14, డిసెంబర్ 2022, బుధవారం

శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం, వరదరాజపురం*

 *గుండెలపై కాదు... తలపై కుంపటి ఈ గుడి - "తెలంగాణ కంచి" శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం, వరదరాజపురం*


*ఈ దేవాలయంకి వెళ్లే దారి:-*

*E.C.I.L క్రాస్ రోడ్* నుంచి *కుశాయిగుడా, కీసర* గ్రామాలు దాటి *అంకిరెడ్డిపల్లె* చౌరస్తాకి వెళ్లాలి. అక్కడ నుంచి *మూడుచింతల క్రాస్ రోడ్* చేరుకుని, *కరకపట్ల* ఊరు దాటాలి. ఆ తరువాత *8 కి.మీ.* వెళ్తే *వరదరాజుపురం* వస్తుంది. 

ఓ *40 కి.మీ.* ప్రయాణించాలి. దారి బాగుంటుంది. లేదా *షామీర్ పేట* దాటి *ప్రజ్ఞాపూర్* చౌరస్తా వెళ్లి, అక్కడ కుడివైపుకి తిరిగి *12 కి.మీ.* వెళ్తే *వరదరాజ పురం* చేరుకోవచ్చు. ఈ దారిలో *సిద్ధిపేట - భోనగిర్* బస్సులు కూడా వెళ్తాయి


*గూడ పెరుమాళ్లు పంతులు* తలపై కుంపటి...;

చేతుల్లో *వరదరాజపెరుమాళ్* దేవతా మూర్తి...;

కుంపట్లో కణకణలాడే నిప్పు కణికలున్నాయి...;

ఆయన కళ్లలో మాత్రం మిలమిలలాడే ధృడతసంకల్పం, తళతళలాడే దృఢనిశ్చయం ఉన్నాయి...;

జనం వేల సంఖ్యలో పోగై *పెరుమాళ్* ను చూస్తున్నారు...; *పెరుమాళ్*  చేతులోని *పెరుమాళ్* ను చూస్తున్నారు. భక్తితో జోతలు చేస్తున్నారు. పారవశ్యంతో జోహార్లు చేస్తున్నారు.


అక్కడ *గోల్కొండ నవాబు* సైన్యం మొహరించింది. *జాగీర్దారు* ఓ కుర్చీపై కూర్చున్నాడు. *కంచికి వెళ్లి, వరదరాజ పెరుమాళ్ ని దర్శించి, వస్తూ వస్తూ నా ఊరిలోనూ వరదరాజ పెరుమాళ్ల గుడి కట్టుకుంటానని "గూడ పెరుమాళ్ల పంతులు" అనుకున్నాడు. అనుకోవడమేమిటి... వరదరాజపెరుమాళ్ విగ్రహాన్ని చేయించుకుని, అపార భక్తి శ్రద్ధలతో, అనంత పారవశ్యంతో తలపై మోసుకొచ్చాడు.*


సరిగ్గా *మెదక్* జిల్లా *జగదేవపూర్* మండలానికి వచ్చే సరికి *నవాబు సైనికులు* ఆగమన్నారు. *విగ్రహాన్ని పెట్టడాన్ని, గుడి కట్టటాన్ని ఒప్పుకునేది లేదని* దబాయించారు. *నా దేవుడి గుడిని నేను కట్టుకుంటాను. నన్నూ నా దేవుడిని వదిలేయండి* అని *పెరుమాళ్లు పంతులు* వేడుకున్నాడు. ఆ వెర్రి బాపడిని చూసి నవాబు సైనికులు పగలబడి నవ్వారు. *జాగిర్దారు తలపై కణకణమండే బొగ్గుల కుంపటిని మోసుకుని నడిస్తే గుడి కట్టుకునేందుకు అనుమతినిస్తానన్నాడు.* పెరుమాళ్లు పంతులు అంతే పట్టుదలగా *నా పెరుమాళ్లుకి ఈ పెరుమాళ్లు భక్తుడు. నా భక్తే నిజమైతే నడవటం ఏమిటి... పరిగెడతాను కూడా* అన్నాడు.

*అయితే ఒక షరతు... కుంపట్లో బొగ్గు మసి కాకూడదు. నీకు వేడి తగలకూడదు*

*నా పెరుమాళ్లు ప్రహ్లాదుడిని రక్షించాడు. గజేంద్రుడిని కాపాడాడు. నన్నూ కాపాడతాడు*

*పాగల్ బొమ్మన్...* పగలబడి నవ్వాడు జాగిర్దారు.


*నాదీ ఒక షరతుంది ఒప్పుకుంటావా!? జాగీర్దార్ సాబ్.. పెరుమాళ్లు గొంతు పెనుసింహం గర్జనలా గర్జించింది...

నేను కుంపటి తలకెత్తుకుని ఎంత దూరం నడుస్తానో అంత మేర భూమిని నాకిచ్చేయాలి. నా దేవుడికి గుడి కట్టుకునేందుకు ఆ భూమి నాకిచ్చేయాలి.

సరే ...కానిమ్మన్నాడు జాగిర్దార్. *జాగిర్దార్ ది హిరణ్యకశిపుడి అహంకారం. పెరుమాళ్లుది ప్రహ్లాదుడి భక్తి...*

పెరుమాళ్లు నడిచాడు... నడిచాడు... రోజు రోజంతా నడుస్తూనే ఉన్నాడు. అలసట లేదు. ఆయాసం లేదు. ఆగడం అంతకన్నా లేదు. అమ్మా అనలేదు. అయ్యో అనలేదు. వరదరాజ స్వామి వరద హస్తం తలపైనుందో లేక నరసింహుడే అవరించాడో తెలియదు కానీ *1,500 ఎకరాలు* చుట్టివచ్చి, జాగిర్దారు ముందు కుంపటి దించాడు. *బొగ్గు బూడిద కాలేదు. కణకణ మండుతూనే ఉంది. పెరుమాళ్లు తలపై కనీసం మాడినట్టుగా మచ్చ లేదు*. ఖంగుతిన్న జాగీర్దార్ *తూ జీత్ గయారే బొమ్మన్* అని గుడి కట్టుకోవడానికి అనుమతిచ్చాడు. అంతే కాదు... *1,500 ఎకరాలూ* వదులుకున్నాడు.


*ఆ 1,500 ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా తన కోసం దాచుకోలేదు పెరుమాళ్లు పంతులు.* మొత్తం గుడి కట్టించాడు. *సువిశాలమైన గుడి, బృహదాకారపు కోనేరు, వసతి గృహాలు, విశ్రామ మంటపాలు, మహాసింహద్వారం, పెద్ద రాజ గోపురం, వాహనాల మంటపం, రథాల మంటపం చూస్తే పెరుమాళ్లు పంతులు సమర్పణ భావం కనిపిస్తుంది. తన సంపదను దేవుడికి పెట్టాడు. నగలు, కిరీటాలు, వడ్డాణాలు, యజ్ఞోపవీతాలు చేయించాడు. 16 మంది పూజారుల్ని పెట్టాడు. పండగలు, పబ్బాలు, జాతరలు, తీర్థాలకు లోటు లేకుండా చేశాడు. వరదరాజుల వారికి రక్షణగా ఊరి మొదట్లో అంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించాడు.*


ఊళ్లో గుడి వెలియలేదు. గుడి చుట్టూ ఊరు వెలిసింది. వరదరాజ స్వామి పేరిట *వరదరాజపురం* ఏర్పాటైంది. *మెదక్* జిల్లా *జగదేవ్ పూర్* మండలంలో *వరదరాజు* ఇప్పటికీ ఉన్నాడు. *పెరుమాళ్లు పంతులు వారసులు 450 ఏళ్లుగా సేవలందిస్తూనే ఉన్నారు. పరంపరాగత ధర్మకర్తలుగా కొనసాగుతూనే ఉన్నారు. వారిప్పుడు మౌలాలీ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటున్నారు. అలనాటి పూజారుల వారసులే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. దేవుడిని నమ్ముకుని పూజలు చేస్తూనే ఉన్నారు.*


ఇదంతా *450 ఏళ్ల* క్రితం సంగతి. ఇదంతా కట్టుకథ అనుకునేవాళ్లు, స్థానిక జనసందోహం చేసిన ధార్మిక విప్లవానికి ముస్లిం నవాబు తలొగ్గాడని టీకా చెప్పుకోవచ్చు. *రామదాసు భద్రాచలం గుడి కట్టడం హైందవ జన చైతన్యానికి ఎలా ప్రతీకో, వరదరాజపురం గుడి కూడా అలాగే ఒక ధార్మిక జన విప్లవ ప్రతీక.* అయితే *ఇప్పటి తరానికి ఈ గుడి కథ తెలియదు. దీని గొప్పదనం తెలియదు. ఎప్పుడైనా రాత్రి నిద్ర చేయాల్సి వస్తే మాత్రం పది ఊళ్లకి వరదరాజస్వామే దిక్కు.*


టాల్స్టాయ్ కథ ఒకటుంది. ఓ రైతు రోజంతా ఎంత మేర నడిస్తే అంత భూమి ఇస్తానని జమీందారు చెపుతాడు. అయితే మొదలుపెట్టిన చోటకి తిరిగి రావాలని షరతు పెడతాడు. ఆశ, ఆత్రం కలగలిసి రైతు పరుగు పెట్టి పెట్టి చివరికి గమ్యం చేరకుండానే చనిపోతాడు. *వరదరాజపురం* లో *పెరుమాళ్లు పంతులు* కూడా రోజంతా తిరిగాడు - అదీ తలపై కుంపటిపెట్టుకుని... ఈయన చనిపోలేదు. ఈ గుడి రాతి బండల్లో, స్తంభాల్లో, గోపురంలో, పునాదిరాయిలో ఇంకా బతికే ఉన్నాడు. తన కోసం చేసుకునే దానికి, ధర్మం కోసం చేసే దానికి ఉన్న తేడా అది.


*_ఒక్కసారి "వరదరాజపురం" వెళ్లండి. వరాలిచ్చే వరదరాజుని దర్శించుకొండి. తరతరాలుగా గుడిని నమ్ముకుని బతుకుతున్న పూజారికి దక్షిణ ఇవ్వండి. శతాబ్దాలుగా గుడికి పోషకులుగా ఉన్న గూడ పెరుమాళ్లు వారసుల ఫోటోలను చూసి దండం పెట్టుకొండి._*.


*మీరు ఈ దేవాలయాన్ని దర్శించండి. ఆ స్వామినే నమ్ముకుని ఆ దేవాలయంలో స్వామీ సేవ చేస్తున్న వంశపారంపర్య అర్చకులకు దక్షిణ ఇచ్చి వారికి ఇతోధికంగా సహాయం చేయండి. మీ మిత్రులతో మరియు సన్నిహితులతో ఈ దేవాలయం గురించి హి వివరించండి. ఈ క్షేత్రం "తెలంగాణా కంచి" వరదరాజ దేవాలయంగా మారడానికి కృషి చేద్దాము_*

కామెంట్‌లు లేవు: