16, అక్టోబర్ 2020, శుక్రవారం

మహాభారతము ' ...52 .

 మహాభారతము ' ...52 . 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


సభా పర్వం..


ద్యూతక్రీడా భవనం లోకి పాండవులు ప్రవేశించారు. అక్కడకు విచ్చేసిన వారందరినీ ఆదరంగా పలుకరించి, పెద్దలకు నమస్కరించి, తమకు కేటాయించిన ఆసనాలలో కూర్చున్నారు.  


కౌరవుల ప్రతినిధిగా శకుని, ధర్మరాజును పలుకరించి, ' ద్యూతక్రీడను మొదలు పెడదామా ? ' అని అడిగాడు. చివరి ప్రయత్నంగా ధర్మరాజు శకునితో, ' శకుని మామా ! మనకు వినోదం కావాలంటే, ఆడడానికి అనేకక్రీడలు వున్నాయి. ఈద్యూతక్రీడ ఆడాలనే ఆలోచన యెవరికివచ్చింది ? దీనిలో క్షత్రియ పరాక్రమంచూపించే అంశం యేమీలేదే ! పైగా కుటిలమైన ఆలోచనలు చేసి గెలవడానికి యీ క్రీడలో యెంతో ఆస్కారముంది. మీరు చూపించుతున్న వుత్సాహం చూస్తుంటే, మీరేదో కుటిలమైన ఆలోచనతో మమ్ములను ద్యూతక్రీడకు ఆహ్వానించినట్లుగా అనిపిస్తున్నది. ఇప్ప టికైనా మించిపోయినది యేమీలేదు. మరియొకసారి పెద్దలందరూ ఆలోచించవలసినదిగా మా మాటగా చెప్పండి.' అని శకునితో ధర్మరాజు నిర్మొహమాటంగా చెప్పాడు.  


ధర్మజుని మాటలకు శకుని త్వరితంగా అడ్డుపడ్డాడు. ఈమాటలు భీష్మాది పెద్దలు వింటే, అసలుకే మోసం వస్తుందని, ధర్మజునితో ' యుధిష్ఠరా ! జూదం అనేది కేవలం అదృష్టం మీద ఆధారపడి సాగే ఆట. ఇరు పక్షాలకీ సమమైన భయాందోళనలు వుంటాయి,గెలుపు విషయమై. కాబట్టి సందేహించకు. ' అన్నాడు. ' మేము న్యాయంగా సంపాదించినా సంపదను మీరు అన్యాయంగా మానుండి గెలిచి, మీ విందులు, వినోదాలకు, మీ భోగలాలసకు వినియోగించుదామని చూస్తున్నారు. ' అన్నాడు ధర్మరాజు.


అయితే అందుకు యేమాత్రం తగ్గకుండా శకుని, ' మీకు ద్యూతక్రీడా నైపుణ్యము, తెగువ, దైవం పై నమ్మకం వుంటే యీ క్రీడ ఆడడానికి మీనమేషాలు లెక్కపెట్టరు. మీకు మాపై అనుమానం వుంటే, మీకు నైపుణ్యం లేదని ఒప్పుకుని, ధృతరాష్ట్రుని అనుమతితో మీరు శీఘ్రమే వెళ్లిపోవచ్చును, యెప్పుడు కావాలంటే అప్పుడు, ఆటమధ్యలో. అంతేకాని, మాపై అనవసర నిందారోపణలుచేయడం వుచితంకాదు.' అని కుటిలమైన నవ్వుతో ధర్మజుని రెచ్చగొట్టాడు శకుని.  


' శకునీ ! ఆహ్వానంపై వచ్చి తిరిగివెళ్ళే ప్రసక్తే లేదు. కానిమ్ము. విధి బలీయమైనది. దుర్యోధనా ! ఆట మొదలుపెట్టు. ' అన్నాడు ధర్మజుడు. ' నా వంతున మామ శకుని ఆడతాడు. పందెం వొద్దడానికి నేను సిద్ధం. ' అన్నాడు దుర్యోధనుడు. ' నీ తరఫున యింకొకరు ఆడడం నియమవిరుద్ధం. ఆలోచించు. ఆపై నీకెలా తోస్తే అలాగే చేద్దాము. ' అన్నాడు ధర్మజుడు.


ఇంతలో సభలోకి ధృతరాష్ట్రుడు, అయిష్టంగానే విదురుడు, బీష్మ, ద్రోణ మొదలైన పెద్దలు వచ్చి కూర్చున్నారు. అందరికీ యిది ఒక కాలక్షేప సామూహిక క్రీడ అనే భావం కలుగజేసి శకుని వారిని రప్పించాడు. ఒక్క విదురునికీ, ధర్మజునికీ మాత్రమే తెలుసు, ఇందులో కుటిలనీతి దాగున్నదని.  


ఇక ఆట మొదలైంది. ముందుగా ధర్మరాజు మణిమయమైన సువర్ణమాలను పందెం గా వొడ్డి ఓడిపోయాడు. శకుని పాచికలు పట్టుకుని, చేతిని అస్తవ్యస్తంగా పోనిచ్చి ద్యూత క్రీడ కు విరుద్ధంగా ఆడాడు. ధర్మజుడు చూసికూడా బంగారమే కదా పోనీలే అని కేవలం శకునిని హెచ్చరించి వూరుకున్నాడు. బంగారము, ధనరాశులను గుమ్మరించాడు రెండవసారి. అదికూడా ఓడిపోయాడు. ముచ్చటగా మూడవసారి, తన విలువైన చైత్రరథం పణంగాపెట్టి ఓడిపోయాడు.  


క్రమక్రమంగా ధర్మరాజు జూదమనే వూబిలో దిగిపోయాడు. తరువాతి పందెంలో లెక్కకు మిక్కిలి దాసదాసీజనాన్ని పందెంలో ఒడ్డి వారినికూడా ఓడిపోయాడు. ఆతరువాత అసంఖ్యాకమైన సేవకులను కూడా ఓడిపోయాడు.


శకుని పాచికలు అధర్మంగా విసురుతూనే వున్నాడు, పాండవుల సంపదను కొల్లగొడుతున్నారు. ఇదంతా చూస్తున్న విదురునిలో ఆవేశం కట్టలు త్రెంచుకున్నది. 


స్వ స్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.

తీర్థాల రవి శర్మ

9989692844

కామెంట్‌లు లేవు: