితాలు దుఃఖదాయకంగా ఉంటాయి. మనశ్శాంతి కోల్పోతారు.


కర్మానుష్ఠానమో, పూజో చేయాలనే కోరిక ఉండటంతో సరికాదు. సత్ఫలితాలు పొందాలంటే శాస్త్రోక్త రీతిని చేయాలి. పెద్దలు, మహాపురుషులు ఏ రకంగా చేశారో వారిని ఆదర్శంగా పెట్టుకొని నేర్చుకోని చేయాలి. శ్రీచక్రార్చన మహత్త్వాన్ని గ్రథాలెంతగానో శ్లాఘించాయి. అవే గ్రంథాలు పూజ చేయవలసిన రీతులను వివరించాయి. *నా వీలుబట్టీ నాకిష్టమొచ్చిన రీతిలో నేను పూజ చేస్తానని* వాటిని విస్మరించడం మనకు సత్ఫలితాన్ని ఈయకపోగా, మనం అనుకొన్నదానికి వ్యతిరేకమైన ఫలితాన్నీయవచ్చు.


యంత్రం ఒక దేవతా నివాసమే కాదు. ఆ దేవత ప్రతినిధి కూడా! ప్రతినిధి అని చెప్పడానికి కూడా వీలులేదు. ప్రతి అంటె నకలుకదా, ఈ యంత్రం దేవతా స్వరూపమే. శ్రీవిద్యకు అంబిక దేవత. ఆమె సంస్థితి శ్రీయంత్ర రూపంలో ఉన్నదనటంలో సందేహం లేదు. అందువల్లనే శ్రీయంత్రానికొక ప్రత్యేకత ఉన్నది. లోకాశ్చర్యకరమైన సౌందర్యంతో ప్రకాశించే అంబిక రూపాన్ని పూజించడం కంటే అంబికను శ్రీయంత్ర రూపంలో పూజించడం ఉన్నతంగా చెప్పబడింది. నేనితఃపూర్వం అంబికకు రెండు నివాసాలని చెప్పాను. ఒకటి అమృత సముద్ర మధ్యలో, రెండవది మేరు శిఖరం పైన. శ్రీయంత్రము అంబిక మూడవ నివాసం.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: