8, జూన్ 2022, బుధవారం

మామిడి పండు

 త్రపశ్యామ జంబూ

ర్దళిత హృదయం దాడిమ ఫలమ్

సశూలం సంధత్తే హృదయ

మభిమానేన పనసః

భయా దంతస్తోయం

తరు శిఖరజం లాంగలి ఫలమ్

సముద్బూతే చూతే

జగతి ఫలరాజే ప్రసరతి.

దళితంబయ్యెను గుండె దాడిమకు,

మీదన్ సల్పు జంబూఫలం

బులకం గల్గెను సిగ్గుచే,

పనస రొమ్ముంగ్రుమ్మె శూలమ్మున్

సలిలంబయ్యెను గుండె కొబ్బరికి

వృక్షాగ్రమ్మునన్ భీతిచే,

ఫలరాజంబను పేర చూతమునకున్

ప్రఖ్యాతి ప్రాప్తించుటన్.


భావం:


అప్పటి వరకు ఎన్నిరకాల పండ్లు ఉన్నప్పటికీ మామిడి పండు వచ్చే సరికి అందరి మనసు దాని మీదకే పోతుంది. దాంతో అది ఫలరాజుగా గణుతికెక్కుతుంది. 


ఇది సహించని తక్కిన  ఫలాల పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి


మామిడి పండు వచ్చి ఫలరాజుగా జనులచేత కీర్తింపబడటాన్ని చూచి నేరేడు పండు సిగ్గుతో ముఖం నల్లగా మాడిపోయింది.


తరుశిఖరిజం చెట్టు కొనన పుట్టే లాంగలి ఫలం నారికేళం కుమిలి కుమిలి లోలోపలే ఏడ్చి  ఏడ్చి లోపలనే నీటితో నిండిపోయిందట.


ఇక పనస పండు ఎందుకొచ్చినది ఈ బ్రతుకు అని అభిమానంతో శూలాన్ని లోపలకు పొడిచేసుకుందట.


ఇలా ఆయా ఫలాలో ఉండే సహజ లక్షణాలకు కారణాలను ఆపాదించటమే కాక మానవీకరణ చేసి చెప్పడంతో అద్భుత కవిత్వమైంది.


నేరేడు సహజంగా నల్లగానే ఉంటుంది. దానికి కవి సిగ్గు ఆపాదించారు.


దానిమ్మ పండు సహజంగా పగిలి గింజలు కనిపిస్తూ ఉంటుంది. దీనిని హృదయం బద్దలైపోయినట్ల చెప్పారు.  


నారికేళం  లోపల నీరుంటుంది. దానికి లోలోపల కుమిలిపోయినట్లు చెప్పారు. 


ఇక పనసకు మధ్యభాగంలో ఈ చివరినుంచి ఆ చివరకు పెద్ద కాడ ఉంటుంది. దానిని లోపల శూలాన్ని పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు.


రసగంగాధరమను ఆలంకారిక గ్రంథములో మాత్సర్యమను గుణమునకు లక్ష్యముగా ఈ శ్లోకమును చెప్పారు పండిత జగన్నాథ రాయలు.


ఇంతటి సంస్కృత పండితుడు అచ్చమైన మన తెలుగువాడు కావడం మరో విశేషము.


- వాదారి నారాయణ

కామెంట్‌లు లేవు: