గోదావరి
✍️ గోపాలుని మధుసూదన రావు
గౌతముండు దొల్లి ఘన బ్రహ్మగిరిపైన
వాసముండె శిష్యవర్గములతొ
అపుడు కఱవురాగ నత్యంతగా కుంది
ధాత గూర్చి ఘోర తపము జేసె
బ్రహ్మదేవుడంత ప్రత్యక్షమైనంత
గౌతముండు పొందె ఘనవరంబు
విత్తువిత్తినంత వేవేగ పండియు
తనకు వచ్చునట్లు ధాన్యరాశి
బ్రహ్మవరమున బడసిన పంటతోడ
గౌతముడు తోటి ఋషులకు ఘనముగాను
ననయ మాహార వసతిని యందజేయ
నందఱును హాయి నుండిరి యతనిదలచి
ప్రతిదినమిట్లు గౌతముడు
పంటను దెచ్చుచు వండి పెట్టుచున్
నతులిత భక్తితోడ మునులందరి
యాకలి దీర్చుచుండగా
సతతము వారు చక్కగను
సంతస మొందుచు తిండి గ్రోలుచున్
మతిజెడి మత్సరంబునను
మానక దిట్టుచు నుండి రిచ్చలన్
అంత మునులంత జేరియు పంతగించి
యాత్మ శక్తితొ సృజియించి యావు నొకటి
పంప గౌతము డేసిన పైరుపైకి
మెసవె నయ్యది సర్వంబు మేతగాను
మాయా గోవా రీతిగ
సంయమి పండించినట్టి సస్యము నెల్లన్
మేయగ , గాంచియు దర్భను
వేయంగను యావు జచ్చె విస్మయ మొప్పన్
దర్భతొ యదిలించంగనె
దుర్భరముగ యావు చావ దుఃఖించి మదిన్
దౌర్భాగ్యమనియు దలచియు
నిర్భరముగ మునియు వెదికె నివృత్తికినై
గౌతముని దర్భపాటున గవి నశించ
"ఘోరగోహత్య పాపంబు గూడె నీకు
యర్హుడవు గావు నీ వన్నదానమునకు "
ననుచు వెలివేసి రప్పుడు యఖిలమునులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి