16, అక్టోబర్ 2020, శుక్రవారం

సభా పర్వము -4

 సభా పర్వము -4

శిశుపాలుని వధ

ఆ తరువాత ధర్మరాజు తన నలుగురు తమ్ములను నలుగురిని పిలిచి నాలుగు దిక్కులకు జైత్రయాత్రకు పంపాడు. నలుగురు తమ్ములు నాలుగు దిక్కుల ఉన్న రాజులను, దేశాలను జయించి కప్పం కట్టించుకుని తిరిగి వచ్చారు.

భీమసేనుడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు నాలుగు దిక్కులను జయించి అసంఖ్యాకంగా ధన, కనక, వస్తు, వాహనములు తీసుకు వచ్చారు. ద్వారక నుండిశ్రీకృష్ణుడు అశేష ధన, కనక, వస్తు, వాహనాలతో వచ్చాడు. అవన్నీ ధర్మరాజుకు ఇచ్చి గౌరవించాడు. ధర్మరాజు అవి చూసి సంతోషించి రాజసూయయాగం ప్రారంభించాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో ” కృష్ణా ! నీ దయ వలన సార్వభౌమత్వం లభించింది. అశేష సంపదలు లభించాయి. నన్ను రాజసూయయాగం చేయడానికి నియోగించు ” అన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు తో “[ధర్మరాజ ! నీవు రాజసూయ యాగం ప్రారంభించు అందుకు నీ ఇష్టం పనికి నన్ను నీ ప్రియం కోరే ఇతరులను అనుమతించు ” అన్నాడు. శ్రీకృష్ణుని అనుమతి పొంది ధర్మరాజు రాజసూయం ప్రారంభించాడు. యాగానికి కావలసిన ఏర్పాట్లను చూడటానికి సహదేవుని నియమించాడు. శిల్పులను పిలిపించి యజ్ఞశాలను నిర్మింపచేసాడు. నానా దేశాధీసులకు ఆహ్వానం పంపాడు. ఆహారధాన్యాలను సమృద్ధిగా సమకూర్చారు. ధర్మరాజు ఆహ్వానాన్ని మన్నించి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుడు, శకుని,సైంధవుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు తదితరులు రాజసూయయాగానికి విచ్చేసారు. వచ్చినవారిని ధర్మరాజు తగిన రీతిన సత్కరించి వసతి ఏర్పాట్లు చేసాడు. అందరికి దానధర్మాలు చేయడానికి అధిపతిగా కృపాచార్యుని, కార్యాచరణకు భీష్ముని, ద్రోణుని, సకల వస్తు వ్యయమునకు విదురుని, నానాదేశరాజులు తెచ్చిన కానుకలు స్వీకరించటానికి దుర్యొధనుడిని నియోగించాడు. శుభముహూర్తములొధర్మరాజు యజ్ఞ దీక్ష తీసుకుని యజ్ఞశాలలో ప్రవేశించాడు. పైలుడు, ధౌమ్యుడు ఋగ్వేద ఋత్విక్కులుగానూ, యాజ్ఞవల్క్యుడు యజుర్వేద ఋత్విక్కునిగానూ, సుసాముడు సామవేద ఋత్విక్కుగానూ, వేదవ్యాసుడు ప్రధాన ఋత్విక్కుగానూ నారదాది మహర్షులు సదస్యులుగానూ భీష్ముడు సహాయకుడుగానూ ఉండగా యాగం మొదలైంది.

రాజసూయయాగం ప్రారంభం అయింది. భీష్ముడు ధర్మరాజు తో ఇలా అన్నాడు ” ధర్మరాజా ! స్నాతకుడు, ఋత్విజుడు ,భూతలేశుడు, సద్గురుడు, జ్ఞానసంపన్నుడు, అందరికీ ఇష్టుడు అయిన మహానుభావుని ఒకరిని పూజించు ” అని అన్నాడు. ధర్మరాజు భీష్మునితో ” పితామహా ! అటువంటి మహానుభావుడెవరో మీరే శలవీయండి ” అన్నాడు. భీష్ముడు ” ధర్మనందనా ! ఇంక ఎవ్వరున్నారు ? సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడే అగ్ర పూజకు తగిన వాడు ” అని ధర్మరాజు తో చెప్పాడు. తనమనసులో మాట చెప్పినందుకు ధర్మరాజు ఆనందపడి సహదేవుడు తెచ్చిన అర్ఘ్యపాద్యాలను శ్రీకృష్ణునకు సమర్పించాడు.

ఇది చూసి శిశుపాలుడు సహించలేక పోయాడు. ధర్మరాజు ని చూసి ” ఓ ధర్మరాజా! ఈ సభలో ఎందరో మహారాజులు, బ్రాహ్మణోత్తములు ఉన్నారు. వారిని కాదని ఈ గాంగేయుడు చెప్పాడని చెడు నడవడి కలిగిన ఈ కృష్ణుని పూజిస్తావా ? ఇది అవివేకం కాదా ? ఈ భీష్మునికి ఆలోచనలేకపోతే నీ బుద్ధి ఏమైంది? మీకు కృష్ణుడు కావలసిన వాడైతే మీ ఇంటికి తీసుకు వెళ్ళి పూజలు చేయండి. ఈ మహాసభలో పూజించి మమ్మల్ని అవమానించ కండి. కృష్ణుడు ఇంతటి మర్యాదకు అర్హుడు కాదు ” అంటూ శిశుపాలుడు సభ విడిచి వెళ్ళాడు.

ధర్మరాజు శిశుపాలుని వెంట వెళ్ళి ” శిశిపాలా ! నీ వంటి ప్రభువులు ఇలా పరుషంగా మాటాడ తగునా ? శ్రీకృష్ణుడు సాక్షాత్తు మహావిష్ణు అవతారం కనుక భీష్ముడు అగ్రపూజ చేయమన్నాడు. లోకోత్తరుడని అందరిచే శ్లాగించబడే కృష్ణుని నువ్వు ఇలా కాదనడం భావ్యమా ? ” అని శిశుపాలునికి నచ్చచెప్ప పోయాడు. భీష్ముడు ” ధర్మరాజా ! శిశుపాలుడు బాలుడు, చెడు నడత కలిగిన వాడు. పెద్దలను అకారణంగా నిందించే వాడు. కొద్దిపాటి రాజ్యం లభించగానే మదం ఎక్కిన వాడు. వాడికి ధర్మాధర్మాలు తెలియవు. అతడిని ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తావు ? ” అని శిశుపాలుని చూసి ” శిశుపాలా! బుద్ధిహీనుడా శ్రీకృష్ణునికి అగ్రపూజకు అర్హత లేదా ? ఇక్కడ ఉన్న రాజులంతా జరాసంధుని నుండి విడిపించింది ఈ మహానుభావుడే కదా. బాలుడైనా జ్ఞానవృద్ధుడు పూజనీయుడే. అమిత పరాక్రమవంతుడైన క్షత్రియుడు పూజనీయుడే. శ్రీకృష్ణుడు మహాజ్ఞాని, మురుడు అనే రాక్షసుని సంహరించిన పరాక్రమ వంతుడు. ఇతరులను పూజిస్తే వారు మాత్రం తృప్తి చెందుతారు. లోకారాద్యుడైన కృష్ణుని పూజిస్తే లోకమంతా తృప్తి చెందుతుంది ” అన్నాడు. ఇంతలో సహదేవుడు లేచి ” శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయడం మా ఇష్టం . కాదన్న దుర్జనులను నా పాదం క్రింద అణిచివేస్తాను ” అంటూ పాదం ఎత్తి భీకరంగా నిలబడ్డాడు. సభ అంతా సహదేవుని భీకరరూపంచూసి భయపడింది. శిశుపాలుని సైన్యాధిపతి తన సైన్యాన్ని తమపక్షాన ఉన్న రాజులందరిని ఒకటిగా చేర్చి యుద్ధానికి సిద్ధం అయ్యాడు.

ఈ పరిణామానికి ధర్మరాజు కలత చెందాడు. భీష్ముని చూసి ” పితామహా ! ఆహుతులైన రాజులంతా కలత చెంది ఉన్నారు. తమరే శాంతింప చేయాలి ” అన్నాడు . భీష్ముడు ” ధర్మజా! కలత పడకు. సకల రాక్షస సంహారుడు శ్రీకృష్ణుడు యాగరక్షకుడుగా ఉండగా ఈ యాగాన్ని ఎవరూ విఘ్నం చేయలేరు ” అన్నాడు. ఆ మాటకు శిశుపాలుడు కోపించి ” ఈ ముసలి భీష్ముడు యాదవుని పరమేశ్వరునిగా చేసాడు. ఈ పాండవువులు ధర్మాత్ములూ, ధీరులూ అయితే ఇక్కడున్న రాజులు అధర్మవర్తనులూ అధీరులా ? పూతన అనే స్త్రీని చంపుట, ప్రాణ రహితమైన బండిని తన్నుట, పుచ్చిన చెట్లను పడత్రోయుట, చిన్న పుట్టలాంటి కొండను ఎత్తుట పరాక్రమమా ? స్త్రీ వధ చేసినవాడికి మర్యాదలా ? అలాంటి వారిని పొగిడే వారిని సహస్ర చీలికలుగా చేయాలి. ఇక తమరి సంగతి మరొకరు ప్రేమించిన కన్యను తమ్ముడికి కట్టబెట్టాలని చూసావు. కాని ధర్మం తెలిసిన నీ తమ్ముడు అంబను విడిచి పెట్టాడు. సంతాన హీనుడివి నాకు ధర్మపన్నాలు చెప్తావా! ఈ కృష్ణుడు వీరత్వం తెలియనిదా. మహావీరుడైన జరాసంధునికి భయపడి పది సార్లు పారిపోయాడు. కపట బ్రాహ్మణవేషాలలో వెళ్ళి చంపడం వీరత్వమా ? ” అని దూషించాడు. శ్రీకృష్ణుని తూలనాడటం సహించలేని భీముడు శిశుపాలుని చంపటానికి ముందుకు దూకాడు. భీష్ముడు భీముని ఆపాడు.

భీష్ముడు భీమునితో ” భీమసేనా! ఈ శిశుపాలుని నువ్వు చంపరాదు

ఈ దుర్మార్గుడు దమఘోషుడు సాత్వతికి పుట్టాడు. పుట్టుకతోనే నాలుగు భుజాలతో, నొసటి మీద కంటితో, గార్దభ స్వరంతో పుట్టాడు. తల్లి తండ్రులు ఆ బాలుని చూసి కలత చెందారు. అప్పుడు అశరీరవాణి ఈ బాలుడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలో ఇతడు హతుడు కాగలడు ” అని పలికింది. అప్పటి నుండి ఆ బాలుని ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగారు. ఒకరోజు బలరామ కృష్ణులు ఆ బాలుని చూడటానికి వచ్చారు. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తధ్యమని భావించిన సాత్వతి శ్రీకృష్ణుని చూసి ” కృష్ణా ! నీ మరిది అయిన శిశుపాలుని రక్షించు ” అని కోరింది. అలాగే అన్నాడు కృష్ణుడు. ఇతని నూరు తప్పులు సహిస్తాను అవి పూర్తి కాగానే నా చేతిలో హౌతుడౌతాడు ” అని చెప్పాడు భీష్ముడు. అప్పటికి శిశుపాలుడికి బుద్ధి రాలేదు.” కృష్ణా! ఈ ముసలి భీష్ముడు పాండవులు నిన్ను సన్మానించడం నేను సహించలేను. నాతో యుద్ధానికి సిద్ధం కండి ” అన్నాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు సభాసదులను చూసి ” మేము ప్రాగ్జ్యోతిష పురం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు ద్వారకను తగులబెట్టాడు. భోజరాజులు రైవతకాద్రి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపాడు. నా తండ్రి వసుదేవుడు అశ్వమేధయాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు. బబ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. నా అత్త సాత్వతి కోరిక ప్రకారం నూరు తప్పులు సహించాను. ఇతడు నాకు పరమ శత్రువు అయ్యాడు ” అన్నాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుని చూసి ” నేను వివాహమాడదలచిన కన్యను అపహరించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నావా ? ” అని దూషించావు .ఇక శ్రీకృష్ణుడు సహించలేక పోయాడు . తన చక్రాయుధం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజు తో అతని అంత్యక్రియలు జరిపించమన్నాడు. శిశుపాలుని కుమారుని ఛేదిదేశానికి రాజుని చేసాడు. శిశుపాలుని వధతో రాజసూయం పరిసమాప్తి అయింది.

కామెంట్‌లు లేవు: