16, అక్టోబర్ 2020, శుక్రవారం

ధార్మికగీత - 51*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                        *ధార్మికగీత - 51* 

                                  *****

      *శ్లో:- పరాధీనం వృథా జన్మ ౹*

             *పర స్త్రీషు వృథా సుఖం ౹*

             *పర గేహే వృథా లక్ష్మీ: ౹*

             *పుస్తకే విద్యయా వృథా ౹౹*

                          *****

*భా:- కన్నవారు, పెంచినవారు దూరమై, అండదండలు కరువై, నిలువనీడ లేక, పేదరికంతో పరుల పంచల నాశ్రయించి, పరుల మోచేతి నీళ్లు త్రాగుతూ గడిపే జీవనం నిరుపయోగమే. ఇంటిపేరును,కన్నవారిని త్యాగంచేసి, నిన్ను నమ్మి, వలచి వచ్చిన భార్యను నిర్లక్ష్యం చేస్తూ, పరకాంతా వ్యామోహంలో పడి పబ్బం గడుపుకోవడం అనేది దినదినగండమై తన జీవిత వినాశనానికే. పురాణాలలో దీనికి ఉదాహరణలు కోకొల్లలు. కొందరు తమ బంధువుల ఆస్తిపాస్తులను, ఉన్నత పదవులను ఘనంగా ప్రచారం చేస్తూ, ఆత్మానందంలో పరవశించి పోతుంటారు. పరుల ఆ సిరిసంపదల వల్ల తన కేమైనా వీసం లాభం ఉందా? లేదు గదా ! పర సంపద మనకు వృధానే కదా! కొందరు పుస్తకాలు కొని, సేకరించి అలమరలు భారీగా నింపుతుంటారు. ఒక్క పుస్తకం లోని అపారజ్ఞానామృత సారాన్ని మస్తకంలోకి కించిత్తైనా ఎక్కించే ప్రయత్నం చేస్తారా! చేయరు. ఇక ఆ ఆనంతవిజ్ఞాన భా౦డాగారం వల్ల తమకు ఒరిగేదేముంటుంది ? సున్న. పుస్తకం మస్తకంలో నిక్షిప్తమైతేనే సమయానికి అందలి రసజ్ఞత మన కుపకరిస్తుంది. ఆ రసానుభూతికి మన మరియు ప్రక్కవారి డెందాలు అమందానంద కందళితమౌతాయి*.

                                  *****

                   *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: