దశిక రాము**
**శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము**-32
🍁 శ్లోకం 26🍁
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ సృగ్విశ్వభుగ్విభుః|
సత్కర్తా సత్కృతస్సాధుః జహ్నుర్నాయణో నరః||
238. సుప్రసాదః --- అనంతమైన దయగలవాడు; అనుగ్రహ స్వరూపుడు; శుభకరమగు ఫలములను ప్రసాదించువాడు.
239. ప్రసన్నాత్మా --- సర్వకాల సర్వావస్థలయందును ప్రసన్నమైన, ప్రశాంతమైన మనసు గలవాడు; రాగాదులచే ప్రభావితము కానివాడు.
240. విశ్వసృట్, విశ్వసృడ్ --- విశ్వమును సృజించినవాడు;
విశ్వధృగ్ --- విశ్వమును తన అధీనములో ధరించి, బాగోగులు గమనించువాడు.
(పాఠాంతరములు) విశ్వసృగ్, విశ్వసృష్ట్
241. విశ్వభుగ్విభుః --- 'విశ్వ భుగ్ విభుః' అంతటను వ్యాపించి అన్నింటిని రక్షించువాడు.
శంకరాచార్యులు రెండు వేరువేరు నామములుగా వ్యాఖ్యానించిరి.
విశ్వభుగ్ --- జీవరూపమున విశ్వమును అనుభవించువాడు, భక్షించువాడు; అన్ని అనుభూతులను తనయందు లీనము చేసికొనును; అన్ని దిశలందును విస్తరించి విశ్వమును ఏర్పరచాడు
విభుః --- హిరణ్య గర్భుడై, మరియు అనేక రూపములు ధరించి, విశ్వమంతయును నిండి వెలుగుచున్న పరమేశ్వరుడు; సర్వము తానె యైనవాడు; అన్ని చోట్ల అన్నింటిని నింపువాడు; విశ్వమునకు ప్రభువు.
242. సత్కర్తా --- సజ్జనులను, పుణ్యవర్తనులను, ధర్మాత్ములను ఆదరించువాడు, సత్కరించువాడు.
243. సత్కృతః --- పూజనీయులచేత కూడా పూజింపబడువాడు; లోకైక పూజ్యుడు.
244. సాధుః --- (భక్తుల క్షేమమునకు అవుసరమైన పనిని) సాధించువాడు; సాధువర్తనుడు, సదాచార సంపన్నుడు.
245. జహ్నుః --- గుహ్యమైనవాడు, కానరానివాడు (మూఢులను విడనాడువాడు) ; ప్రళయకాలమున సమస్తమును లయము చేయువాడు; దోషులకు దూరముగానుండువాడు.
246. నారాయణః --- సకలాత్మలకు ఆధారమైనవాడు, జీవసముదాయములకు ఆశ్రయుడు; జగత్తంతయును (లోపల, వెలుపల) వ్యాపించియున్నవాడు; జలములకు (నారములకు) ఆధారము, జలములే నివాసము అయినవాడు; ప్రళయకాలమున జీవులకు నిలయమగువాడు.
247. నరః --- నాశనము (తుది) లేనివాడు; నడపించువాడు, నాయకుడు; నిత్యమగు చేతనాచేతనములకు విభూతిగా గలవాడు; జీవులను కర్మానుసారము ఉత్తమగతికి నడపువాడు..
శ్లో. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ దృగ్విశ్వ భుగ్విభుః
సత్కర్తా సత్కృతః సాధు ర్జహ్ను ర్నారాయణో నరః !!26!!
54. దండనందె చూపు దయగల హృదయమూ
రాగ, విరస రహిత రవణ మాత్మ
విశ్వమునకు పాదు, విశ్వమే సంగమం
వందనాలు హరికి వంద వేలు !!
{ అర్థాలు : సుప్రసాద ... తేలికగా అనుగ్రహించువాడు, ప్రసన్నాత్మ ... ప్రసన్నమైన ఆత్మ గలవాడు, విశ్వ దృక్ ... విశ్వానికి ఆధారం, విశ్వ భుక్ ... విశ్వాన్ని విలీనం చేసుకునేవాడు.
భావము : ఎలాంటి వారినైనా కొద్దిపాటి భక్తి లేదా నామ స్మరణతోనే కరిగి కైవల్యము చేర్చువాడు( కంస, పూతన, శిశుపాలాది దుష్టుల వృత్తాంతాలు తెలియజేస్తున్నదీ ఇదే కదా), రాగ ద్వేషాలు లేకుండా అందరి పట్లా సమానమైన ప్రేమ చూపే గొప్ప ఆత్మ గలవాడు (రవణము అంటే గొప్ప, కాంతిమంతమైన అనే అర్థాలూ ఉన్నాయి కదా) చిరు భక్తికే ప్రసన్నమయ్యేవాడు, విశ్వానికి ఆధారమైన(పాదు అంటే ఆధారము అనే అర్థమూ ఉన్నది కదా) వాడు, ప్రళయ కాలంలో సృష్టినంతటినీ తనలో విలీనం(సంగమం) చేసుకునే వాడూ అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }
55. విభుడె కాని దోచు విబుధ జనులకును
రూపులెన్నొ, కాదు రూపులన్ని!
సత్కరించుచుండు సత్కారమే పొందు
వందనాలు హరికి వంద వేలు !!
{ అర్థాలు : విభుః ...బ్రహ్మ, సత్కర్త .. సత్కరించువాడు, సత్కృత ... సత్కారము పొందువాడు.
భావము : విభుడే అనగా బ్రహ్మయే కాని, విబుధ జనులకు అనగా తనను కొలిచేవారికి కోరిన రూపంలో కనిపించే అనేకానేక రూపాలున్నవాడు, సాధు సజ్జనులైన భక్తులను సమాదరించువాడు, వివేకశీలురు, యోగ్యులునైన భక్తుల సత్కారము అనగా పూజాదికాలు అందుకునేవాడు అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }
56. సాధు వర్తనుండు సజ్జనులకెపుడు
కర్మ బట్టి చూపు గమ్యమొకటి
తత్త్వమెరిగినపుడు ధామమే చేర్చుగా
వందనాలు హరికి వంద వేలు !!
{ అర్థాలు : సాధు ... సాధు వర్తనుడు, జహ్ను ... కర్మానుసారం తగిన ఫలాలు అందిచే చేర్చువాడు, నారాయణ ... నీడ, నీరు (తత్త్వ సారం) ఇచ్చువాడు, నర ... నాయకుడు.
భావము : సత్ప్రవర్తన కలవారి పట్ల సాధువర్తనుడై మెలగేవాడు, కర్మానుసారం జీవులకు తగిన ఫలాలను అందించువాడు, అనగా తత్త్వం యెరిగిన సజ్జనులకు ఉత్తమ యోగమున్నూ, కానివారికి తగిన దండన మార్గమున్నూ చూపేవాడు, ఆ ఫలాల వద్దకు చేర్చే నాయకుడు ( అంటే వీలైనంత వరకూ మంచి మార్గాన నడిపించి సత్ఫలాల వైపు దారిచూపేవాడే నరుడు) అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.
( నర నారాయణులు అంటే కృష్ణార్జులేననీ, ఋుషి ద్వంద్వ మనీ కూడా కొన్ని భాష్యాలున్నాయి. అదలా ఉంచితే నార శబ్దానికి నీరు అనే మరో అర్థం ఉంది. శ్రీ హరి నివాసమే నీరు కదా అదే పరమ దామము కూడా. ఇక స్వర్గ నరకాలు అంటే దండ, దండనలే. అవీ ఆయన సృష్టియే కదా..... తెలుసుకోవలసిన తత్త్వమూ అదే కదా).}
-ఓం నమో నారాయణాయ
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి